ఆ ఊరేగింపు జీవితాన్ని మార్చింది!
చిన్నప్పటి నుంచి ఇంట్లో దుర్భర దారిద్య్రాన్ని చూసిందా అమ్మాయి. ఎలాగైనా బాగా చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, అమ్మా నాన్నలకు కష్టాలను దూరం చేయాలనుకుంది. కన్నవారికీ, ఊరికీ మంచి పేరు తేవాలనుకుంది. అయితే విధి మరో దారి చూపిందా అమ్మాయికి... అంతే ఆ క్షణం నుంచి అదే తన జీవితమైంది... ఆటంకాల్ని అధిగమిస్తూ జాతీయ స్థాయికి ఎదిగింది... తనే చందు లావణ్య. వసుంధరతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే...
చిన్నప్పటి నుంచి ఇంట్లో దుర్భర దారిద్య్రాన్ని చూసిందా అమ్మాయి. ఎలాగైనా బాగా చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, అమ్మా నాన్నలకు కష్టాలను దూరం చేయాలనుకుంది. కన్నవారికీ, ఊరికీ మంచి పేరు తేవాలనుకుంది. అయితే విధి మరో దారి చూపిందా అమ్మాయికి... అంతే ఆ క్షణం నుంచి అదే తన జీవితమైంది... ఆటంకాల్ని అధిగమిస్తూ జాతీయ స్థాయికి ఎదిగింది... తనే చందు లావణ్య. వసుంధరతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే...
ఆరోజు ఊళ్లో ఒకటే కోలాహలం. చిన్నాపెద్దా, ఆడామగా... అంతా వీధుల్లోకి వచ్చారు. పండగలూ, పెళ్లిళ్లప్పుడూ కూడా అంత సందడిగా ఉండటం చూడలేదు. మా గ్రామం అమ్మాయి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డి అర్జున అవార్డు అందుకున్నాక ఆరోజే ఊళ్లో అడుగుపెట్టింది. ఆ సందర్భంగా పెద్ద ఊరేగింపు నిర్వహించి తనకు సన్మానం చేశారు. అది 2018.. ఏడో తరగతి చదువుతున్నా. అప్పటివరకూ వాలీబాల్ సరదాగా ఆడే దాన్ని. ఆటలతోనూ పేరు సాధ్యమేనని మొదటిసారి ప్రత్యక్షంగా చూశా. సిక్కిరెడ్డి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
అయిదో తరగతిలో మొదలు... కానీ నా పరిస్థితులూ, నేపథ్యం భిన్నం. మాది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం. నాన్న చందు భిక్షం, అమ్మ రాజమ్మ. అన్నయ్యలు అనిల్, గణేశ్. నాన్న దివ్యాంగుడు. అమ్మ కూలీకి వెళ్తుంది. అదే మాకు ఆధారం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చూసి... బాగా చదివి ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. నేను నాలుగో తరగతిలో ఉన్నపుడు మా ఊరికి చెందిన విశ్రాంత క్రీడోపాధ్యాయులు వీరారెడ్డి వేసవి శిబిరం ఏర్పాటు చేసి వాలీబాల్‌లో శిక్షణ ఇచ్చే వారు. నాకెందుకో ఆ ఆట బాగా నచ్చేది. అందుకే అక్కడ బాల్‌ను ఆందిస్తూ అబ్బాయిలు శిక్షణ పొందుతున్న తీరును గమనించే దాన్ని. వీలైనప్పుడల్లా బతిమాలి, నేనూ ఆడేదాన్ని. నా ఆసక్తినీ, నైపుణ్యాల్నీ గమనించిన వీరారెడ్డి సర్.. అమ్మాయిల జట్టును తయారు చేసి శిక్షణ మొదలుపెట్టారు. రోజూ 2, 3 గంటలు ప్రాక్టీసు చేసేదాన్ని. పోషకాహారం లేక శక్తి సరిపోయేది కాదు. అయినా అలానే సాధన చేసేదాన్ని. అయిదో తరగతిలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ఆరో తరగతిలో జాతీయ పోటీలకు వెళ్లా. ఏడో తరగతిలో అండర్-14 విభాగంలో జాతీయ జట్టుకి ఎంపికయ్యా. ఇప్పటిదాకా ఎనిమిది సార్లు జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు అందుకున్నా. మూడు సార్లు తెలంగాణాకు కెప్టెన్‌గా వ్యవహరించా. మొదట్లో ‘మగపిల్లలతో నీకు ఆటలు అవసరమా..?’ అన్నవాళ్లే నేను ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే చూసి శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా, చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్నా. ప్రస్తుతం నా ఎత్తు ఆరు అడుగులు. ఇది అటాకింగ్‌కి బాగా ఉపయోగపడుతుంది. దీంతో టోర్నీల్లో ప్రత్యేకత చాటడంతో ఎంపికవుతూ వస్తున్నా.
అలా జాతీయ జట్టులోకి...
సబ్ ఏషియన్ అండర్-20 టోర్నీకి జట్టును ఎంపిక చేసేందుకు రెండు నెలల కిందట భవనేశ్వర్‌లో 200 మందిని పరీక్షించారు. 40 మందిని ఎంపికచేసి రెండు నెలలు శిక్షణ ఇచ్చారు. తుది 12 మందిలో నేనున్నా. తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కదాన్నే. ఈ నెల కజకిస్థాన్‌లో సబ్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. 6 దేశాల జట్లతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో రెండింట్లో గెలిచాం. మూడింటిలో కొద్ది తేడాతో ఓడినా.. ఆ జట్లు నుంచి ఎంతో నేర్చుకున్నా. భారత జట్టు జెర్సీ వేసుకోవడం మర్చిపోలేని అనుభూతి.
నా ఆర్థిక పరిస్థితి తెలిసి..
ఆటలో ఓనమాలు దిద్దించడమే కాదు... నాకు మొదట్నుంచీ వీరారెడ్డి సారే ఆర్థికంగానూ అండగా నిలుస్తున్నారు. కజకిస్థాన్ వెళ్లడానికి పాస్‌పోర్ట్, టికెట్లు, ఇతర ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని సార్‌తో పాటు మా ఊరికి చెందిన మరొకరు అందించారు. అంతర్జాతీయ స్థాయిలో సీనియర్ జట్టుకి ఆడటమే నా లక్ష్యం. ఆపైన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నలు, అన్నయ్యలకు ఆసరా కావాలనేది నా ధ్యేయం. అందుకే ఎన్ని ఆటంకాలొస్తున్నా లెక్కచేయను. దృష్టంతా నా లక్ష్యాల మీదే పెట్టి ఆడుతూ వస్తున్నా.
ఎక్కడి జయపురం... ఎక్కడి కజకిస్థాన్... దేన్నైనా ప్రాణంగా భావిస్తూ కఠోర సాధన చేస్తే అవకాశాలు అవే వస్తాయనడానికి నేనే నిదర్శనం. ఎన్ని కష్టాలొచ్చినా, ఏ దశలోనూ నిరాశ చెందొద్దు.. పట్టుదలతో శ్రమిస్తే విజయాలు అవే దక్కుతాయి.
- తుమ్మల శ్రీనివాస్, కరీంనగర్
- బొల్లం శేఖర్, మహబూబాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.