అమ్మ వదిలేసిన ఆ పాప.. ఇప్పుడు ఫైనాన్షియల్‌ ఇంజినీర్‌!

కళ్లులేని ఆ పసిపాపకి... కంటిపాప తానై వెలుగులు నింపిందా తల్లి. లెక్కలు, సైన్స్‌... సంగీతం, నృత్యం, సెల్ఫ్‌ డిఫెన్సుల్లో రాణించేలా చేసింది. ఆ అమ్మాయికూడా కార్పొరేట్‌ సంస్థలకు పెట్టుబడులు అందించే ఫైనాన్షియల్‌ ఇంజినీర్‌గా ఎదిగింది. కన్నతల్లిగా ఆమె బాధ్యత నెరవేర్చింది అంటారా? కానీ షాలినీని దత్తత తీసుకుని మరీ ఇలా తీర్చిదిద్దారా మాతృమూర్తి నిర్మల...

Updated : 15 Sep 2022 07:52 IST

కళ్లులేని ఆ పసిపాపకి... కంటిపాప తానై వెలుగులు నింపిందా తల్లి. లెక్కలు, సైన్స్‌... సంగీతం, నృత్యం, సెల్ఫ్‌ డిఫెన్సుల్లో రాణించేలా చేసింది. ఆ అమ్మాయికూడా కార్పొరేట్‌ సంస్థలకు పెట్టుబడులు అందించే ఫైనాన్షియల్‌ ఇంజినీర్‌గా ఎదిగింది. కన్నతల్లిగా ఆమె బాధ్యత నెరవేర్చింది అంటారా? కానీ షాలినీని దత్తత తీసుకుని మరీ ఇలా తీర్చిదిద్దారా మాతృమూర్తి నిర్మల...

నకి ముగ్గురు పిల్లలున్నా.. ఆ పసిపాపని చూసినప్పుడు ఆమెలోని అమ్మ మనసు ఉండబట్టలేకపోయింది. పుట్టుకతో అంధురాలైన ఆ మూడునెలల పసిగుడ్డుని.. కన్నతల్లే కాదనుకుంది. కానీ నిర్మల మాత్రం ఆ పాపని అనాధాశ్రమంలో అలా నిర్దాక్షిణ్యంగా వదల్లేకపోయారు. ఆమెని దత్తత తీసుకుని తన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూపించాలనుకున్నారు. కళ్లు లేని, ఓ అనాధ ఆడపిల్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలియని విషయం కాదు. కానీ షాలినికి ఆ కష్టాలేవీ తెలియకుండా, ఆత్మవిశ్వాసాన్ని తోడుగా ఇచ్చి పెంచారామె. తనకోసం బ్రెయిలీ నేర్చుకున్నారు. అంధ చిన్నారులని పెంచడంలో మెలకువలు అభ్యసించారు. అమెరికా హాడ్లే స్కూల్‌ అందించే ప్రత్యేక కోర్సుల్లో చేరారు. తాను నేర్చుకుంటూ ఆ పాపకీ సాంకేతికతను పరిచయం చేశారు. తనకిష్టమైన అడ్వాన్స్డ్‌మ్యాథ్స్‌, సైన్స్‌ల్లో ఎదగడానికి షాలినితో సమానంగా నిర్మల కూడా కష్టపడ్డారు. లెక్కలు, సైన్సు సులభంగా, తాకితే అర్థమయ్యేలా ఆమెకోసం ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలు తయారు చేశారామె. దాని సాయంతో కఠినమైన లెక్కలని కూడా చకచకా చేసేది షాలిని.

అన్నీ నేర్పి...అమెరికాకు పంపి..
షాలినికి చదువొక్కటే లోకం కాదు. పాటలు, సంగీతం కూడా నేర్పించారు నిర్మల. ‘అమ్మ ఇచ్చిన ఆత్మవిశ్వాసం మాటల్లో చెప్పలేనిది. ఆమెచ్చిన ధైర్యంతోనే ట్రెక్కింగ్‌ చేసేదాన్ని. అండమాన్‌, నికోబార్‌లో స్కూబా డైవింగ్‌ చేశా. నాకు ఆరేళ్లున్నప్పుడే సంగీత పాఠశాలలో చేర్పించిందమ్మ. అక్కడే పియానో, సాల్సా నేర్చుకున్నా. 2012లో ఇంటర్నేషనల్‌ సాల్సా కాంగ్రెస్‌ పోటీల్లోనూ పాల్గొన్నా. ఒంటరిగా ఉండాల్సి వస్తే.. ధైర్యంకోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ పాఠాలు కూడా నేర్పించింది. అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశం వచ్చింది. బెంగళూరులోని మాల్యా అదితి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో శాట్‌ పరీక్షలు రాస్తే నూటికి నూరుశాతం మార్కులు వచ్చాయి. దాంతో అమెరికాలోని అమ్‌హెర్స్‌ట్‌ కాలేజీలో చదవడానికి ఉపకారవేతనం అందింది. 2013లో అమెరికాలో ఒంటరిగా అడుగుపెట్టినప్పుడు నాకు తోడుగా ఉన్నవి అమ్మ చెప్పిన పాఠాలు. తను నా నరనరాల్లో నింపిన ఆత్మవిశ్వాసమే’ అంటోంది షాలిని.

ఒంటరిగా చదువుకున్నా...
అమెరికాలో మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన షాలిని.. కొలరాడోలోని హ్యూమన్‌ కంప్యూటింగ్‌ ల్యాబ్‌లో మేనేజర్‌గా చేరింది. అక్కడ పీహెచ్‌డీ విద్యార్థులు, పరిశోధకులతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఫైనాన్షియల్‌ ఇంజినీర్‌ కావాలన్న తన లక్ష్యాన్ని వేగంగానే చేరుకుంది. 2018లో.. స్టీవెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరి ఫైనాన్షియల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేసి.. ప్రస్తుతం న్యూయార్క్‌లో బీఎమ్‌ఓ ఫైనాన్షియల్‌ గ్రూపులో విధులు నిర్వహిస్తోంది. ‘పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు పెట్టుబడులకోసం మా దగ్గరకు వస్తుంటాయి. వాటికి పెట్టుబడులు ఇవ్వాలా లేదా అని నిర్ణయించడం మా పని. మా నివేదికలు పరిశీలించిన తర్వాతే.. సంస్థలకు పెట్టుబడులు అందుతాయి. ఇది నూరుశాతం సవాళ్లతో కూడుకున్న వృత్తి. మీకిది కష్టంగా అనిపించట్లేదా? అంటారు చాలామంది. వివక్ష ఎక్కడైనా ఉంటుంది. కానీ దాన్ని జయించడంలోనే మన ప్రతిభ ఉంది. స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఫైనాన్షియల్‌ ఇంజినీరింగ్‌లో చేరిన తొలి అంధ విద్యార్థిని నేనే. ఎంతమంది నిరుత్సాహపరిచినా పట్టుదలగా కోర్సు పూర్తిచేశా. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటా. ఇదంతా అమ్మవల్లే సాధ్యమైంది’ అనే షాలిని అంధులకు సాంకేతికతని ఎలా ఉపయోగించుకోవచ్చో వీడియోలు చేసి అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని