ఆటొద్దన్న చోటే.. క్రీడాసైన్యాన్ని తయారు చేస్తోంది

‘ఆడపిల్ల అయ్యుండి.. ఎంత ఆలస్యంగా ఇంటికొస్తోందో’, ‘ఆటలంటూ ఎప్పుడూ అబ్బాయిల చుట్టే తిరుగుతుంది’, ‘కాలో చెయ్యో విరగ్గొట్టుకొంటే ఎవరూ చేసుకోరు’.. చిన్నప్పటి నుంచీ ఇలాంటి మాటల మధ్యే పెరిగింది షెహనాజ్‌ పర్వీన్‌. సంప్రదాయ ముస్లిం అమ్మాయి.. వాటన్నింటినీ దాటుకొని తను క్రీడల్లో రాణించడమే కాదు.. మరికొందరు క్రీడాకారిణుల్నీ తయారు చేస్తోంది.

Updated : 10 Sep 2022 06:55 IST

‘ఆడపిల్ల అయ్యుండి.. ఎంత ఆలస్యంగా ఇంటికొస్తోందో’, ‘ఆటలంటూ ఎప్పుడూ అబ్బాయిల చుట్టే తిరుగుతుంది’, ‘కాలో చెయ్యో విరగ్గొట్టుకొంటే ఎవరూ చేసుకోరు’.. చిన్నప్పటి నుంచీ ఇలాంటి మాటల మధ్యే పెరిగింది షెహనాజ్‌ పర్వీన్‌. సంప్రదాయ ముస్లిం అమ్మాయి.. వాటన్నింటినీ దాటుకొని తను క్రీడల్లో రాణించడమే కాదు.. మరికొందరు క్రీడాకారిణుల్నీ తయారు చేస్తోంది.

నకు తొమ్మిదేళ్లు వచ్చేవరకూ షెహనాజ్‌ కూడా మిగతా ముస్లిం అమ్మాయిల్లానే పెరిగింది. స్కూలు, ఇల్లు, నమాజ్‌.. ఇదే తన లోకం. ఆరో తరగతిలోకొచ్చాక వాళ్ల నాన్న స్నేహితుడు బ్యాడ్మింటన్‌ను పరిచయం చేశాడు. అది తనకు తక్కువ వ్యవధిలోనే పోటీల్లో గెలిచేంతలా నచ్చింది. అయితే ఆ ఒక్క ఆటతోనే ఆగిపోలేదామె. మిగిలిన వాటిపైనా మక్కువ పెంచుకొంది. ఫుట్‌బాల్‌, రగ్బీ, ఐస్‌స్టాక్‌, మార్షల్‌ ఆర్ట్స్‌.. ఇలా ఆసక్తి కలిగించిన ప్రతి దాన్నీ నేర్చుకుంటూ వెళ్లింది. భిన్న ఆటల్లో ప్రావీణ్యం సాధించొచ్చని పదో తరగతి అయ్యాక శ్రీనగర్‌ వెళ్లింది. ఈక్రమంలో ఎన్నో అడ్డంకులు. అమ్మాయి ఆటలంటూ తిరిగితే పెళ్లి కాదు, ప్రాణాలకే ముప్పు రావొచ్చనేవారు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు. తనది జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌. సంప్రదాయ ముస్లిం కుటుంబం. నాన్న పోలీసు విధుల్లో చనిపోయారు. అమ్మ గృహిణి. ఆయనకొచ్చే పెన్షనే వాళ్ల జీవనాధారం. దీంతో అందరూ నిరాశపరిచినవారే, భయపెట్టినవారే. కానీ షెహనాజ్‌కి వాళ్లమ్మ తోడు నిలిచింది. తను కోరుకున్న చోట చదువుకోనివ్వడమే కాదు.. ఎక్కడ పోటీలు జరిగినా పంపేది. రగ్బీ, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, బహుమతులూ గెల్చుకుంది.

‘2010 జాతీయస్థాయి రగ్బీ పోటీల్లో గెలిచి ట్రోఫీతోపాటు రూ.6000 అందుకున్నా. ఆ ఫొటో పత్రికల్లో ప్రచురితమైంది. అది చూశాక మా ఊరివాళ్ల అభిప్రాయాల్లో కాస్త మార్పు వచ్చింది. పతకాల సంఖ్య పెరిగే కొద్దీ వాళ్ల చూపుల్లో ఆదరణ కనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక ఆడటం ఆపా. నేనొక్కదాన్నే ఆడటం కాదు.. మిగతా అమ్మాయిల్నీ ఈ రంగంలో చూడాలన్నది నా కల. అందుకే కోచ్‌నయ్యా. లద్దాఖ్‌లోని బాలికల పాఠశాలలో ఫిజికల్‌ ట్రైనర్‌గా చేరా. బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, ఐస్‌స్టాక్‌ వంటి వాటిల్లో శిక్షణిస్తున్నా. ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ. అందుకే క్రీడారంగంలోని అవకాశాల్ని చూపించా. దీంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు’ అంటోంది 29 ఏళ్ల షెహనాజ్‌.

అమ్మాయిల కోసం ‘గోల్స్‌ ఫర్‌ గర్ల్స్‌’ అనే ఫుట్‌బాల్‌ క్లబ్‌, లద్దాఖ్‌ టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌, ఐస్‌స్టాక్‌, పెంకక్‌ సిలత్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌.. వంటి అసోసియేషన్‌లను ప్రారంభించింది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకూ శిక్షణిస్తోంది. చెన్నై, కర్ణాటక, శ్రీనగర్‌ల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో తన విద్యార్థులు పతకాలూ సాధిస్తున్నారు. తన ఆశయాలను మెచ్చి తోడుగా నిలుస్తున్న మహమ్మద్‌ ఆరిఫ్‌ను పెళ్లాడిన ఈమె ‘మార్పు మన చేతిలోనే ఉంటుంది. అదెలాంటిదన్నది నిర్ణయించుకోవాల్సింది మాత్రం ఎవరికి వారే’నంటుంది. భవిష్యత్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌లో విజేతలుగా తన శిష్యుల్ని నిలపడం తన లక్ష్యమంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని