చనిపోయినా జీవకళ తెస్తుంది!

అందమైన వర్ణాల్లో ఆకట్టుకునే పక్షులు..  బెదురు కళ్లతో చూసే హరిణాలు..  చూడగానే భలే ఉన్నాయే అనిపించినా, అవి ప్రాణం లేని జీవులని తాకితే కానీ తెలియదు.  టాక్సీడెర్మీ అనే కళతో చనిపోయిన జీవులకు ప్రాణం పోస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది 32 ఏళ్ల దివ్య...

Updated : 13 Jul 2022 04:13 IST

అందమైన వర్ణాల్లో ఆకట్టుకునే పక్షులు..  బెదురు కళ్లతో చూసే హరిణాలు..  చూడగానే భలే ఉన్నాయే అనిపించినా, అవి ప్రాణం లేని జీవులని తాకితే కానీ తెలియదు.  టాక్సీడెర్మీ అనే కళతో చనిపోయిన జీవులకు ప్రాణం పోస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది 32 ఏళ్ల దివ్య...

నిపోయిన జంతువులు, పక్షులకు పూర్వపు ఆకృతినిచ్చి అచ్చంగా అవి బతికున్నట్టుగా తీర్చిదిద్దే కళే టాక్సీడెర్మీ. సైన్స్‌పై పట్టుండి... శిల్పకళ తెలిసిన వారికి మాత్రమే అబ్బే ఈ ‘సై-ఆర్ట్‌’లో ఆరితేరిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువమంది. వారిలో దివ్య అనంతరామన్‌ ఒకరు. అత్యుత్తమ టాక్సీడెర్మీ కళాకారిణిగా పురస్కారాన్ని అందుకున్న దివ్య ఈ రంగంలోకి రావడం కూడా చిత్రంగానే జరిగింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ తమిళ అమ్మాయి తను. ‘అమ్మ బయాలజీ టీచర్‌. తన ల్యాబ్‌లో.. జార్లలో పెట్టిన జంతువుల కళేబరాలను చూసీ, చూసీ అవంటే భయం పోయింది. ప్రకృతిని దగ్గరగా చూస్తున్నా అనుకొనేదాన్ని. అప్పుడు నాకు ఐదారేళ్లు ఉంటాయి. ఇంట్లో బల్లి చచ్చిపడి ఉంది. దాన్ని నాకు ఇష్టమైన సముద్ర గులక రాళ్లు దాచుకొనే పెట్టెలో పెట్టా. రెండ్రోజులకి ఆ పెట్టె నుంచి దుర్వాసన. అదే నా మొదటి వైఫల్యం. అమ్మకి తెలిసి... ‘వాటిని దాచిపెట్టడానికి వేరే పద్ధతి ఉంటుంద’ని చెప్పింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన జంతువులని ఇంటికి తేవడం మొదలుపెట్టా. ‘ఇప్పుడు కాదు... దీనికో కోర్సు ఉంది. పెద్దయ్యాక అది చదివి అప్పుడు దాచిపెడుదువు’ అంది అమ్మ. నిజానికి దీనికంటూ కోర్సుల్లేవు అప్పటికి. దాంతో... ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరి షూ డిజైనర్‌గా స్థిరపడ్డా. ఖాళీ సమయాల్లో టాక్సీ డెర్మిస్టుల దగ్గర ఈ పని నేర్చుకున్నా. నాకు పట్టొచ్చాక ఫ్యాషన్‌ డిజైనింగ్‌ని వదిలేసి, ఈ రంగంలోకి మారా’ అంటుంది దివ్య.

భవిష్యత్‌ తరాలకోసం...

టాక్సీడెర్మీ అంటే గ్రీక్‌లో చర్మాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చడం అనే అర్థం వస్తుంది. చనిపోయిన పక్షులు, పాలిచ్చే జంతువులు, ఎలుకలు వంటి వాటిని తీసుకుని కొన్ని నైపుణ్యాలతో వాటికి జీవకళ తీసుకొస్తారు. ఇది చాలా ఓపికతో కూడిన వ్యవహారం. గోతమ్‌ టాక్సీడెర్మీ అనే సంస్థను స్థాపించి వివిధ సంస్థలకు సేవలు అందిస్తోంది దివ్య.  ‘విద్యాసంస్థలు, మ్యూజియాలు, గ్యాలరీలు.... జంతువులపై ఆసక్తి ఉండి వాటి గురించి తెలుసుకోవాలి అనుకొనే వారికి, సెలబ్రిటీలకు మా సేవలు ఉపయోగపడతాయి. అలాగే భవిష్యత్‌ తరాలకి ప్రకృతిలోని అనేక జీవుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశం ఈ కళ కల్పిస్తుంది. జంతు కళేబరాన్ని సేకరించి... దాన్ని శుభ్రపరచాలి. ఒక్కో చర్మానికి ఒక్కో రకం రసాయనం వాడాలి. ఆకృతిలో తేడా రాకుండా మధ్యలో దూదిలేదా ఇతర మెటీరియల్‌ని వాడతాం. అచ్చంగా వాటి ఆకృతి రావాల్సిందే. ఎందుకంటే వాటిని అధ్యయనం కోసం తయారు చేస్తున్నాం కాబట్టి. దీనికి కళాకారులకుండే సృజనాత్మకత కూడా కావాలి. జీవుల అందం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు చెక్క, యాక్రిలిక్‌ పెయింట్స్‌, వ్యాక్స్‌, సిలికాన్‌, ఎపాక్సీ, ఎయిర్‌ డ్రైయింగ్‌క్లే వంటివి వాడి సహజ అందాన్ని తీసుకొస్తాం. నలభై సంవత్సరాలుగా దాచిపెట్టిన కళేబరాలకు కూడా చక్కటి ఆకృతి తీసుకొచ్చి మ్యూజియాల్లో పెడతాం. అయితే ఇందుకోసం ఏ జంతువులని పడితే వాటిని తీసుకోకూడదు. స్థానిక చట్టాలని గౌరవించాలి’ అనే దివ్య ఎన్నో రకాల జంతువులకు ప్రాణం పోసినా ఫ్లెమింగోలు, హమ్మింగ్‌బర్డ్‌ వంటివి చేసినప్పుడు చాలా సంతృప్తి చెందానంటోంది. తను రాణించడమే కాకుండా ప్రఖ్యాత మార్బిడ్‌ అనాటమీ మ్యూజియమ్‌లో బోధకురాలిగా చేరి ఎంతో మందికి శిక్షణ ఇస్తోంది. తీరిక సమయాల్లో వర్క్‌షాపులూ నిర్వహిస్తోంది. తన నైపుణ్యాలను గుర్తించిన ‘ఇంగ్లాండ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టాక్సీ డెర్మిస్ట్స్‌’ బెస్ట్‌ టాక్సీ డెర్మిస్ట్‌ అవార్డుతో గౌరవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్