సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!

బాగా సాగుతోన్న వ్యాపారానికి కరోనా రూపంలో బ్రేక్‌ పడింది. కానీ వన్షిక భయపడి కూర్చోలేదు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ వేచి చూద్దామనీ అనుకోలేదు. పరిస్థితికి తగ్గట్టుగా వ్యాపార తీరును మార్చుకుంటూ నాయకత్వానికి కొత్త అర్థం చెబుతోంది.

Updated : 18 Aug 2022 11:41 IST

బాగా సాగుతోన్న వ్యాపారానికి కరోనా రూపంలో బ్రేక్‌ పడింది. కానీ వన్షిక భయపడి కూర్చోలేదు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ వేచి చూద్దామనీ అనుకోలేదు. పరిస్థితికి తగ్గట్టుగా వ్యాపార తీరును మార్చుకుంటూ నాయకత్వానికి కొత్త అర్థం చెబుతోంది. నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి చదివేయండి.

ఫీసుకి ఏం వేసుకెళ్లాలి? హుందాగా కనిపిస్తూనే.. సౌకర్యంగా ఉండాలి. ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి? చాలామంది ఉద్యోగినులు ఎదుర్కొనే ఈ సమస్యే వన్షిక చౌదరికీ తటస్థించింది. తను మాత్రం అక్కడే ఆగిపోక దానికో సమాధానం కనుక్కోవాలనుకొంది. ఈమెది దిల్లీ. నాన్నది టెక్స్‌టైల్‌ వ్యాపారం. అదే ఆమెకు వస్త్రాల డిజైనింగ్‌పై ఆసక్తిని కలిగించింది. సింగపూర్‌ లాసల్లే కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఫ్యాషన్‌ మీడియా అండ్‌ ఇండస్ట్రీ కోర్సు చేసింది. 2015లో భారత్‌కి తిరిగొచ్చాక తండ్రితో కలిసి రెండేళ్లు పని చేసింది. వ్యాపారంతోపాటు వస్త్రాల ఎగుమతి, దిగుమతుల గురించీ తెలుసుకుంది. ఆఫీస్‌కి వేసుకునే దుస్తుల విషయంలో వన్షిక ఎప్పుడూ ఇబ్బంది పడేది. ఆన్‌లైన్‌లో వెతికినా ప్రయోజనం లేదు. ఇది తనతోపాటు ఎంతోమంది సమస్య కదా అనుకొని 2017లో రూ.లక్షతో ‘కన్యా.ఇన్‌’ అనే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించింది. నేటి అమ్మాయిలకు నచ్చేలా ఫ్యాషన్‌, సౌకర్యం రెండింటి మేళవింపుతో డిజైన్లు తయారు చేసింది. అవి యువతని మెప్పించాయి. తక్కువ వ్యవధిలోనే ఆర్డర్లు పెరిగాయి. దీంతో మరిన్ని ప్రయోగాలు చేసింది. వీటితోపాటు ‘కన్యా ఈజ్‌ క్లాత్స్‌ విత్‌ ఎ వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌’ ట్యాగ్‌లైన్‌ కూడా వినియోగదారులను ఆకర్షించింది. ఆఫీసుకు దుస్తులనగానే ‘కన్య’ గుర్తు రావాలనే లక్ష్యంతో పనిచేసింది. ‘దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల నుంచి ఆర్డర్లొచ్చేవి. ఏడాది తర్వాతి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలల వాళ్లు తమకూ యూనిఫాంలు చేసివ్వమనే వారు. మొదట ఆసక్తి చూపలేదు. వాటికున్న మార్కెట్‌ చూశాక ‘కన్యా యూనిఫామ్స్‌’ మొదలుపెట్టా. ఇప్పుడు 200కు పైగా సంస్థలు మా కస్టమర్లే. అదే సమయంలో అభిజీత్‌తో పెళ్లైంది. ముంబయిలో కాపురం పెట్టాం. దీంతో అక్కడా యూనిట్‌ ప్రారంభించా’ అని చెప్పుకొచ్చింది వన్షిక.

విజయవంతంగా సాగుతున్న ‘కన్య’కు కొవిడ్‌ రూపంలో సమస్య ఎదురైంది. ఎన్నో ఆర్డర్లు క్యాన్సిల్‌ అయ్యాయి. ‘ఒక్కసారిగా వ్యాపారం కూలబడిపోయింది. ఏం చేయాలో తోచలేదు. అప్పుడే పీపీఈ కిట్ల ఆలోచన తట్టింది. వైరస్‌ సోకకుండా చైనాలో వీటిని వినియోగించే వారు. ఈ వైరస్‌ ఆనవాళ్లు మనదేశంలోనూ కనిపిస్తోంటే ఈ కిట్స్‌ మనవాళ్లకీ అవసరమవుతాయనుకున్నా. ‘కన్యా మెడ్‌’ పేరుతో శాంపిల్స్‌ తయారుచేసి డీఆర్డీవో ఆమోదం పొందాం. కరోనా వ్యాపించే నాటికి మార్కెట్‌లోకి తీసుకురాగలిగాం. సహాయకులు, దుకాణాలు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రులు, కొవిడ్‌ కేంద్రాలను స్వయంగా సంప్రదించాం. సరఫరా సంగతీ మేమే చూసుకున్నాం. ఎన్ని ఇబ్బందులెదురైనా కరోనాతో యుద్ధంలో మా వంతు సాయమనుకుంటూ.. ముందుకు సాగాం. ఎన్నో రాష్ట్రాలకు మా ఉత్పత్తులు వెళ్లాయి. ఆ ఒక్క ఏడాదే 60 లక్షల పీపీఈ కిట్లు అమ్మాం. ఆ తర్వాత మెడికల్‌ విభాగాల వారికీ యూనిఫాంలు డిజైన్‌ చేశాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద, చిన్న ఆసుపత్రుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మరిన్ని కొత్త వెంచర్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నా’మని చెబుతోన్న 32 ఏళ్ల వన్షిక.. మంచి ఆవిష్కర్త కూడా. యూకలిప్టస్‌ ఆకుల నుంచి దారాన్ని తయారు చేసి, దాంతో వస్త్రాన్ని రూపొందించిందీ అమ్మాయి. దీనికి సాధారణ వస్త్రాల తయారీకన్నా 20 శాతం తక్కువ నీరు అవసరమవుతుందట. ఇప్పుడు దీన్ని మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్