కళాఖండాలు గోరింటై పూశాయి...

పెళ్లి ఎవరికైనా జీవిత కాలపు మధురానుభూతి. ఆ క్షణాల్ని అపురూపంగా మలచుకోవాలని తపించింది అంజలి. చిత్రలేఖనాలంటే తన ఇష్టాన్ని చాటడానికీ, మూడుముళ్ల వేడుకను వైవిధ్యంగా చేసుకోవడానికి సృజనాత్మకతకు పదును పెట్టింది. ఆ చిన్న

Published : 12 Jul 2022 01:59 IST

పెళ్లి ఎవరికైనా జీవిత కాలపు మధురానుభూతి. ఆ క్షణాల్ని అపురూపంగా మలచుకోవాలని తపించింది అంజలి. చిత్రలేఖనాలంటే తన ఇష్టాన్ని చాటడానికీ, మూడుముళ్ల వేడుకను వైవిధ్యంగా చేసుకోవడానికి సృజనాత్మకతకు పదును పెట్టింది. ఆ చిన్న ఆలోచన ఇప్పుడు ఆమెకు లక్షల అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ తనేం చేసిందో చూడండి...

చిత్రకళపై తన అభిమానాన్ని అంజలీ తపాడియా మెహందీగా పండించుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళాకారులపై తన అభిమానాన్ని ఇదిగో ఇలా చాటుకున్నానంటూ ఎర్రగా పండిన తన గోరింటాకు చేతుల వీడియోను ఇన్‌స్టాలో పొందుపరిస్తే దాదాపు 8 లక్షల మంది చూసి ప్రశంసలతోపాటు అభినందనలను కలిపి మరీ పంపారు.

నా మనసు ...

నా హృదయాన్ని గెలుచుకున్న ఆకాష్‌ టాండన్‌ తన ఆకాంక్షనూ అర్థం చేసుకున్నాడు అంటుంది అంజలి. ‘చిత్ర లేఖనాలంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎక్కడ పెయింటింగ్స్‌ ప్రదర్శన జరిగినా చూసొస్తా. పెళ్లికి వేసే మెహందీగా ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్స్‌ను వేయించుకోవాలని అనిపించింది. మామూలుగా అయితే వధువు చేతి మీద వరుడి పేరు మెహందీలో రాయాలి. కానీ ఆకాష్‌ అదేమీ అవసరం లేదు... అని నీకు నచ్చింది వేయించుకో అని చెప్పాడు. పైగా తనే కొందరు అంతర్జాతీయ ప్రఖ్యాత చిత్రకారుల కళాఖండాల కాపీలను వెతికి సంపాదించి ఇచ్చాడు. వాటిలో విన్సెంట్‌ వాన్‌ గోహ్‌ ‘స్టేరీ నైట్‌’, గస్తవ్‌ క్లిమ్ట్‌ ‘ద కిస్‌’, హోకుసై ‘ద గ్రేట్‌ వేవ్‌ ఆఫ్‌ కనగావా’, పికాసో ‘ఫెమ్మె ఆ కాలీర్‌ జౌన్‌’, మైకేలాంజెలో ‘ద క్రియేషన్‌ ఆఫ్‌ ఆదం’ వంటి కళాఖండాలను మెహెందీగా పెట్టించుకున్నా. మెహందీ ఆర్టిస్ట్‌ కమల్‌ క్లారాకు ఈ పెయింటింగ్స్‌ ఆలోచన చెప్పగానే చాలా సంతోషించి, సరే అన్నారు. ఇలా ఇప్పటి వరకు ఎవరూ వేయించుకోలేదట. ఆ మాట చెబుతూ ఇన్‌స్టాలో ఎందరో అభినందనలు తెలిపారు. కొందరైతే వాళ్ల పెళ్లికి ఇలాగే మెహందీ వేయించుకుంటా మంటుండటం సంతోషాన్ని కలిగించింది’ అని చెప్పుకొస్తున్న నవవధువు అంజలి తన వివాహంలో మరో ప్రత్యేకతనూ పొదుపుకుంది. వాళ్ల అమ్మ పెళ్లి దుస్తులను ఇప్పుడు తను ధరించి మరీ మూడు ముళ్లు వేయించుకుంది. 26 ఏళ్లకిత్రం తన తల్లి ధరించిన దుస్తులు తనకు ప్రత్యేకం అని చెబుతున్న అంజలి తన కలలు నెరవేరే క్షణాల్ని ఇలా పండించుకోవడం బాగుంది కదూ...

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్