నాన్న కోసం.. సాధించారు
కార్డియాలజిస్ట్ అయ్యి సేవ చేయాలన్నది నూని వెంకట సాయి వైష్ణవి కల. దీనికోసం చదువే లోకంగా సాగింది. ఫలితం నీట్‌లో జాతీయస్థాయిలో 15వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల విభాగంలో మొదటి ర్యాంకు. ఆమె దీన్నెలా సాధించిందంటే...చిన్నతనం నుంచీ చదువు కోసం ఎంతైనా కష్టపడేది వైష్ణవి. వీళ్లది కాకినాడ జిల్లా, కైకవోలు. నాన్న శ్రీనివాస చౌదరి రైతు...
ఈ ఇద్దరు అమ్మాయిల నేపథ్యం వేరైనా.. లక్ష్యం మాత్రం ఒక్కటే.. డాక్టర్ అవ్వాలని. వీరికా లక్ష్యాన్ని నిర్దేశించి, స్ఫూర్తి నింపింది నాన్నలే. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా జాతీయస్థాయి నీట్(అండర్ గ్రాడ్యుయేషన్) పరీక్షలో ప్రతిభ చాటుతూ టాపర్లుగా నిలిచారు.
రైతుబిడ్డ.. ‘నీట్’గా మెరిసి
కార్డియాలజిస్ట్ అయ్యి సేవ చేయాలన్నది నూని వెంకట సాయి వైష్ణవి కల. దీనికోసం చదువే లోకంగా సాగింది. ఫలితం నీట్‌లో జాతీయస్థాయిలో 15వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల విభాగంలో మొదటి ర్యాంకు. ఆమె దీన్నెలా సాధించిందంటే...
చిన్నతనం నుంచీ చదువు కోసం ఎంతైనా కష్టపడేది వైష్ణవి. వీళ్లది కాకినాడ జిల్లా, కైకవోలు. నాన్న శ్రీనివాస చౌదరి రైతు. అమ్మ కృష్ణవేణి. ‘మీ తాతగారు గుండెపోటుతో చనిపోయారు. సమయానికి మేలైన వైద్యం అందలేదు. నువ్వు డాక్టరై అలాంటివాళ్లని కాపాడాలి’ అంటూ చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటే వైష్ణవికి వేదవాక్కయ్యింది. స్నేహితులంతా ఇంజినీరింగ్ బాటపట్టినా తను వైద్యవృత్తినే కలగా మార్చుకుంది. దీనికితోడు అమ్మావాళ్ల నాన్న చింతపల్లి కామేశ్వరరావు పేరున్న వైద్యుడు. కొవిడ్ సమయంలో ఎంతోమంది డాక్టర్లు నిరాకరించినా.. ఆయన మాత్రం చికిత్సలు కొనసాగించారు. తాతయ్య స్ఫూర్తిగా తానూ అందరికీ వైద్యసాయం అందించాలనుకొనేది.
కళల్లోనూ మేటి.. వైష్ణవి ఐదో ఏట నుంచే కర్ణాటక సంగీతం, వీణ నేర్చుకొంది. ఆరో తరగతిలోనే వీణలో సీసీఆర్‌టీ నుంచి జాతీయ స్కాలర్‌షిప్‌ను సాధించింది. కచేరీలూ ఇచ్చేది. లాక్‌డౌన్ కారణంగా క్లాసులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా సాగేవి. పాఠ్యాంశాలపై దృష్టిపెడుతూనే ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ పేపర్లను సాధన చేసేది. నీట్‌కోసం ఎలాంటి ప్రత్యేక శిక్షణా తీసుకోలేదు. లెక్చరర్ల సాయంతోనే సన్నద్ధమై 720కిగానూ 706 మార్కులు సాధించింది.
‘ఏడో తరగతి వరకూ కాకినాడ ఆశ్రమ్ స్కూల్లో, ఆ తర్వాత ఆదిత్య స్కూల్, కాలేజీలో చదువుకున్నా. ఎనిమిదో తరగతిలో ఉండగానే నీట్ లక్ష్యంగా పెట్టుకొన్నా. రామ్‌సురేశ్ మాస్టారు మార్గనిర్దేశం చేశారు. అమ్మ ప్రాక్టీస్ పేపర్లు డౌన్‌లోడ్ చేసిచ్చేది. ఏ సందేహమొచ్చినా లెక్చరర్ల సాయం కోరేదాన్ని. రాత్రి 10 తర్వాత కాసేపు చదువుకుంటానన్నా నాన్న వద్దనేవారు. మెదడుకు విశ్రాంతి అవసరమనేవారు. ఆయనతో కలిసి రోజూ యోగా చేస్తా. ఒత్తిడనిపిస్తే అమ్మానాన్నలతో కలిసి నడకకు వెళ్లేదాన్ని. మంచి ర్యాంకు వస్తుందనుకున్నా.. టాప్ ర్యాంకు ఊహించలేదు. నీట్ పరీక్ష తర్వాత తిరిగి సంగీత సాధనపై దృష్టిపెట్టా. ఎయిమ్స్-దిల్లీలో చేరుతా. కార్డియాలజిస్టుగా పేదవారికి సాయం చేయాలన్నది నా లక్ష్యం. వీణలోనూ రాణిస్తా’నంటోంది వైష్ణవి.
- కొరిపెల్ల శ్రీనివాసు, కాకినాడ
ఇంట్లో మూడో డాక్టర్..
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం రూపానాయక్ తండాకు చెందిన వి.తేజశ్విని నీట్ పరీక్షలో ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.
తండ్రి వి.లింగానాయక్, తల్లి పద్మాబాయి ఉపాధ్యాయులు. ముగ్గురు కుమార్తెల్లో తేజశ్విని చిన్న. గ్రామంలో తన చిన్నప్పుడు సరైన వైద్య సదుపాయాలు లేవు. డాక్టర్ల దగ్గరకు వెళ్లాలంటే 20కి.మీ. ప్రయాణించాలి. అత్యవసరమై గ్రామానికి వైద్యుల్ని పిలిస్తే.. రాకపోగా, చులకనగా మాట్లాడేవారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నాయక్ డాక్టర్ అవ్వాలనుకున్నా.. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అందుకే ఎలాగైనా తమ ముగ్గురు కుమార్తెల్ని వైద్యులను చేసి తమ ప్రాంతం వారికి వైద్యసేవలు అందించాలనుకున్నారు. తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇప్పటికే పెద్దమ్మాయిలు లఖిత, చందన కడప రిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఏడో తరగతి వరకూ అనంతపురంలో చదివిన తేజశ్విని.. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు విజయవాడ శ్రీచైతన్యలో చదువుకుంది. రోజుకు 10 గంటలపాటు చదివేది. నీట్‌కి ముందు రోజుకో మాదిరి పరీక్ష సాధన చేసేది. 720 మార్కులకు 675 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో 1112, ఎస్టీ కేటగిరీలో మూడో ర్యాంకుతో సత్తా చాటింది. ‘నాన్న ఆశయం నెరవేరాలనే లక్ష్యంతో చదివా. మంచి ర్యాంకు రావటం ఆనందంగా ఉంది. ఎయిమ్స్-దిల్లీలో చేరాలనుకుంటున్నా. కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేసి మా ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తా’ అని చెబుతోంది తేజశ్విని.
- మురాల అనిల్‌కుమార్, కానూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.