జాలి చూపిన చోటే.. స్ఫూర్తిగా నిలిచింది!
‘ఈసారైనా అబ్బాయి అనుకున్నా..’ సవిత పుట్టినప్పుడు వాళ్ల నాన్న నిరాశగా అన్న మాట ఇది. పేద కుటుంబంలో నాలుగో అమ్మాయి తను. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇదే మాటలను వేల సార్లు విన్న ఆమె ఏదైనా సాధించి చూపాలనుకుంది.
‘ఈసారైనా అబ్బాయి అనుకున్నా..’ సవిత పుట్టినప్పుడు వాళ్ల నాన్న నిరాశగా అన్న మాట ఇది. పేద కుటుంబంలో నాలుగో అమ్మాయి తను. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇదే మాటలను వేల సార్లు విన్న ఆమె ఏదైనా సాధించి చూపాలనుకుంది. అనుకున్నట్టుగానే రికార్డు నెలకొల్పి దేశమంతా తన గురించి మాట్లాడేలా చేసింది.
సవిత కన్‌స్వాల్‌కి 26 ఏళ్లు. త్రిశూల్ పర్వతం (7120 మీ.), హనుమాన్ టిబ్బా (5930 మీ.), కోలాహై (5400 మీ.), ద్రౌపది కా దండ (5680 మీ.), తులియన్ (5500 మీ.).. ఇలా పది పర్వతాలను ఎక్కేసింది. ఇలా ఎక్కిన తొలి భారతీయ యువతిగా నిలిచింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అయిదో ఎత్తైన పర్వతమైన మకాలూ (8485మీ.)ని, అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ (8849 మీ.)ను 16 రోజుల వ్యవధిలోనే ఎక్కేసింది. ఇదీ రికార్డే! ‘చిన్నప్పటి నుంచీ మా కుటుంబాన్ని జాలిగా చూసేవాళ్లు. దాన్ని మార్చాలన్న కసే నన్ను ఇవన్నీ సాధించేలా పురిగొల్పింది’ అంటుంది సవిత.
నలుగురు అక్కా చెల్లెళ్లలో తను చివరిది. వీళ్లది ఉత్తరాఖండ్‌లోని కుగ్రామం. ఆ గ్రామంలో మగవాళ్లదే రాజ్యం. నలుగురు అమ్మాయిలని వాళ్ల కుటుంబాన్ని జాలిగా చూసే వారు. దీన్నే మార్చాలనుకుని చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివేది. ప్రభుత్వ విద్యాలయాల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసింది. స్కూలుకు వెళ్లాలంటే రోజూ 4 కి.మీ. మేర కొండ ప్రాంతాన్ని దాటాలి. అదీగాక 2011లో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ నిర్వహించిన ఒక అడ్వెంచర్ కోర్సును తను పూర్తిచేసింది. ఇవి పర్వతారోహణపై ఆసక్తి కలిగించాయి. దీంతో ఉత్తర కాశిలోని నెహ్రూ మౌంటెనీరింగ్ కళాశాలలో (ఎన్‌ఐఎం) చేరి, బేసిక్ కోర్సును చేసింది. అడ్వాన్స్‌డ్ కోర్సులకు స్థోమత లేక దేహ్రాదూన్‌లోని ఓ కేఫ్‌లో ఏడాదిపాటు పనిచేసి ఆ మొత్తంతో కోర్సు పూర్తి చేసింది. తర్వాత అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా చేరింది. 2018లో ఎన్‌ఐఎం బృందం ద్రౌపది కా దండ పర్వతారోహణ చేసింది. వారిలో సవితా ఒకరు. అలా తన పర్వతారోహణ ప్రారంభమైంది.
‘పర్వతారోహణకు దృఢసంకల్పంతోపాటు డబ్బూ కావాలి. అది నా చేతిలో లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్‌ను ఆశ్రయించా. ఎందరో దాతలు ముందుకొచ్చారు. ఎవరెస్ట్ ఎక్కేప్పుడు మైనస్ 45 డిగ్రీల చలి. ఒకానొక దశలో ముందుకు అడుగు వేయలేక పోయా. దీనికి తోడు కళ్లు తిరగడం. ఆక్సిజన్ సిలిండర్ పనిచేయలేదు. నాతోపాటు వచ్చిన వారి వద్ద ఉన్నదాన్నే పంచుకుంటూ ముందుకెళ్లా. కొంతదూరం వెళ్లాక ఎవరో తమ వద్ద అదనంగా ఉన్నది ఇచ్చే వరకూ ఇలాగే సాగా. శిఖరాగ్రాన్ని చేరి మన జాతీయ జెండాను ఎగరేసినపుడు ఆ ఆనందం ముందు ఈ సవాళ్లన్నీ పెద్దగా అనిపించవు. ప్రపంచంలోని అన్ని ఎత్తైన పర్వతాలను అధిరోహించడం నా కల’ అని చెబుతుంది సవిత. ఇవన్నీ ఆడపిల్ల ఎవరికీ తీసిపోదని నిరూపించడం కోసమే అనే ఈమె తన ఒక్కో గెలుపూ ఆ చుట్టుపక్కల మరెన్నో ఊళ్లలో మార్పుకు కారణమైందంటుంది. ఒకప్పుడు జాలి పడ్డవారే తమ పిల్లలకు ఆమెను ఆదర్శంగా చూపుతున్నారు. ఇప్పుడు ఆమె స్ఫూర్తితో తమ తలరాతను తామే రాసుకుంటున్న అమ్మాయిలు ఎందరో!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.