సాహస నారీ పర్యాటకులు

ఈ అతివలు అతి ఎత్తైన పర్వతాలపైకి ట్రెక్కింగ్‌ చేసేయగలరు. నడి సముద్రంలో, కారడవుల్లో ప్రయాణించేస్తారు. ఒంటరిగా దీవుల్లో పర్యటిస్తారు. ఎగిసిపడే కెరటాలపై సర్ఫింగ్‌కు సిద్ధమవుతారు. ఆయా ప్రాంతాల వింతలు, విశేషాలకు తమ సాహసాలను కలిపి పర్యాటక ప్రియులకు అందిస్తుంటారు. వీరి వీడియోలను కోట్లమంది వీక్షిస్తారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ.. ప్రయాణిస్తున్న ఒంటరి మహిళా ట్రావెల్‌ వ్లోగర్స్‌లో కొందరి విజయగాథలివీ...

Published : 16 Jul 2022 00:13 IST

ఈ అతివలు అతి ఎత్తైన పర్వతాలపైకి ట్రెక్కింగ్‌ చేసేయగలరు. నడి సముద్రంలో, కారడవుల్లో ప్రయాణించేస్తారు. ఒంటరిగా దీవుల్లో పర్యటిస్తారు. ఎగిసిపడే కెరటాలపై సర్ఫింగ్‌కు సిద్ధమవుతారు. ఆయా ప్రాంతాల వింతలు, విశేషాలకు తమ సాహసాలను కలిపి పర్యాటక ప్రియులకు అందిస్తుంటారు. వీరి వీడియోలను కోట్లమంది వీక్షిస్తారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ.. ప్రయాణిస్తున్న ఒంటరి మహిళా ట్రావెల్‌ వ్లోగర్స్‌లో కొందరి విజయగాథలివీ...

తాన్యా ఖనిజోవ్‌..

ఇండియాలో తాన్యా ఖనిజోవ్‌ అంటే తెలియని పర్యాటక ప్రియులుండరు. ఈమె ట్రావెల్‌ వ్లాగర్‌, సోలో ట్రావెలర్‌, ట్రావెల్‌ ఫిల్మ్‌ మేకర్‌ కూడా. హరియాణాకు చెందిన తాన్యాకు తెలియని ప్రాంతాలన్నింటినీ చుట్టిరావాలనే ఆసక్తి ఎక్కువ. దీంతో కార్పొరేట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, మనసుకు నచ్చిన పనికే పెద్దపీట వేసింది. ప్రపంచమంతా తిరగాలనే లక్ష్యాన్ని 2012లో మొదలుపెట్టింది. అలా దేశవిదేశాలు తిరుగుతూ..వాటి వివరాలను అందిస్తున్న యూట్యూబ్‌ వ్లోగ్స్‌కు తొమ్మిది లక్షలమంది
సబ్‌స్క్రైబర్లుండటం విశేషం. ఇప్పటివరకు ఈమె వీడియోలను 6.23 కోట్లమంది వీక్షించారు. ఆఫ్రికా, అమెరికా, మాల్దీవులు తదితర దేశాలుసహా అండమాన్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, నేపాల్‌లోని ఎవరెస్టు బేస్‌ క్యాంపు, లద్దాఖ్‌, మనాలి, మణిపుర్‌, కశ్మీర్‌, భూటాన్‌ వంటి ప్రాంతాలను ఒంటరిగా ప్రయాణించి మరీ అక్కడి అనుభవాలను అందరికీ అందించింది. ఏ సీజన్‌లో ఏ ప్రాంతాన్ని పర్యటించాలనేది నా బ్లాగులో వివరిస్తా అంటుంది తాన్యా. ‘పర్యాటక ప్రియులకు ఆయా ప్రాంతాల వివరాలు మాత్రమే కాదు, అక్కడి ప్రకృతి, వాతావరణం, ఆహారం, బస వంటి అంశాలనూ చెబుతుంటా. అలాగే ఎక్కడ ఏయే ప్రత్యేకతలుంటాయో వివరిస్తా. కర్ణాటకలోని ముల్కిలో సర్ఫింగ్‌లో శిక్షణతో సర్టిఫికేషన్‌ కోర్సు చేశా.అలాగే ఎవరెస్టు బేస్‌ క్యాంపు వరకు వెళ్లొచ్చా. మాల్దీవుల్లో షార్క్‌లతో కలిసి ఈతకొట్టా. మనాలిలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచుకొండలపై తిరిగొచ్చా. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌ శిక్షణ పూర్తిచేశా. నేను వెళ్లే ప్రతిచోట ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తా. ఈ అనుభూతుల్లో ప్రతీదీ ప్రత్యేకమే. నాలాగే ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తుంటా’ అని చెప్పుకొస్తుంది తాన్యా. ఎదుటివారి విమర్శలను లెక్కచేయకుండా నీకెలా ఉండాలో అలాగే ఉండటానికి ప్రయత్నించు అంటూ మహిళలందరికీ సలహా ఇచ్చే తాన్యా ప్రయాణాల్లో తీసుకోవాల్సిన మరెన్నో జాగ్రత్తలనూ చెబుతుంది.


కృతికా గోయల్‌..

కార్పొరేట్‌ ఉద్యోగి కృతికాకు కొత్త ప్రాంతాలు చుట్టిరావడమంటే ఎంతో ఇష్టం. ఓవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పలు ప్రాంతాలు చూసి వచ్చేది. 2017లో పూర్తిగా తన సమయాన్ని పర్యాటకానికే కేటాయించుకుని ట్రావెలర్‌, యూట్యూబ్‌ వ్లాగర్‌గా మారింది. ఆయా ప్రాంతాల వివరాలనే కాకుండా లైఫ్‌స్టైల్‌, ఫ్యాషన్‌ వంటి అంశాలపైనా ఈమె వ్లాగ్స్‌ ఉంటాయి. అయిదేళ్లలో నాలుగు లక్షలమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్న కృతిక స్విట్జర్లాండ్‌, అమెరికా తదితర దేశాలు చుట్టి వచ్చింది. రోమ్‌, మియామి, ప్యారిస్‌, బోస్టన్‌ వంటి ప్రాంతాలన్నీ తన మనసును కట్టిపడేశాయి అంటుందీమె. ‘స్విట్జర్లాండ్‌, దుబాయిలో స్కై డైవింగ్‌, మంచుపర్వతాలపై ట్రెక్కింగ్‌, మేఘాలయలో దట్టమైన అడవిలో నడక వంటివన్నీ మరవలేను. అక్కడి విశేషాలనే కాదు, పర్యాటకులకు ఉపయోగపడే ఎన్నో అంశాలను అందిస్తుంటా. మనసుకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవిస్తేనే సంతోషంగా బతకగలం’ అని చెప్పుకొస్తున్న కృతిక వీడియోలను 3.97 కోట్లమంది వీక్షించారు.


ప్రియాంకా ఛండోలా..

మె దేశీగర్ల్‌ ట్రావెలర్‌. ఇండియాలోని పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చులో ఎలా వెళ్లి రావొచ్చు, తక్కువ వ్యయంతో ఆహారం, షాపింగ్‌, బస వంటివి ఎలా ఎంపిక చేసుకోవచ్చు అనే వివరాలన్నీ పొందుపరుస్తుంటుంది. ప్రియాంకకి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలర్‌గానూ పేరుంది. 2018లో ప్రారంభించిన ఈమెకు 3 లక్షలమంది సబ్‌స్క్రైబర్లుండగా, ఆయా ప్రాంతాల సంప్రదాయాలు, లైఫ్‌స్టైల్స్‌ వంటివన్నీ వివరిస్తుంది. అలాగే ట్రావెలర్‌ షెనాజ్‌ ట్రెజరీ కూడా దేశంలోని పలుప్రాంతాలను పర్యటించి వాటి వివరాలను వీడియోలుగా పొందుపరుస్తుంది. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, గోవా వంటి ప్రాంతాల్లో అతి తక్కువ ధరలో లభ్యమయ్యే బస నుంచి ఆహారం వరకు వివరాలు చెబుతుంది. ఈమె యూట్యూబ్‌కు 2 లక్షలమంది, ఇన్‌స్టాకు లక్షమంది ఫాలోయర్స్‌ ఉండటం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని