బిడ్డల కోసం... తల్లుల సైన్యం

ఆహారం, నీటివల్ల ఇబ్బందులైతే ప్రాంతం మారడమో, తగిన జాగ్రత్తలు తీసుకోవడమో చేయొచ్చు. పీల్చే గాలితోనే ప్రమాదమైతే? ఇదే ఆలోచించారా అమ్మలు. ఓ సైన్యంగా ఏర్పడి భవిష్యత్‌ తరాలు శుభ్రమైన గాలిని పీల్చుకునే హక్కుల కోసం పోరాడుతున్నారు.‘దేశంలో 98 శాతం పిల్లలు కలుషిత గాలినే పీలుస్తున్నారు. ఇది వారిలో ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, అర్జీలు వంటి ఎన్నో ఇబ్బందులకు...

Updated : 13 Sep 2022 09:54 IST

ఆహారం, నీటివల్ల ఇబ్బందులైతే ప్రాంతం మారడమో, తగిన జాగ్రత్తలు తీసుకోవడమో చేయొచ్చు. పీల్చే గాలితోనే ప్రమాదమైతే? ఇదే ఆలోచించారా అమ్మలు. ఓ సైన్యంగా ఏర్పడి భవిష్యత్‌ తరాలు శుభ్రమైన గాలిని పీల్చుకునే హక్కుల కోసం పోరాడుతున్నారు.

‘దేశంలో 98 శాతం పిల్లలు కలుషిత గాలినే పీలుస్తున్నారు. ఇది వారిలో ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, అర్జీలు వంటి ఎన్నో ఇబ్బందులకు కారణమవుతున్నాయి’, ‘రాజధానిలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఊపిరితిత్తుల సమస్య ఉంది’.. ఇలా ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లాంటి ఎన్నో సంస్థల నివేదికల్లో చూశాక భవ్రీన్‌ ఖందారికి భయం పుట్టుకొచ్చింది. ఈమెది దిల్లీ. పర్యావరణ కార్యకర్త. పర్యావరణ పరిరక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఉంటుంది. ఇలాంటి నివేదికలు చూశాక ప్రస్తుత విధానాలు సరిపోవనిపించింది. 2020లో ‘మన పిల్లల కోసం గాలిని శుభ్రపరచండి’ అన్న నినాదంతో అయిదుగురు స్నేహితులతో కలసి ‘వారియర్‌ మామ్స్‌’ ప్రారంభించింది. ‘అనారోగ్యకర ఆహారం, నీటి నుంచి తప్పించుకోవచ్చు. పీల్చే గాలే సురక్షితమవకపోతే ఎలా? కంటికి కనిపించదని దాన్నలా వదిలేయలేం కదా! వాయుకాలుష్యం కారణంగా జబ్బు పడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలోనే ఎక్కువ.  అందుకే దీన్ని అరికట్టాలనుకున్నాం’ అంటారీ సభ్యులు.

ఈ వారియర్‌ మామ్స్‌ ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకెళతారు. ఎన్నికల సమయంలోనూ వీటిపై తీర్మానాలు చేసేలా చూసుకుంటున్నారు. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చూసుకోవడం, సైకిల్‌, బస్సులనే ప్రయాణాలకు ఉపయోగించమని అవగాహన కల్పించడం వంటివి చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ కట్టెలపొయ్యిని వాడుతున్నవారే ఎక్కువ. ఈ బూడిదతోనే కాదు.. చెట్లను కొట్టడం ద్వారానూ స్వచ్ఛమైన గాలికి దూరమవుతున్నారని గ్రహించి దాన్ని అడ్డుకోవడానికి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

‘మాకు పెళ్లైన పదేళ్ల తర్వాత కవలలు పుట్టారు. ఊరికే జబ్బు పడేవారు. వాయు కాలుష్యమే కారణమన్నారు వైద్యులు. సెలవులకు విదేశాలకు తీసుకెళితే బానే ఉండే వారు. తిరిగొచ్చాక అనారోగ్యం పాలయ్యేవారు. ట్రాఫిక్‌ పెరుగుతోందంటూ రోడ్లను వెడల్పు చేసుకుంటూ పోవడం, దానికోసం చెట్లను నరకడం, చెత్త పోగుపడుతోందని కాల్చేయడం.. ఇవన్నీ గాలిని కలుషితం చేసేవే. వీటన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. సరైన దారిలో ప్రయాణిస్తే దీన్ని అదుపు చేయడం సులువే. కొవిడ్‌లో తగ్గిన కాలుష్యమే దీనికి ఉదాహరణ’ అంటారు భవ్రీన్‌. వారియర్‌ మామ్స్‌ ప్రస్తుతం దిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌ సహా 9 రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. వెయ్యికిపైగా సభ్యులున్నారు. గత ఏడాది స్కాట్లాండ్‌లో నిర్వహించిన సీఓపీ26 సమావేశంలోనూ పాల్గొంది. అందరూ కలసి ప్రయత్నిస్తే భవిష్యత్తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడం సాధ్యమే అంటారీవిడ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని