కట్టుబాటుని కత్తిరించేశారు!
గ్రామంలోనే కటింగ్ సెలూన్ నడుపుతూ భార్య, ముగ్గురు ఆడపిల్లల్ని పోషించే వాడు రాజేశ్. ఓరోజు పనిచేస్తూ కుప్పకూలిపోయాడు. ‘బ్రెయిన్ ట్యూమర్.. బతకడం కష్టమే. ఎందుకైనా మంచిది పెద్దాసుపత్రిలో చేర్పించండ’ని వైద్యులు చెప్పడంతో అలా చేశారు. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని చిన్న కూతురు బిందూనే ఆదుకుంది.
కొన్ని వృత్తులు మగవాళ్లకి మాత్రమే వారసత్వంగా వస్తాయి. ఆడవాళ్లకు వాటిపై అప్రకటిత నిషేధం ఉంటుంది. కానీ ఎప్పుడోకప్పుడు, ఎవరో ఒకరు వాటిని ఛేదిస్తారు. లావణ్య, బిందుప్రియ క్షౌర వృత్తిలోకి అడుగుపెట్టి ఆపనే చేశారు. అవహేళనలూ, అవమానాల్ని పట్టించుకోకుండా తమ కుటుంబాల్ని ఆర్థికంగా గాడిలో పెట్టారీ మగువలు.
ఆమె కథ సినిమాగా!
గ్రామంలోనే కటింగ్ సెలూన్ నడుపుతూ భార్య, ముగ్గురు ఆడపిల్లల్ని పోషించే వాడు రాజేశ్. ఓరోజు పనిచేస్తూ కుప్పకూలిపోయాడు. ‘బ్రెయిన్ ట్యూమర్.. బతకడం కష్టమే. ఎందుకైనా మంచిది పెద్దాసుపత్రిలో చేర్పించండ’ని వైద్యులు చెప్పడంతో అలా చేశారు. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని చిన్న కూతురు బిందూనే ఆదుకుంది.
మేడిపల్లి బిందుప్రియది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మొడికుంట. అయిదో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చేసే పనిని ఆసక్తిగా గమనిస్తూ తానూ నేర్చుకుంటానంది. కూతురి ఉత్సాహం చూసి ఆ తండ్రి మురిసిపోయాడే తప్ప నలుగురూ ఏమనుకుంటారోనని సందేహించలేదు. సెలవుల్లో ఆమె సెలూన్‌లో ఉంటూ క్షవరం, గడ్డం చేయడం నేర్చుకుంది. బిందు తండ్రి హాస్పిటల్ బెడ్‌పైన ఉండటంతో, తల్లి ఆయనకు సపర్యలు చేస్తూ ఆయన పక్కనే ఉండేది. ఆ కుటుంబానికి సెలూన్ తప్ప మరో ఆధారమే లేదు. దాంతో తన లక్ష్యం స్పష్టమైంది బిందూకి. అప్పటికి ఏడో తరగతి పూర్తై.. వేసవి సెలవులిచ్చారు. రెండో ఆలోచన లేకుండా సెలూన్‌ని తెరిచి పని మొదలుపెట్టింది. బడులు తెరిచాకా ఉదయం తొమ్మిది వరకూ సెలూన్ తెరిచి.. తర్వాత స్కూల్‌కి వెళ్లేది. సాయంత్రం 4-8 మధ్య మళ్లీ వచ్చి తెరిచేది. బతుకు పోరాటంలో అంత చిన్నమ్మాయి ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాల్ని ప్రోత్సహించకపోగా.. చుట్టుపక్కల వారి హేళనలు, చులకన మాటలూ. అవన్నీ పంటి బిగువునే భరిస్తూ తండ్రి కోలుకునే వరకూ అంటే దాదాపు ఏడాదిన్నర ఇలానే పనిచేసింది. ఆమె ధైర్యం, పట్టుదల కారణంగా ఆ కుటుంబం ఓ పెద్ద కుదుపునుంచి బయట పడింది. ఇప్పుడు హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోన్న బిందు.. సెలవులకి ఊరెళ్లినప్పుడల్లా సెలూన్‌లో పనిచేస్తుంది. తన గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రవాస భారతీయుడు వివేక్ పోతినేని బిందు కథని సినిమాగా తీస్తున్నాడు. ‘నా కథ సినిమాగా రావడం సంతోషంగా ఉంది. కులవృత్తిని నేనెప్పుడూ నామోషీగా భావించలేదు. ఇది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం’ అంటోన్న బిందూ కల నిజమై ఆమె కథకు సీక్వెల్ కూడా రావాలని ఆశిద్దాం!
- ఉప్పుల లింగయ్య, ఈటీవీ ఖమ్మం
ఆదాయం రెట్టింపు!
భర్తతోపాటు భార్య కూడా ఆఫీసులో, పొలంలో కలిసి పనిచేయడం చూసుంటారు. కానీ భర్తతో కలిసి హెయిర్ సెలూన్‌లో పనిచేస్తున్న ప్రత్యేకత లావణ్య సొంతం. అయితే ఇదంత సులభంగా జరగలేదు!
కొత్వాల్ లావణ్యది సిద్దిపేట జిల్లా, హనుమాన్ నగర్. పదో తరగతి చదివింది. ఎంత ప్రేమ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల పైచదువులకు వెళ్లలేకపోయింది. కులవృత్తిని నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకుంది. సామాజిక కట్టుబాట్లు దాన్నీ నెగ్గనివ్వలేదు. 2008లో శ్రీనివాస్‌తో పెళ్లయ్యాక పొలం పనులకు వెళ్లింది. కానీ తనకు అప్పటికే బోదకాలు సమస్య. దాంతో కలుపుతీత, నాట్లు వేయడం.. కష్టంగా ఉండటంతో మానేసింది. 20 ఏళ్లుగా భర్త నడుపుతోన్న సెలూన్ కొవిడ్ కారణంగా 2020లో మూతపడింది. ఆ సమయంలో భర్తతో పాటు కూలీగా వెళ్లేది. వాటితో స్థిరమైన ఆదాయం వచ్చేది కాదు. ఓ పక్క అప్పులు పెరిగిపోయేవి. ఆ కష్టాలు ఏడాదికిపైనే నడిచాయి. చివరికి గతేడాది నవంబరులో కేసీఆర్‌నగర్‌లో ‘హరీషన్న హెయిర్ సెలూన్’ ప్రారంభించాడు శ్రీనివాస్. పెట్టుబడి రూ.1.5 లక్షలు. నెలవారీ అద్దె రూ.3550. వీటికి తోడు ప్రతి నెలా లావణ్య మందులకు రూ.2000 అవుతుంది. ఒక్కరే సంపాదిస్తే అప్పుల కొండ కరగదని లావణ్యకి అర్థమైంది. చివరికి ధైర్యం చేసి భర్తకు చెప్పిందో రోజు... ‘నేనూ కుల వృత్తిలోకి వస్తా’ అని. అతను కూడా ఆమె సంకల్పాన్ని మెచ్చుకుని క్షవరం, గడ్డం చేయడంలో అయిదు నెలలు శిక్షణ ఇచ్చాడు. అప్పుడు అందరూ నవ్వారు. కానీ ఆ దంపతులు వాటిని పట్టించుకోలేదు. క్రమంగా వారి పరిస్థితులను, పట్టుదలను అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భర్తతో కలిసి అదే దుకాణంలో పని చేస్తోంది లావణ్య. ఇద్దరూ పని చేయడంవల్ల ఆదాయం రెట్టింపైంది. ఉన్న ఊళ్లోనే రోజూ రూ.1000 వరకూ సంపాదిస్తారు. ‘ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. మావారికీ సూటిపోటి మాటలు తప్పలేదు. కానీ మా పేదరికం ముందు అవి సమస్యగా అనిపించలేద’ంటోంది లావణ్య.
- నాయని హర్షవర్ధన్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.