అవమానిస్తే... ఆదరణ పెంచుకొంది!

తన ఉద్యోగాన్ని తాను చేసుకోకుండా వెళ్లగొడితే ఎలా ఉంటుంది? అదీ దళితురాలన్న కారణంతో! జీతంపైనే బతికే ఓ పేదమ్మాయి.. నిస్సహాయత, బాధ, అవమానంతో కుంగిపోదూ! లక్ష్మినీ ఇవన్నీ ఆవరించాయి. కానీ తను చూస్తూ కూర్చోలేదు. అవమానించిన వారే ఆశ్చర్యపోయేలా చేసింది. ఎలాగో చదివేయండి.

Updated : 04 Sep 2022 08:35 IST

తన ఉద్యోగాన్ని తాను చేసుకోకుండా వెళ్లగొడితే ఎలా ఉంటుంది? అదీ దళితురాలన్న కారణంతో! జీతంపైనే బతికే ఓ పేదమ్మాయి.. నిస్సహాయత, బాధ, అవమానంతో కుంగిపోదూ! లక్ష్మినీ ఇవన్నీ ఆవరించాయి. కానీ తను చూస్తూ కూర్చోలేదు. అవమానించిన వారే ఆశ్చర్యపోయేలా చేసింది. ఎలాగో చదివేయండి.

పేద కుటుంబం. దీనికితోడు నాన్న చనిపోయారు. అమ్మ కూలితోనే ఇల్లు గడిచేది. ముగ్గురు సంతానంలో లక్ష్మి పెద్దది. అమ్మకు సాయంగా చదువుతున్న డిగ్రీని వదిలేసి ఉద్యోగంలో చేరింది. వీళ్లది కర్ణాటకలోని దేవనగరి. ఐసీడీఎస్‌లో ఆరేళ్లు సహాయకురాలిగా చేశాక హలెచిక్కనహళ్లి అంగన్‌వాడీ టీచర్‌గా పదోన్నతి వచ్చింది. అక్కడ చేరడానికి వెళితే ‘దళితురాలివి. మా పిల్లలకు చదువు చెప్పే అర్హత నీకు లేద’ని గ్రామస్థులు తిరస్కరించారు. అంగన్‌వాడీ కేంద్రంలోకి కాలు కూడా పెట్టనివ్వలేదు. పైగా దానికి తాళం వేశారు. రోజూ వెళ్లడం, సాయంత్రం దాకా బయటే నిలబడి రావడం... మూడునెలలు... ఇలాగే సాగింది. ఈ అవమానం లక్ష్మిని కుంగదీసింది. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంది. వాళ్లు దగ్గర్లోని గోషాలేకి మార్చారు. ‘వాళ్ల ప్రవర్తన చాలా బాధించింది. నన్ను నేను నిరూపించుకోవాలన్న కసీ పెరిగింది. వాళ్లు బాధపడేలా చేయాలనుకున్నా. గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం గురించి వాకబు చేయడం నా పని. దీంతోపాటు పిల్లల చదువుపైనా దృష్టి పెట్టాను. నా విధులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకే. కానీ ఎనిమిదిన్నరకే వచ్చి, పిల్లలందరినీ తీసుకొచ్చి, సాయంత్రం 5 వరకూ ఆటపాటలు, చదువు నేర్పించే దాన్ని. డేకేర్‌ సెంటర్లకు తీసిపోకుండా అన్నీ చెబుతుండటంతో ఇప్పుడు మధ్య తరగతి వాళ్లూ పిల్లల్ని చేర్చడానికి పోటీ పడుతున్నారు’ అంటుంది లక్ష్మి.

బదిలీపై గోషాలేకి వచ్చినపుడు ఇక్కడా తనని పెద్దగా పట్టించుకోలేదు. పిల్లల్ని వయసుల వారీగా విభజించి వాళ్ల ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా కథలు, పాఠాలు బోధించేది. చదువే కాదు.. రోజూ ఒక కథ చెప్పి మరుసటి రోజు ప్రతీ విద్యార్థితో చెప్పించేది. పిల్లలతో రకరకాల ప్రాజెక్టులు చేయించేది. తల్లిదండ్రులనూ భాగస్వాములను చేసేది. వారితో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి పిల్లల యాక్టివిటీ ఫొటోలను పంపుతుంది. సందేహాలనూ అవసరమైతే ఫోన్‌లోనే తీరుస్తుంది. అమ్మానాన్నలతో సమావేశాలు నిర్వహించి సలహాలూ తీసుకుంటుంది. దాతల సాయంతో పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం వంటివి సమకూరుస్తుంది. తన చిత్తశుద్ధి చూశాక తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ‘చదువు విలువ నాకు తెలుసు. అందుకే, నిబద్ధతతో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను. దేన్నైనా మనస్ఫూర్తిగా, అంకితభావంతో నిర్వహిస్తే ఆదరణ దక్కుతుంద’నే లక్ష్మి.. తమ్ముణ్ని, చెల్లెల్ని చదివిస్తోంది. తన డిగ్రీనీ కొనసాగిస్తోంది. ఇప్పుడు తనకు డిపార్ట్‌మెంట్‌లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాలా మంచి పేరొచ్చింది. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆదరణ పెరిగేలా చేసుకోవడం గెలుపేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్