తల్లి చూపిన సేవా బాటలో..

తోటి మహిళలకు అమ్మ చేసే సాయాన్ని చూస్తూ పెరిగిందా అమ్మాయి. అదే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదివి వచ్చాక కూడా తన ఆలోచన మారలేదు. పైగా తన చదువు, తెలివి తన వాళ్లందరికీ

Published : 01 Aug 2022 00:52 IST

తోటి మహిళలకు అమ్మ చేసే సాయాన్ని చూస్తూ పెరిగిందా అమ్మాయి. అదే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదివి వచ్చాక కూడా తన ఆలోచన మారలేదు. పైగా తన చదువు, తెలివి తన వాళ్లందరికీ ఉపయోగపడతాయని సంతోషించింది. స్వచ్ఛంద సంస్థను స్థాపించి, నిరక్షరాస్య గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చి, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేస్తోంది. దశాబ్దకాలంగా వేలమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉషా ప్రజాపతి వారియా స్ఫూర్తి కథనమిది.

దువు ప్రతి ఒక్కరిని ఆర్థికంగా నిలబెడుతుంది. చదువుకు దూరమైన వారికి హస్తకళల్లో శిక్షణనిప్పిస్తే చాలు, వారికీ ఉపాధి అందినట్లే అనుకుంది బిహార్‌లోని గయకు చెందిన ఉష. ఈమెకు ఈ ఆలోచన వచ్చింది మాత్రం ఆమె తల్లి గీత స్ఫూర్తితోనే. తండ్రి నడిపే మెకానిక్‌ షెడ్‌లో ఆ ప్రాంత మహిళలకు కుట్లు, అల్లికలు నేర్పేది ఉష తల్లి. అలా వారికి సాయం చేసి ఆర్థికంగా నిలబడటానికి చేయూతనిచ్చేది. తల్లిని చూస్తూ పెరిగిన ఉష దాన్నే జీవితాశయంగా చేసుకుంది. అయితే అప్పటికి అహ్మదాబాద్‌లో టెక్స్‌టైల్‌ డిజైన్‌లో డిగ్రీ చదువుతోంది. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె అక్కడి గిరిజన మహిళలకు సాయం చేయాలనుకుంది. అంతలో ఉన్నత విద్యాభ్యాసానికిగాను ఫోర్డ్‌  ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌ ఫెలోషిప్‌కు 2006లో ఎంపికై అమెరికా వెళ్లాల్సివచ్చింది. అక్కడ ఆమె ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ఛేంజ్‌లో మాస్టర్స్‌ చేసి, తిరిగొచ్చింది. తల్లి మార్గాన్ని అనుసరించి, 20 మంది మహిళలతో 2009లో ‘సమూలం’ ఎన్జీవోను స్థాపించింది. ఆ మహిళల ఆసక్తిని బట్టి కుట్లు, అల్లికల్లో శిక్షణనిప్పించడం మొదలుపెట్టింది. అలా మొదలైన శిక్షణ ఇప్పుడు వందలమందికి చేరి ఉపాధిని అందిస్తోంది.

దేశమంతా అమ్మకాలు..

నా చిన్నప్పుడు చూసిన నిరక్షరాస్యత, లింగ వివక్ష, పేదరికం ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి అంటుంది ఉష. ‘చిన్నప్పుడు మహిళలంటే చాలా చులకన భావం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడి వారంతా ఆర్థికంగా వారి కాళ్లపై వాళ్లు నిలబడుతున్నారు. ఆత్మవిశ్వాసంతోపాటు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకున్నారు. మేం అందించే శిక్షణ తర్వాత మహిళలు మా ఎన్జీవో నుంచి ముడిసరుకు తీసుకెళ్లి రకరకాల డిజైన్లలో ఫ్యాషన్‌ యాక్సరీస్‌, స్టేషనరీ సహా గృహాలంకరణ ఉత్పత్తులను తయారు చేస్తారు. వాటిని విక్రయించడానికి దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జిబిషన్లకు తిరుగుతుంటా. వాటిని ప్రదర్శించడమే కాకుండా అక్కడి దుకాణాల్లో ఈ ఉత్పత్తులుండేలా చేస్తుంటా. అలా ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లో వీటిని విక్రయించగలిగా. ‘సమూలం’ ఇప్పుడెంతో అభివృద్ధి చెందింది. మా సభ్యులు ఇప్పుడు క్రోషెట్‌ జ్యూయెలరీ, గృహోపకరణ ఉత్పత్తులతోపాటు కుషన్‌ కవర్లు, టేబుల్‌ క్లాత్‌లు, రాఖీలు, కర్టెన్‌ టైస్‌ వంటివి తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దిల్లీ, ముంబయి, జయపుర్‌, గోవా తదితరచోట్ల ఫ్యాబ్‌ ఇండియా, గుడ్‌అర్త్‌, ఆర్టిసన్స్‌, అనంతాయ, పీపుల్‌ట్రీ ద్వారా ఇవి విక్రయమవుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో సృజనాత్మకంగా చేస్తున్న ఉత్పత్తులు వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి’ అని చెప్పే ఉష ఈ ఎన్జీవో ద్వారా కొత్తవారికి శిక్షణ ఇస్తోంది. ప్రతి 6 నెలలకు ఉచిత వైద్యశిబిరాల ద్వారా మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తోంది. ప్రతి ఒక్కరికీ కుటుంబ ఆర్థిక బాధ్యతల నిర్వహణ, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తోంది. ఇప్పుడు ఈ మహిళలంతా నెలకు రూ.12వేల వరకు ఆదాయాన్ని పొందడం వెనుక కృషి చేస్తున్న ఉష, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన చేతి వృత్తుల కళాకారులతోనూ కలిసి పనిచేసేలా ప్రోత్సహిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్