గని నుంచి.. పాఠశాల ఒడికి...

స్ఫటికంలా, పారదర్శకంగా ఉండే మైకా ఖనిజాన్ని సౌందర్య సాధనాల్లో, ఆటోమొబైల్స్‌లో ఉపయోగిస్తారు. ఈ పరిశ్రమ ఝార్ఖండ్‌లో వృద్ధి చెందుతున్న మాట నిజమే కానీ వేలాదిమంది చిన్నారుల బాల్యం ఆ గనుల్లో మగ్గిపోవడం విషాదకరం.  దుర్భర పేదరికమే అందుకు కారణం.

Updated : 22 Aug 2022 07:17 IST

స్ఫటికంలా, పారదర్శకంగా ఉండే మైకా ఖనిజాన్ని సౌందర్య సాధనాల్లో, ఆటోమొబైల్స్‌లో ఉపయోగిస్తారు. ఈ పరిశ్రమ ఝార్ఖండ్‌లో వృద్ధి చెందుతున్న మాట నిజమే కానీ వేలాదిమంది చిన్నారుల బాల్యం ఆ గనుల్లో మగ్గిపోవడం విషాదకరం.  దుర్భర పేదరికమే అందుకు కారణం. ఆ ప్రమాదం నుంచి బాలకార్మికుల్ని తప్పించడంలో, దోపిడీదారుల్ని నిలదీయడంలో నికితాకుమారి ముందుంటుంది. ఎవరామె... నేపథ్యమేంటి...

నికితాకుమారిది ఝార్ఖండ్‌లోని ధాబ్‌ గ్రామం. ఎన్నో కుటుంబాలకు ఆ గనులే బతుకుదెరువు. డబ్బుకు ఆశపడి పిల్లల్నీ వెంట తీసికెళ్తారు. గనుల్లో పనికి కుదిరేవారు కొందరైతే, పొలాల్లో పరిగలా గనుల చుట్టూ దొరికే మైకా తునకలను ఏరి ‘ధిబ్రా’ పేరుతో అమ్మేవారు కొందరు. ‘అమ్మానాన్నలు చెప్పడంతో ఎనిమిదేళ్లప్పుడు నేనూ గనులకు వెళ్లేదాన్ని. ఆ మైకా గనుల్లోనే కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ సామాజికవేత్తలు మా ఊరికొచ్చారు. బాల్యం వసివాడకూడదంటూ నాన్నకు నచ్చజెప్పి నన్ను స్కూల్లో చేర్చారు. అలాంటి మహత్తర అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అదో అద్భుతం అనిపిస్తుంది. దాంతో నా జీవితం మారింది. చదువు అనేది శక్తివంతమైన ఆయుధం. ఇప్పుడు నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. ‘బాల పంచాయత్‌’లో సభ్యత్వం తీసుకున్నాను. సామాజిక కార్యక్రమాల్లో పనిచేస్తున్నాను. మా చుట్టుపక్కల ఉన్న బసారియా, బెహ్రాది, బాంటక్‌, సిమారియా గ్రామాల్లో బాలకార్మికులు, బాల్యవివాహాల గురించి అవగాహన కల్పిస్తున్నాను. ఇప్పటిదాకా 40 మంది బాలకార్మికుల్ని స్కూళ్లలో చేర్పించగలిగా’ అని చెబుతుందామె. నికితాకుమారి వల్ల స్కూల్లో చేరిన పిల్లలు ఆమెనొక ఆదర్శమూర్తిగా భావిస్తారు. అలాంటి అమ్మాయే రూబీ ‘నేను నాన్నతో కలిసి మైకా గనుల్లో తవ్వుతుండేదాన్ని. నికితా దీదీ వల్లే నేను స్కూల్లో చేరాను. ఆ గడ్డురోజుల్ని ఇక దాటేశాను’ అంటూ సంతోషంగా చెప్తుంది. ‘నికిత చాలా తెలివైన పిల్ల. స్కూల్లో చేర్చినందుకు సంబరపడింది. చదువులో రాణిస్తూనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశ వదులుకోలేదు. డిగ్రీ పూర్తిచేసింది. తాను పోలీసై బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనుకుంటోంది. మంచి ఆశయం’ అంటూ ఆమెని అభినందించారు ‘కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌’ ప్రతినిధి రాకేష్‌ సెంగర్‌. లక్ష్యసిద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నికిత మరెందరికో స్ఫూర్తి కానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని