పాలివ్వడానికి సిగ్గు పడకూడదనీ..

పాప పుట్టాక బహిరంగ ప్రదేశాల్లో చనుబాలు ఇచ్చే విషయంలో ఇబ్బందులు పడిందా అమ్మాయి. తన టైలరింగ్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆమెకు సాయపడింది వాళ్ల అత్తగారు. విజయం సాధించాక దాన్నే వ్యాపారంగా మలచుకున్నారు.

Updated : 02 Aug 2022 06:56 IST

బిడ్డకి స్తన్యమివ్వడం ఎంత సహజ ప్రక్రియ! కానీ ఆ అమృతాన్ని తన బిడ్డకి అందించడానికి అమ్మకెన్ని ఇబ్బందులో. ఒక చాటు కావాలి.. తన సిగ్గు కాపాడుకోవడానికో అడ్డు కావాలి. కుదరనప్పుడు ఆ తల్లికి మరీ నరకం. దీనికో పరిష్కారం చూపాలనుకున్నారీ అమ్మలు.. తమ సృజనాత్మకతకు పని చెప్పి సాధించారు కూడా!


అత్తా, కోడళ్లు కలిసి..

పాప పుట్టాక బహిరంగ ప్రదేశాల్లో చనుబాలు ఇచ్చే విషయంలో ఇబ్బందులు పడిందా అమ్మాయి. తన టైలరింగ్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆమెకు సాయపడింది వాళ్ల అత్తగారు. విజయం సాధించాక దాన్నే వ్యాపారంగా మలచుకున్నారు. ఆ అత్తాకోడళ్లు.. సీతామహాలక్ష్మి, కాదంబిని. వాళ్లేం చెబుతున్నారంటే..

‘మాది హైదరాబాద్‌. మాస్టర్స్‌ ఇన్‌ సోషల్‌వర్క్‌ చదివా. సర్టిఫైడ్‌ లైఫ్‌కోచ్‌ని కూడా. 2018లో మా పాప మీరా భరద్వాజ్‌ పుట్టింది. బయటికి వెళితే పాలివ్వడం ఎంత ఇబ్బందో అప్పుడు అర్థమైంది. కొన్ని వెస్ట్రన్‌ దుస్తులున్నా అవి బనియన్‌ క్లాత్‌లోనే ఉండేవి. జిప్‌లతో ఉన్నవాటికి పైన ఏదైనా క్లాత్‌ వేసుకోవాలి. వాటితో పిల్లలకు గాలి ఆడకపోవడం, జిప్‌ గుచ్చుకోవడం వంటివి గమనించా. మా అత్తగారికి టైలరింగ్‌లో పరిజ్ఞానం ఉంది. ఇద్దరం కలిసి చాలా అధ్యయనం చేశాం. పాలిచ్చే అమ్మల దుస్తులు ఎలా ఉంటే బాగుంటుందో డిజైన్‌ చేసి, టైలర్‌తో కుట్టిచ్చాం. నేను వాటిని వేసుకొని లోపాలుంటే సరిచేస్తూ వచ్చాం. అలా మా డిజైన్‌ తయారైంది. దీంతో ఎక్కడైనా పాలివ్వొచ్చు. స్తనం కనిపిస్తుందన్న బాధ, పిల్లలకి ఇబ్బంది రెండూ ఉండవు. వ్యాపారంగా తెద్దామనుకున్నాక ముందు వాట్సాప్‌లో అమ్మాం. స్పందన బాగుండటంతో‘మీరా భరద్వాజ్‌’ పేరుతో మొదట ఇన్‌స్టాలో తర్వాత సొంత వెబ్‌సైట్‌లో అమ్మకాలు మొదలుపెట్టాం. మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో ఒప్పందం చేసుకుని తయారు చేయిస్తున్నాం. తాజాగా ఆశాజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థకి అవకాశమిచ్చాం.

నేను మావారి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటా. హైదరాబాద్‌లో అత్తయ్య మెటీరియల్‌ ఎంపిక, కుట్టించడం, ఫాలోఅప్‌లు, ప్యాకేజింగ్‌ వంటివి చూసుకుంటే నేను ఇన్‌స్టాలో పోస్టులుంచడం, వెబ్‌సైట్‌ పనులు, మార్కెటింగ్‌, ప్రకటనలు చూసుకుంటా. రూ.2 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన మా వ్యాపారం గత ఏడాది రూ.50లక్షలకు చేరుకుంది. ఎంతోమంది మా డిజైన్లు సాయపడ్డాయని చెబుతోంటే చాలా ఆనందమేస్తుంది. దర్శనానికి క్యూలో ఉండీ, ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలు ఇవ్వగలిగామనీ చెబుతున్నారు. ఇవన్నీ మాలో ఇంకా ప్రయత్నించాలన్న స్ఫూర్తిని నింపుతుంటాయి. దీనిలోనూ కొన్ని సమస్యలున్నాయి. వాటి నుంచి నేర్చుకుంటూ సాగుతున్నాం. మొదట్లో మా ఆడపడుచు, నేను, కొందరు బంధువులే మోడళ్లం. తాజాగా ఒక కస్టమర్‌ నేనూ చేస్తానని ముందుకొచ్చింది. మా ఉత్పత్తి వాళ్లకి అందిస్తున్న సౌకర్యమది. ఈ ఉత్పాదనకి పేటెంట్‌ కోసమూ అప్లై చేశాం. మెటర్నిటీ, బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు సాయపడే మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలనేది మా ప్రయత్నం’.


అమ్మలు, అమ్మాయిల కోసం..

ప్రసవించాక మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. దానికి తగ్గట్టుగా లో దుస్తులను ఎంచుకోవడం ఓ సమస్య అయితే.. పాలివ్వడం మరో ఇబ్బంది. ఇక నెలసరి, మెనోపాజ్‌ల్లో ఎదుర్కొనేవి ఇంకొన్ని. భిన్న అవసరాలకు తగ్గట్టుగానే దుస్తులుండాలనుకుంది దీపా కుమార్‌.. తన సంస్థ ద్వారా పరిష్కారాన్నీ చూపిస్తోంది. తనేం చెబుతోందంటే..

‘పాపాయి ఆకలితో ఏడుస్తున్నా నలుగురిలో పాలెలా ఇవ్వాలో తెలియక తల్లి సతమతమవుతుండటం, టీనేజీ అమ్మాయిలు.. వెనక మరక అయ్యిందేమోనంటూ చెక్‌ చేసుకుంటుండటం.. ఇలాంటి సంఘటనలు నన్ను ఆలోచనలో పడేశాయి. అమ్మలకి మార్కెట్‌లో జిప్‌ ఉన్న నైటీలు మాత్రమే దొరికేవి. మరి బయటికి వెళితే అన్న ప్రశ్నే నన్ను వస్త్ర డిజైనర్‌ని చేసింది. మాది బెంగళూరు. టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగయ్యాక మూడేళ్లు ఉద్యోగం చేశా. తర్వాత ఓ ప్రైవేటు సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరించా. దుస్తుల విషయంలో మహిళలెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వాలనుకొని ఈ రంగంలోకి వచ్చా. 2007లో ‘యష్రమ్‌ లైఫ్‌స్టైల్‌’ను ప్రారంభించా. నెలసరి అసౌకర్యానికి పరిష్కారంగా ‘పీరియడ్‌ ప్యాంటీ’ డిజైన్‌ చేశా. నెలసరి సమయంలో పరీక్షలు, ఉద్యోగపరంగా బయటికి వెళ్లే వాళ్లు దీంతో ధైర్యంగా ఉండొచ్చు. దీనికి అమెరికాలో 2015లో, మన దేశంలో 2019లో పేటెంట్‌ హక్కునీ పొందా.
గర్భం దాల్చినపుడు పొట్ట వద్ద సాగి కిందకు జారడం, ఛాతీ పరిమాణం పెరగడం వంటివి జరుగుతాయి. వీరికోసం ప్రత్యేకంగా బ్రా, నైట్‌వేర్‌, మెటర్నిటీ జీన్స్‌, లెగ్గింగ్స్‌, ష్రగ్స్‌, మెటర్నిటీ కాప్రి, సల్వార్‌, టాప్స్‌ వంటివి డిజైన్‌ చేశా. ప్రసవమయ్యాక పాపాయికి పాలు పట్టడానికి వీలుగా ఫీడింగ్‌ కుర్తీ, నర్సింగ్‌ కవర్‌, కంప్రెషన్‌ లెగ్గింగ్స్‌, ఫీడింగ్‌ బ్రా వంటివీ తయారు చేస్తున్నా. మా ‘యష్రమ్‌ లైఫ్‌స్టైల్‌’ నుంచి ‘అధిర’, మార్ఫ్‌ మెటర్నిటీ’, ‘ప్రిస్టిన్‌ లైఫ్‌’ వంటి 3 బ్రాండ్స్‌లో 18 రకాల దుస్తులను అందిస్తున్నా. మెనోపాజ్‌లోకి అడుగు పెట్టినవారి కోసం యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్‌, లీక్‌ ప్రూఫ్‌ లోదుస్తులు కూడా వీటిలో ఉన్నాయి. మొదట్లో ఆన్‌లైన్‌లోనే అమ్మేదాన్ని. ఇప్పుడు రిటైల్‌ స్టోర్‌లకీ అందిస్తున్నా. బెంగళూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుల్లోని రెండు యూనిట్లలో ప్రతి నెల 60వేల ఉత్పత్తులు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో 80 శాతం అమ్మకం వాటా ఆన్‌లైన్‌దే! నాకిద్దరు పిల్లలు. వ్యాపారం, మాతృత్వం.. రెంటినీ సమన్వయం చేసుకుంటూ నా పిల్లలకు స్ఫూర్తిగా నిలవడం నా లక్ష్యం’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్