ఆ ఆంక్షలే.. దారి చూపాయి

‘ఆడపిల్లవు.. గజ్జెకట్టి ఇలా ఊరూరా తిరుగుతుంటే పరువేం కావాలి? బంద్‌ చేయ్‌ ఇవన్నీ’ అన్న వాళ్లకు తన విజయాలతోనే సమాధానం చెప్పింది స్వర్ణ. గాయనిగా మారింది.. జిమ్నాస్ట్‌గా ఎదిగింది. గుర్రపుస్వారీ, కత్తిసాములు నేర్పుతూ అమ్మాయిల్లో ధైర్యాన్ని నింపుతోంది. కలరియపట్టులోనూ గుర్తింపు సాధించిన స్వర్ణయాదవ్‌ విజయం వెనుక కదిలించే కథా ఉంది...

Updated : 04 Sep 2022 06:49 IST

‘ఆడపిల్లవు.. గజ్జెకట్టి ఇలా ఊరూరా తిరుగుతుంటే పరువేం కావాలి? బంద్‌ చేయ్‌ ఇవన్నీ’ అన్న వాళ్లకు తన విజయాలతోనే సమాధానం చెప్పింది స్వర్ణ. గాయనిగా మారింది.. జిమ్నాస్ట్‌గా ఎదిగింది. గుర్రపుస్వారీ, కత్తిసాములు నేర్పుతూ అమ్మాయిల్లో ధైర్యాన్ని నింపుతోంది. కలరియపట్టులోనూ గుర్తింపు సాధించిన స్వర్ణయాదవ్‌ విజయం వెనుక కదిలించే కథా ఉంది...

లుగురు ఆడపిల్లల్లో... ఆఖరి పిల్ల స్వర్ణ. తండ్రి ఆటో నడిపేవాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బైరాపూర్‌ గ్రామం వీళ్లది. కొద్దిగా పొలం ఉన్నా అదేమీ పెద్దగా ఆదరవు నిచ్చేది కాదు. అమ్మ వెంకటమ్మ.. నాన్న తగుళ్ల పెద్దయ్య. స్వర్ణకి పాటంటే ప్రాణం. కానీ.. నోరారా పాడే స్వేచ్ఛకోసం ఎన్నో ఆంక్షలని అధిగమించాల్సొచ్చింది. అక్కలు హాస్టల్లో ఉండి చదువుకునే వారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు పుస్తకాల్లో రాసుకొచ్చిన కొత్తపాటలని పాడుతుండేది. అలా వాటిపై ప్రేమను పెంచుకుంది. ‘బడిలో ఆటుందిరా చిన్న.. బడిలో పాటుందిరా చిన్నా’ అని ఆమె గొంతెత్తి పాడుతుంటే మాస్టార్లకి పండగే. ఆ పాటే.. ఊర్లో, రాజకీయ సభల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె గొంతుని అందరికీ పరిచయం చేసింది. ‘అలా పదో తరగతికల్లా పాటల స్వర్ణగా మారా. ఇంట్లోవాళ్లకి నేను బయటకెళ్లి పాడటం ఇష్టం లేదు. డిగ్రీకొచ్చేసరికి... ‘నీ బిడ్డను బయటకు పంపి కులం పరువు తీయొద్దు’ అంటూ బంధువులూ ఆంక్షలు పెట్టారు. దాంతో కొన్నాళ్లు పాటకు దూరమయ్యా’ అనే స్వర్ణ హైదరాబాద్‌ శిల్పారామంలో రాష్ట్ర యువజనోత్సవాల పాటల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది.

వందలకొద్దీ సేకరించా...

‘ఆ విజయంతో మళ్లీ పాటపై ఆశ పుట్టింది. కానీ గుర్తింపు అంత త్వరగా రాలేదు. రెండేళ్లు ఓపిగ్గా చూసిన తర్వాతే అవకాశాలొచ్చాయి. అప్పటివరకూ ఇతరులు పాడుతుంటే, స్టేజీలపై డ్యాన్సులు చేసేదాన్ని. నన్ను అడుగడుగునా ఆపిన ఆంక్షలే.. నాలో ఎదగాలనే కసిని రగిల్చాయి. అమ్మాయిలకు ఏ విద్యలు వద్దంటారో వాటినే నేర్చుకున్నా. ఎన్నో కష్టాలకోర్చి సాధన చేసి, పట్టు సంపాదించా. ఒగ్గుకథలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. రవీంద్రభారతిలో ఒగ్గు రవన్న ఆధ్వర్యంలో ‘ధర్మాగ్రహం’ పేరుతో నిర్వహించిన ఒగ్గు కథ శిబిరంలో నేనూ పాలుపంచుకున్నా. అందులో నేను వేసిన రేణుకా ఎల్లమ్మ పాత్రను చూసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ప్రశంసించారు. ఆడపిల్లలు ఎక్కువగా కనిపించని.. కత్తిసాము, కర్రసాము, కలరియపట్టు, గుర్రపుస్వారి వంటి కళల్లో నైపుణ్యం సాధించా. అవి చూసిన గవర్నర్‌ తమిళిసై మెచ్చుకోవడంతోపాటు ఈ విద్య నీతోనే ఆగిపోవద్దు.. ఇతరులకూ నేర్పించాలని మాట తీసుకున్నారు. అలా ‘స్వర్ణ ఆర్ట్స్‌ అకాడమీ’ సంస్థ స్థాపించి కళల్లో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. జానపదాలపై ప్రేమతో ఇంటర్‌ నుంచి మొదలుపెట్టి వందల జానపద గీతాలను సేకరించా. వీటిల్లో జోలపాటలు, దంపుల పాటలు, కోలాటం పాటలు, కావుని పాటలు... ఇలా ఎన్నో ఉన్నాయి. అప్పుడే జానపద కళల కోర్సు ఉందని తెలిసి తెలుగు యూనివర్సిటీలో చేరి, పీజీ చేశాను. ఇక్కడే గుస్సాడీ, కోయ బంజారా నృత్యాలు, చెక్కభజన నేర్చుకున్నా. ఇప్పుడు లలిత సంగీతమూ నేర్చుకుంటున్నా’ అంటూ తన కళా జీవితాన్ని వివరించింది స్వర్ణ.

కోట్ల వీక్షణలు...

‘స్వర్ణ స్వరాస్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా జానపదాలని ప్రేక్షకులకు చేరువ చేస్తోంది. ‘డివడివ’ అంటూ ఆమె పాడిన పాటకి 4.7 కోట్ల వరకూ వీక్షణలు వచ్చాయి. నిన్నమొన్న నువ్వు లేక, కిర్రాకిర్రా చెప్పుల, కతెరా జుంఫాలు పాటలూ సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో వ్యూస్‌ సాధించాయి. స్వర్ణ ప్రతిభకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉపాధిని అందించింది. ‘ఇతరులు రాసినవి పాడటంతోపాటు.. సొంతగా సామాజిక, జానపద గీతాలు రాసి, పాడుతున్నా. జానపద కళల్లో కృషి చేసేవారికి సీసీఆర్‌టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1,20,000 ఉపకారవేతనాన్ని అందుకున్నా. ఈ అర్హత పొందిన ఏకైక తెలుగు అమ్మాయినని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. మరింత బాధ్యతగా కళారంగానికి సేవచేస్తా’ అంటోంది స్వర్ణ. 

- చిప్ప సాయికిరణ్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని