ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు

ఆమె చేసే ఛాట్‌ కోసం జనం క్యూ కడతారు. చాలా చలాకీగా క్షణాల్లో రుచికరమైన ఛాట్‌, పానీపూరీ చేసి అందిస్తుంది. అందులో ఏముంది ప్రత్యేకత అంటారా? తను  ఆ ఛాట్‌ స్టాల్‌ను నిర్వహిస్తోంది చదువుకోవడం కోసం. ఆ అమ్మాయి వీడియోను

Updated : 12 Aug 2022 09:42 IST

ఆమె చేసే ఛాట్‌ కోసం జనం క్యూ కడతారు. చాలా చలాకీగా క్షణాల్లో రుచికరమైన ఛాట్‌, పానీపూరీ చేసి అందిస్తుంది. అందులో ఏముంది ప్రత్యేకత అంటారా? తను  ఆ ఛాట్‌ స్టాల్‌ను నిర్వహిస్తోంది చదువుకోవడం కోసం. ఆ అమ్మాయి వీడియోను ఓ యూట్యూబర్‌ సామాజిక మాధ్యమాల్లో పొందుపరిస్తే వైరల్‌ అయ్యింది. ఎంతగా అంటే 85 లక్షలమంది ఈ వీడియోను వీక్షించారు. తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలా వెలుగులోకి వచ్చిన పూనమ్‌ స్ఫూర్తి కథనం మీరూ చూడండి...

హాయిగా చదువుకుంటూ, స్నేహితులతో లేదా కుటుంబీకులతో కలిసి సరదాగా ఛాట్‌ తినే వయసు పూనమ్‌ది. అయితే అదే ఛాట్‌ తయారుచేసి విక్రయిస్తోంది పంజాబ్‌ మొహాలీకి చెందిన పూనమ్‌. ముగ్గురు తోబుట్టువులున్న ఈమెకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. భర్త నడిపే ఫుడ్‌స్టాల్‌ను తల్లి చేతుల్లోకి తీసుకుంది. అలా అమృతసర్‌లో స్టాల్‌ను నిర్వహిస్తూ తమ నలుగురినీ అమ్మ పోషిస్తోందని వివరించింది పూనమ్‌. ‘నేనే ఇంట్లో పెద్దదాన్ని. ఇంటర్‌ వరకు అమ్మకు సాయం చేస్తూ, ఓ దంతవైద్యశాలలో చిన్న ఉద్యోగం చేస్తూ చదువుకునేదాన్ని. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు మొదలై, నా చదువు ఆగిపోయింది. పెద్ద చదువులు చదవాలనే నా కలను ఎలా అయినా నెరవేర్చుకోవాలనిపించింది. నా తమ్ముడు, చెల్లి చిన్నవాళ్లు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తూనే, నా చదువును కొనసాగించాలనుకున్నా. అందుకే అయిదేళ్లు చేసిన ఆ చిన్న ఉద్యోగాన్ని వదిలేసి, సొంతంగా ఏదైనా చేద్దామని నిర్ణయించుకున్నా. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ ఛాట్‌బండార్‌. నాకు పానీపూరీ తయారీ తెలుసు. దాంతో ఒక చిన్న స్టాల్‌ ప్రారంభిస్తానని ఇంట్లో చెప్పా. అమ్మ మొదట ఒప్పుకోలేదు. చాలా గొడవ చేసింది. నేను మార్కెట్లో నిలబడి  ఒంటరిగా పానీపూరీ అమ్మడం ఆమెకు నచ్చలేదు. ఎలాగో ఒప్పించగలిగా. ఇలా ఏడాది క్రితం ఈ స్టాల్‌లో పానీపూరీ, పాపడీ ఛాట్‌, దహీ భల్లా, ఆలూ టిక్కీ విక్రయిస్తున్నా. ఏది ఆర్డరు వచ్చినా.. క్షణాల్లో పరిశుభ్రంగా, రుచిగా చేసి అందించేయగలను. వినియోగదారులకు ఈ రుచి నచ్చింది. నాకు లాభదాయకంగానూ ఉంది. సాయంత్రం అయిదుగంటలకు ప్రారంభిస్తే రెండు మూడు గంటల్లో పని పూర్తవుతుంది. కొన్నిసార్లు రాత్రి పది కూడా అవుతుంది. ఎలాగైతేనేం నా చదువును కొనసాగిస్తున్నా. ఇప్పుడు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నాను. చదువు తర్వాత మంచి ఉద్యోగంలో చేరాలనేదే నా లక్ష్యం. ఏ పనైనా చిన్నది, పెద్దది అంటూ ఉండదు. ప్రతి పని గౌరవమైనదే నమ్ముతాను. ఎవరేమనుకున్నా నా మనసుకు నచ్చింది చేస్తున్నా. నా కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించే బాధ్యత నాపై ఉంది’ అంటోన్న పూనమ్‌ కథ ఆదర్శం కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్