తన నోట 17 భాషల పాట

ఎనిమిదేళ్లకే వేదికపై 17 భాషల్లో అవలీలగా పాటలు పాడింది. పౌరాణిక పాత్రల ఏకపాత్రాభినయంతో అవార్డులనూ అందుకుంది. బాలనటిగా వెండితెరపై మెరిసింది. వేల పాటలను గుర్తుపెట్టుకుని పాడేసే బహుముఖ ప్రజ్ఞాశాలి... కట్టోజు జాహ్నవి తన గురించి చెప్పుకొచ్చిందిలా..

Published : 23 Jul 2022 01:28 IST

ఎనిమిదేళ్లకే వేదికపై 17 భాషల్లో అవలీలగా పాటలు పాడింది. పౌరాణిక పాత్రల ఏకపాత్రాభినయంతో అవార్డులనూ అందుకుంది. బాలనటిగా వెండితెరపై మెరిసింది. వేల పాటలను గుర్తుపెట్టుకుని పాడేసే బహుముఖ ప్రజ్ఞాశాలి... కట్టోజు జాహ్నవి తన గురించి చెప్పుకొచ్చిందిలా..

మంచిర్యాలకు చెందిన జాహ్నవి నాలుగేళ్ల వయసు నుంచే ఏ పాట విన్నా అక్షరం పొల్లుపోకుండా తిరిగి పాడేసేది. నాలుగున్నరేళ్లకే అన్నమయ్య కీర్తన తప్పు లేకుండా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది జాహ్నవి. తనలో అసాధారణ ప్రతిభ ఉందని గుర్తించిన నాన్న మురళి, అమ్మ సుజాత ప్రోత్సహించారు. ఏ భాషదైనా పాట ఒక్కసారి వింటే చాలు జ్ఞాపకం పెట్టుకుంటూ మళ్లీ అదే పద్ధతిలో పాడగలిగే స్థాయికి చేరుకుంది. అయిదేళ్ల వయసప్పుడు కాగజ్‌నగర్‌లో ఓ వేదికపై మొదటిసారి ఉర్దూ ఖవాలీ పాడింది. ఏడేళ్లప్పుడు గోదావరి పుష్కరాల కార్యక్రమాల్లో పాడే అవకాశాన్ని అందుకుంది. ఎనిమిదేళ్లు నిండేసరికి తెలుగు సహా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఉర్దూ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ, బంజారా, పంజాబీ, అరబిక్‌, నేపాలీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లిష్‌ గీతాల్ని అలవోకగా పాడేసేది. ఏ భాష, యాసలనైనా ఇట్టే పట్టేయడం,  రాగంతోపాటు అపస్వరం రాకుండా పాడటం తన ప్రత్యేకతలు. ఒక్క లతా మంగేష్కర్‌వే 400, హిందీలో మరో 600 పాటలు పాడగలదు. తెలుగు సహా మిగతా భాషలన్నింటిలో కలిపితే దాదాపు 2000 వరకూ పాడగలదు. తను 60కిపైగా ప్రదర్శనలు ఇచ్చింది.

నటిగా...

మంచిర్యాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జాహ్నవి, ఏకపాత్రాభినయమూ నేర్చుకుంది. ‘ఎవరైనా మాట్లాడితే వాళ్లలాగే తిరిగి నటించగలను. పలు పోటీల్లో విజేతగానూ నిలిచా. రవీంద్రభారతి, హరిహరకళాభవన్‌ వంటి వేదికలపై దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, శకుని వంటి పౌరాణిక పాత్రల ఏకపాత్రాభినయం చేశా. ఈ నటనకు 2018 నుంచి నాలుగేళ్ల పాటు వరుసగా తెలంగాణ బెస్ట్‌ ఛైల్డ్‌ అవార్డును రెండు సార్లు గవర్నర్‌ చేతుల మీదుగా, రెండు సార్లు మంత్రుల చేతులమీదుగా అందుకున్నా. ఇంకా చాలా పురస్కారాలు వచ్చాయి. 17 భాషల్లో పాడుతున్నందుకు నా పేరు రికార్డులకెక్కింది. సినిమాల్లోనూ నటిస్తున్నా. ఆరేళ్ల వయసులోనే ‘చివరిక్షణం’ సినిమాలో నటించా. ఆ తర్వాతా మరికొన్ని సినిమాల్లో చేశా. తాజాగా నటించిన తెలుగు సినిమా ఒకటి విడుదల కావాల్సి ఉంది. ఒక కన్నడ చిత్రంలో సోలోగా పాడే అవకాశం కూడా వచ్చింది.

ప్రధానితో..

తన ప్రతిభతో ప్రధాని మోదీ 2020లో నిర్వహించిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో మాట్లాడే అవకాశాన్ని జాహ్నవి అందుకుంది. ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో కొవిడ్‌, జీఎస్టీ రేట్లు, నిత్యావసరాల ధరల పెంపుతో పేదల ఇబ్బందులు వంటి అంశాలపై ప్రధానితో తన ఆలోచనలను పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఏటా నిర్వహించే జూనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ పరీక్షల్లో (2020లో) జాహ్నవి 200కు 200 మార్కులు సాధించింది. కలెక్టర్‌నై పేదల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తా అనే జాహ్నవి ప్రతిభ అద్భుతం కదూ. ప్రతి ఒక్కరికీ బాల్యం నుంచే ఏదైనా లక్ష్యం ఉండాలి. అప్పుడే ఆ మార్గంలో అడుగులేయడానికి కృషి చేస్తాం అంటోంది తను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని