స్కూల్‌ పిల్లలకు హార్వర్డ్‌ చదువులు!

ఐఐటీ, హార్వర్డ్‌లలో చదువు.. అమెరికాలో ఉద్యోగం. ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ‘ప్రపంచాన్ని మార్చాలి, అందుకు చదువే ఆయుధం’ అనుకుంది. నేటి తరానికి 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని నేర్పడానికి ‘అర్లీ స్టెప్స్‌అకాడమీ’ ప్రారంభించింది స్నేహా బిశ్వాస్‌.

Published : 28 Jul 2022 01:57 IST

ఐఐటీ, హార్వర్డ్‌లలో చదువు.. అమెరికాలో ఉద్యోగం. ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ‘ప్రపంచాన్ని మార్చాలి, అందుకు చదువే ఆయుధం’ అనుకుంది. నేటి తరానికి 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని నేర్పడానికి ‘అర్లీ స్టెప్స్‌
అకాడమీ’ ప్రారంభించింది స్నేహా బిశ్వాస్‌.

తొలి అడుగులు... ఏ ప్రయాణంలోనైనా ముఖ్యమే. విద్యకు సంబంధించినవైతే ఇంకాస్త ఎక్కువ ముఖ్యమంటోంది స్నేహ. ఐఐటీ ఖరగ్‌పుర్‌ నుంచి బీటెక్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ చేసి.. అమెరికాలోనే ‘బెయిన్‌ అండ్‌ కంపెనీ’లో చేరిందీమె. ‘ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చదవడం, పెద్ద కంపెనీలో పనిచేయడం. నాకు దొరికిన అదృష్టంగా భావిస్తా. ఇలాంటి అదృష్టాన్ని మరింత మందికి పంచాల్సిన బాధ్యత నాపైన ఉందనిపించింది’ అని చెప్పే స్నేహ.. 2021 జనవరిలో ఇండియా వచ్చి బెంగళూరు కేంద్రంగా ‘అర్లీ స్టెప్స్‌ అకాడమీ’ ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 8-18 ఏళ్ల విద్యార్థులకు ఆన్‌లైన్‌ లైవ్‌ కోర్సులు అందిస్తోంది. ఇవి ఒత్తిడి లేకుండా నేర్చుకునేలా ఉంటాయి. బయో ఇంజినీరింగ్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, క్రిప్టోకరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీ, ఐపీఓ, అంతరిక్ష విజ్ఞానం... స్కూల్లో అందుబాటులో ఉండని వందల కోర్సుల్ని అందిస్తోంది. ‘మా కోర్సులు విద్యార్థుల ఇష్టాలూ, అవసరాలకు తగ్గట్టు ఉంటాయి. కేస్‌స్టడీ పద్ధతిలో నేర్చుకుంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రఖ్యాత యూనివర్సిటీలన్నీ ఈ విధానాన్నే అనుసరిస్తాయి. కానీ స్కూల్‌, కాలేజీ పిల్లలకు సంబంధించి ఇలాంటి విధానం ఎవరూ తేలేదు. మా బృందం వీటిని అభివృద్ధి చేసి నేర్పుతోంది. వాస్తవ సమస్యలూ, పరిష్కారాలపైన పనిచేయడం వల్ల వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. విశ్లేషణ, భావవ్యక్తీకరణ నైపుణ్యాలూ పెరుగుతాయి’ అని చెబుతుంది స్నేహ. ఈ సంస్థ ప్రారంభానికి ముందు ‘టీచ్‌ ఫర్‌ ఇండియా’తోపాటు చైనాకు చెందిన ఓ ఎడ్యుటెక్‌ స్టార్టప్‌లోనూ పనిచేసింది స్నేహ. ఆపైన హార్వర్డ్‌ అనుభవం.. వీటిద్వారా ఏ కోర్సులు అందిస్తే బావుంటుందన్న విషయంలో అవగాహనకు వచ్చింది. ‘ఆఫ్రికా, అమెరికా, ఐరోపాల్లోనూ పనిచేశాను. నాయకుల్లో టెక్నాలజీ బాగా తెలిసిన వారి కంటే తమ విజ్ఞానానికి ఆత్మవిశ్వాసం తోడైన వారు వృత్తిపరంగా విజయవంతమవుతున్నారు’ అంటుందామె. అర్లీ స్టెప్స్‌కి గతేడాది రూ.8కోట్ల పెట్టుబడి వచ్చింది. పదికిపైగా దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సుల్ని నేర్చుకుంటున్నారు. ‘సికోయా క్యాపిటల్‌’ మహిళలకు నిర్వహించే స్పార్క్‌ ఫెలోషిప్‌కీ ఎంపికైంది స్నేహ.


‘స్కూల్లో చెప్పే పాఠాలు పిల్లలకు సరిపోవని మా అమ్మ నాకు చాలా విషయాలు అదనంగా నేర్పించేది. పత్రికలు చదవమనేది, టీవీలో వార్తలు చూడమనేది. పెద్దయ్యాక డిబేట్‌లలో పాల్గొనేదాన్ని. వీటికారణంగా నా ఆత్మవిశ్వాసమూ పెరిగేది. నాతోపాటు ఉద్యోగం చేసిన వాళ్ల విశ్లేషణా నైపుణ్యాలు పెన్ను, కాగితం మీద చూపడంలో ఎంతో ముందుండేవారు. కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో, తమ అభిప్రాయాల్ని చెప్పడంలో వారికి ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. వారిని చూశాకే అర్లీ స్టెప్స్‌ ఆలోచన వచ్చింది’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్