అమెరికా చదువుకి 2.7కోట్ల ఉపకారవేతనం

అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌... సామాన్యులకి తీరని కల. కానీ ఆ కలని నిజం చేసుకోబోతోంది తెలుగమ్మాయి శ్రేయ లక్కప్రగడ. మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్‌లీ కాలేజీలో యూజీ చేయబోతోందీ 18 ఏళ్ల హైదరాబాదీ. వెల్స్‌లీ... హిల్లరీ క్లింటన్‌ సహా ఎందరో ప్రముఖులు చదివిన కాలేజీ. లిబరల్‌ ఆర్ట్స్‌లో దీనిది అమెరికాలో అయిదో ర్యాంకు. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌, సైకాలజీలో...

Published : 16 Jul 2022 00:22 IST

అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌... సామాన్యులకి తీరని కల. కానీ ఆ కలని నిజం చేసుకోబోతోంది తెలుగమ్మాయి శ్రేయ లక్కప్రగడ. మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్‌లీ కాలేజీలో యూజీ చేయబోతోందీ 18 ఏళ్ల హైదరాబాదీ.

వెల్స్‌లీ... హిల్లరీ క్లింటన్‌ సహా ఎందరో ప్రముఖులు చదివిన కాలేజీ. లిబరల్‌ ఆర్ట్స్‌లో దీనిది అమెరికాలో అయిదో ర్యాంకు. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌, సైకాలజీలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌(2022-26) చదువనుంది శ్రేయ. ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌, పుస్తకాలూ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ప్రయాణ, వ్యక్తిగత ఖర్చులూ... వీటన్నింటికీ అవసరమయ్యే రూ.2.7కోట్లు యూనివర్సిటీనే చెల్లించనుంది. పదో తరగతి వరకూ భారతీయ విద్యాభవన్‌(సికింద్రాబాద్‌) స్కూల్లో, ఇంటర్‌ డెల్టా కాలేజీలో చదివిన శ్రేయాకు అమెరికాలో డిగ్రీ చేయాలనేది లక్ష్యం. పట్నాకు చెందిన డెక్స్టెరిటీ గ్లోబల్‌ సంస్థ ఆమెకు మార్గనిర్దేశం చేసింది. ఆ సంస్థ నిర్వహించే కెరియర్‌ డెవలప్‌మెంట్‌, ఫెలో డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు హాజరైంది శ్రేయ.

‘మన దగ్గర ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటీల్లోనూ మార్కుల్నిబట్టే సీటు. అమెరికాలో అలా కాదు, ఆల్‌రౌండ్‌ ప్రతిభ ఉంటేనే సీటు ఇస్తాయి. స్కూల్లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేదాన్ని. స్కూల్‌ కేబినెట్‌లో సభ్యురాల్ని. సేవా కార్యక్రమాల్లో భాగమయ్యా. వ్యాస రచనలో, చదువుల్లో ముందుండేదాన్ని’ అని చెప్పే శ్రేయ ఇంటర్‌లో 935 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్‌ చదువుతూనే అమెరికా చదువుకి సిద్ధమయ్యేది. భావవ్యక్తీకరణ, రచనా నైపుణ్యాలపైన శిక్షణలో భాగంగా డెక్స్టీరియా మెంటార్లు తరచూ అసైన్‌మెంట్లు ఇచ్చేవారు. వాటినీ విజయవంతంగా పూర్తిచేసేది. ‘లక్ష్యం నిర్దేశించుకున్నాక దాన్ని చేరేందుకు ఏం చేయాలో అది చేయాల్సిందే. రెండేళ్లపాటు ప్రతి ఆదివారం అమెరికా సీటు కోసం అవసరమైనవి నేర్చుకునేదాన్ని. డెక్స్టెరిటీ ఆధ్వర్యంలో వారంపాటు ఆనంద్‌లోని ‘ఇర్మా’లో ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌ నా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చింది. అంతకు ముందు ఇంటికి దూరంగా వెళ్లింది లేదు. అక్కడకు వెళ్లాక అసలైన ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమైంది. ఎందరున్నా మన ఉనికిని చాటాలన్న విషయం నేర్చుకున్నా. బృంద చర్చలూ, ఉపన్యాసాలూ, యాక్టివిటీలూ.. వాటిపైన రాతపూర్వక విశ్లేషణలు ఇవన్నీ నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. సేవకురాలైన నాయకురాలిగా ఎలా ఎదగాలో చెప్పాయి’ అంటూ తను సిద్ధమైన తీరుని చెప్పిన శ్రేయ.. ఈ ప్రయత్నంలో అమ్మ నీలిమ సహకారం ఎంతో ఉందంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని