‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!

చిన్నప్పటి నుంచి విన్న రామాయణం భాగవతం, చూసిన చిత్రాలు.. అమ్మ వినిపించే షేక్‌స్పియర్‌ రచనలు అనూషా రావును ప్రభావితం చేశాయి. తొలి ప్రయత్నంగా తను రాసి, తీసిన లఘుచిత్రం న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. బెంగళూరు ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సెకండ్‌ రన్నరప్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ దర్శకురాలు వసుంధరతో పంచుకున్న విశేషాలివి..

Published : 18 Aug 2022 01:16 IST

చిన్నప్పటి నుంచి విన్న రామాయణం భాగవతం, చూసిన చిత్రాలు.. అమ్మ వినిపించే షేక్‌స్పియర్‌ రచనలు అనూషా రావును ప్రభావితం చేశాయి. తొలి ప్రయత్నంగా తను రాసి, తీసిన లఘుచిత్రం న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. బెంగళూరు ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సెకండ్‌ రన్నరప్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ దర్శకురాలు వసుంధరతో పంచుకున్న విశేషాలివి..

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. అమ్మ విజయారావు. నాన్న జి.వెంకటేశ్వరరావు ఈఎన్టీ సర్జన్‌. అక్క, తమ్ముడున్నారు. రోజూ రాత్రి భోజనం చేసేటప్పుడు నాన్న కథలు చెప్పేవారు. అమ్మ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదవడంతో షేక్‌స్పియర్‌ రచనలను వినిపించేది. సెలవులొచ్చాయంటే చాలు, శ్యామ్‌బెనగల్‌, సత్యజిత్‌రే, గురుదత్‌ వంటి ప్రముఖుల చిత్రాలను చూపిస్తూ వాటిలోని పాత్రలను అమ్మ పరిచయం చేసేది. అలా వాటి ప్రభావం కూడా మాపై పడింది. ఉస్మానియాలో ఇంజినీరింగ్‌ చేశా. తర్వాత కూడా కెరియర్‌పై అస్పష్టతే. ఆర్కా మీడియాలో నాలుగేళ్లు మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌లలో ఉన్నా. అప్పుడు బాహుబలి సినిమా మార్కెటింగ్‌లో చేసేదాన్ని. నాకూ సినిమాకు సంబంధించిందేదైనా చదవాలనిపించింది. కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్‌లోని ఫిల్మ్‌ స్కూల్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులో చేరతానన్నప్పుడు అమ్మా నాన్నా సరే అన్నారు. అక్కడ రెండేళ్ల కోర్సులో సాంకేతికత, స్క్రీన్‌ రైటింగ్‌, డైరెక్షన్‌లలో ఎంతో నేర్చుకున్నా. ప్రాజెక్ట్‌ వర్కుల్లో భాగంగా లఘు చిత్రాలు చేస్తున్నప్పుడు మన సంప్రదాయాలు, భావోద్వేగాలు గుర్తొచ్చేవి. దాంతో ఇక్కడే ఏదైనా చేయాలనిపించి హైదరాబాద్‌కు చేరుకున్నా.

లాక్‌డౌన్‌కు అనుసంధానంగా..

స్టాండప్‌ రాహుల్‌ చిత్రానికి స్క్రీన్‌ప్లే రచయితల్లో ఒకరిగా అవకాశం వచ్చింది. తర్వాత లాక్‌డౌన్‌ మొదలైంది. ఆ సమయంలో కేరాఫ్‌ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్‌ మహా అరగంట నిడివి ఉండేలా లఘుచిత్రానికి కథాలోచన చెప్పమన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు కథలు వినిపించా. వాటిలో ‘స్వర్ణ’ ఆయనకు నచ్చింది. అత్యాచార నేరంపై జైల్లో ఉన్న ఓ యువకుడి కుటుంబ కథ ఇది. నేరాల్లో బాధితులకి దక్కే సానుభూతి నిందితుడి కుటుంబానికి రాదు. ఈ కోణంలో ఆ కుటుంబ వేదనను తెరపై చూపించాలని అనిపించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఎవరినీ కలవలేకపోయా. ఇటువంటి కేసులను పరిశీలించా. టీవీ, పత్రికల్లో కథనాలు చదివా. ఓ నిందితుడి కుటుంబం సామాజిక బహిష్కరణకు గురై, లాక్‌డౌన్‌లో మరింత ఒంటరైనప్పుడు తమ కొడుకును ఎలా పెంచాం, ఎందుకలా నేరానికి పాల్పడ్డాడు అనే మానసిక సంఘర్షణలో పడటమే ఈ చిత్ర కథగా రాసుకున్నా. కొవిడ్‌ రెండో వేవ్‌లో ఈ చిత్రం షూటింగ్‌ నిజామాబాద్‌లో జరిగింది. అక్కడ మాకు పొలం, ఇల్లు ఉన్నాయి. నాన్న పదవీ విరమణ తర్వాత అక్కడ వ్యవసాయం చూసుకుంటున్నారు. అక్కడకెళ్లి నిందితుడి భార్య ‘స్వర్ణ’ పాత్రకు ఎంపిక మొదలుపెట్టా. స్థానిక నాటకాల కంపెనీని సంప్రదించా. డిగ్రీ చదువుతున్న కుమారి అనే అమ్మాయిని చూసినప్పుడు స్వర్ణ పాత్రకు సరిపోతుందనిపించింది. నటించమని అడిగితే తనకు తెలీదంది. నెలరోజులు వర్క్‌షాపు నిర్వహించా. నిందితుడి తల్లిదండ్రులు, అత్తామామలు ఇలా పాత్రలన్నింటికీ అదే గ్రామం వారినే ఎంచుకున్నా. కథ విన్నప్పుడు వాళ్లు ఆసక్తి చూపించలేదు. భావాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించా. కథారచనతోపాటు దర్శకత్వమూ నేనే. చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తయ్యింది. 29 నిమిషాల నిడివి ఉన్న ఈ లఘుచిత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేశాం. న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కావడం చాలా సంతోషం.

అమ్మానాన్న స్ఫూర్తి..

గతేడాది ఓ లఘు చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేశా. ఆంగ్లం, హిందీ, కన్నడం, మలయాళం, తమిళం భాషల్లో ఇది ఓటీటీలో విడుదల కానుంది. ఓ హిందీ చిత్రానికి స్క్రిప్ట్‌ సూపర్‌వైజర్‌గా పనిచేశా. మరో రెండు ప్రాజెక్ట్‌లకు పని చేస్తున్నా. మణిరత్నం దగ్గర పని చేయాలనేది నా కల. నాన్న చదువుకోవాలనే లక్ష్యంతో నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఉస్మానియాలో వైద్యకోర్సులో చేరి చాలా కష్టపడి ఇంగ్లిష్‌ నేర్చుకుని మరీ చదువుకున్నారు. ఆయన అనుభవాలను తెలుసుకున్నప్పుడు, అమ్మ చెప్పే కథలు, సాహిత్యం వింటున్నప్పుడు వారిద్దరూ మాకెంత స్ఫూర్తినందించారో మాటల్లో చెప్పలేను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్