ఆ స్నేహితులు అవసరమా?

కొందరు స్నేహితుల్ని కుటుంబసభ్యుల్లా భావిస్తాం, ప్రతిదీ వారితో పంచుకుంటుంటాం. కానీ ఇక్కడా కొన్ని పరిధులుంటాయి అంటున్నారు నిపుణులు. లేదంటే మనసుపై నెగెటివ్‌ ప్రభావం పడుతుందంటున్నారు.

Updated : 17 Aug 2022 08:53 IST

కొందరు స్నేహితుల్ని కుటుంబసభ్యుల్లా భావిస్తాం, ప్రతిదీ వారితో పంచుకుంటుంటాం. కానీ ఇక్కడా కొన్ని పరిధులుంటాయి అంటున్నారు నిపుణులు. లేదంటే మనసుపై నెగెటివ్‌ ప్రభావం పడుతుందంటున్నారు.

* స్నేహంలో నీది, నాది అనేది ఉండదు. నిజమే.. కానీ అది రెండువైపులా ఉంటేనే అందం. అలాకాకుండా తరచూ మీతోనే ఖర్చు పెట్టిస్తుండటం, ప్రతి చిన్నదానికీ మీమీదే ఆధారపడటం మంచిది కాదు. మీ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి అడగడం, మీరు ఇబ్బంది పడుతున్నా గమనించక పోవడం నిజమైన స్నేహితురాలి లక్షణం కాదు.

* థాంక్స్‌, సారీలకు చోటుండదు. ఇదీ వాస్తవమే. కానీ ఎప్పుడు? చిన్న సాయాలు, తప్పుల విషయంలో. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మిమ్మల్ని బాధపెట్టి, ఆ విషయం తెలిసీ క్షమాపణ అడగలేదంటే.. మీ భావోద్వేగాలకు విలువ ఇవ్వట్లేదనే!

* టాలెంట్‌, నేపథ్యాలు, అంతస్థులు లెక్క లేసుకుని చేసేది స్నేహం కాదు. మనం ఏదైనా సాధిస్తే మనకంటే ఎక్కువ ఆనందం ఫ్రెండ్స్‌కే ఉంటుంది. తనకు రాకపోయినా కనీసం మీకొచ్చినందుకు అభినందించొచ్చు. అలా కాక ఆ ఆనందాన్ని ఆవిరి చేసేలా మాట్లాడుతున్నా, కుంగిపోయేలా చేస్తున్నా వారికి దూరంగా ఉండటమే మంచిది.

* పరిస్థితులు, సమయానికి తగ్గట్టుగా ఎవరైనా మారాల్సిందే. అయితే ఆ మార్పు మీకూ సౌకర్యవంతంగా ఉండాలి. దుస్తులు, తీరు విషయంలో మీ విలువలతో రాజీపడాల్సి వస్తే కుదరదని చెప్పండి. అయినా బలవంతం చేస్తోంటే.. మీ అభిప్రాయానికి విలువనివ్వట్లేదనే! అలాంటివారు స్నేహితులెలా అవుతారు.

* కనిపించే తీరు, ప్రవర్తన, ధరించే వస్త్రాలు.. ఇలాంటి కొన్ని విషయాల్లో చాలామందిలో ఆత్మన్యూనత ఉంటుంది. దాన్ని పోగొట్టకపోయినా ఫర్లేదు.. కానీ ఎత్తిచూపుతోంటే వాళ్లు స్నేహితులవరు. పక్కన ‘మన’ అన్నవారెవరైనా ఉంటే మనసుకు స్థిమితంగా ఉండాలి. మనం మనలా ఉండగలగాలి. అలా లేరంటే మన వాళ్లు కాదనే.. స్నేహితులు అంతకన్నా కాదనే! వారికి వీలైనంత దూరంగా ఉండటం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని