18 ఏళ్లలో 70 దేశాలు చుట్టింది

శిబు వయసు 33 ఏళ్లు. ఇప్పటికే ఎన్ని దేశాలు తిరిగొచ్చిందో చూశారుగా. ‘అబ్బో.. బాగా డబ్బున్న కుటుంబం అయ్యుంటుంది’ అంటారా? అస్సలు కాదండీ! ‘మరెలా...’ అంటే.. ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ. క్లాస్‌రూమ్‌లో తపస్సు

Published : 16 Aug 2022 01:01 IST

శిబు వయసు 33 ఏళ్లు. ఇప్పటికే ఎన్ని దేశాలు తిరిగొచ్చిందో చూశారుగా. ‘అబ్బో.. బాగా డబ్బున్న కుటుంబం అయ్యుంటుంది’ అంటారా? అస్సలు కాదండీ! ‘మరెలా...’ అంటే.. ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ. క్లాస్‌రూమ్‌లో తపస్సు చేయడంకన్నా, బయట ప్రపంచం చూడ్డం మిన్ననుకుంది. అందుకోసం కొత్తదారులు వెతికింది. అదెలా అంటే..

15 ఏళ్ల వయసు నుంచి శిబు బెనడిక్టిస్‌ ఈ పర్యటనలు మొదలుపెట్టింది. అప్పటికి స్కూలు చదువు మాత్రమే పూర్తైంది. శిబు అమ్మానాన్నల వృత్తిరీత్యా అమెరికా, కోస్టారికాల్లో పెరిగింది. 2005లో వైద్యవిద్య కోసమని తొలిసారి ఒంటరిగా చైనా వెళ్లింది. తర్వాత దాన్ని పక్కన పెట్టి ప్రపంచాన్ని చుట్టడం మొదలుపెట్టింది. ‘మొదటిసారి ఒంటరి ప్రయాణం. చాలా ఉత్సాహంగా చైనాలో అడుగుపెట్టా. కానీ కొద్దిరోజులకే కోర్సుపై ఆసక్తి పోయింది. తరగతి గదిలో కూర్చొని కాక ప్రపంచ పాఠాలు నేర్వాలనిపించింది. ఇంకేం.. ప్రయాణాలు మొదలుపెట్టా. ఇప్పటి వరకూ 70 దేశాల్లో పర్యటించా. ఈ మాట వినగానే అందరూ ‘బాగా ధనవంతుల కుటుంబమనుకుంటా మీది’ అనేస్తుంటారు. కానీ నేను ఇంట్లోంచి డబ్బేమీ తీసుకోలేదంటే నమ్ముతారా? ‘మరింత ఖర్చు ఎలా?’ అన్నదేగా సందేహం! విదేశీ ప్రయాణమనగానే ఖర్చుతో కూడుకున్నది అనుకుంటారంతా. నిజానికి అతి తక్కువ ఖర్చుతో చాలా హాయిగానే ఉండొచ్చు. అందుకు నేనే ఉదాహరణ. ఏ దేశానికి వెళ్లినా వసతి కోసం ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టలేదు. అలాగని ఏ టెంట్‌లోనో, ఫుట్‌పాత్‌ల మీదో ఉన్నాననుకునేరు. రాజభవనాల్లాంటి వాటిల్లోనే ఉన్నా. అదెలాగంటే.. మొదట్లో నేనూ ఖర్చు గురించి భయపడ్డ దాన్నే. తర్వాత బాగా పరిశోధించా. అదే సాయపడింది. వెళ్లాలనుకున్న ప్రదేశాన్ని బాగా పరిశోధిస్తా. అక్కడ ఇల్లు, పెంపుడు జంతువుల్ని, గార్డెన్‌ను చూసుకున్నందుకు ఉచితంగా ఉండనిచ్చే వాళ్లని ముందుగానే వెతుక్కుంటా. అలా ఖర్చుండదు... పైగా సౌకర్యం. దీనికో యాప్‌లో సభ్యత్వం తీసుకున్నా’ అని చెప్పింది శిబు.

లగేజీ ఖర్చు తగ్గించుకోవడానికి ఒక్క సూట్‌కేస్‌తోనే బయల్దేరుతుందట. ఆనందంగా గడపడమంటే దేన్నైనా ఆస్వాదించడమే అనే శిబు వస్తువులు, వస్త్రాలపై అనవసరంగా ఖర్చు చేయదట. ప్రయాణాలకీ ప్రజా రవాణానే ఉపయోగిస్తుందట. ఈ వివరాలన్నింటినీ ఇన్‌స్టాలో పంచుకోగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. టికెట్లకు అయినా ఖర్చవుతుందిగా! అంటారా? అవసరమైతే వెళ్లిన ప్రదేశంలో వెయిటర్‌, గార్డెనర్‌.. ఇలా అప్పటికప్పుడు నచ్చిన పని చేస్తుంది. ఇలా పర్యటనల్లో మునిగి తేలుతోంటే శిబు చదువు అటకెక్కినట్టేనా అనుకోకండి. తను స్కాలర్‌షిప్‌లతో ఎనిమిది దేశాల్లో కోర్సులు పూర్తి చేసింది. డిజిటల్‌ మార్కెటింగ్‌ విభాగంలో ఓ అమెరికా సంస్థ కోసం పనిచేస్తోంది.


ఎందుకిదంతా అంటే...

‘ప్రయత్నించాలే కానీ అసాధ్యమనుకున్నవెన్నో సులువుగా చేసేయొచ్చు. ఉన్నది ఒకే జీవితం... అదీ చాలా చిన్నది. ఖరీదైన వస్తువుల వెనక పరిగెత్తక ఆస్వాదించడం నేర్చుకోండి. ప్రపంచం ఎంత అందమైన ప్రదేశమో అర్థమవుతుం’దని చెబుతోందీ 33 ఏళ్ల అమ్మాయి. మీరేమంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్