వృథాకు కళ తోడై..

పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ను ఉపయోగకరంగా మార్చాలనుకుంది సాక్షి జా. ఆ వ్యర్థాలతో ఉపయోగకర వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ పథకాల పేరున

Published : 18 Sep 2022 00:39 IST

పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ను ఉపయోగకరంగా మార్చాలనుకుంది సాక్షి జా. ఆ వ్యర్థాలతో ఉపయోగకర వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ పథకాల పేరున ప్రదర్శన ఉత్పత్తుల తయారు చేసే స్థాయికి ఎదిగింది.  ఆమె ప్రయాణమిది!

మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసి, వెడ్డింగ్‌ ప్లానర్‌గా మారింది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాక్షి. పెళ్లి వేడుక తర్వాత అక్కడంతా పడేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు. ఇవన్నీ పర్యావరణానికి ఎంత చేటు చేస్తాయో కదా అనుకునేది. తాను చదివిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ప్రాంగణంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు సర్ఫ్‌రాజ్‌ అలీతో పరిచయమైంది. ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావడంతో, వివాహాది శుభకార్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలను కలిసి నిర్వహించేవారు. అదే సమయంలో వృథాగా కనిపించే ప్లాస్టిక్‌ వస్తువులపై చర్చించు కునేవారు. ఓసారి చెత్త ఏరేవాళ్లను కలిసి సేకరించిన ప్లాస్టిక్‌ను ఏంచేస్తారని అడిగారు. వాళ్లు ఆ వృథాను తగులబెడతామన్నారు. అదీ పర్యావరణానికి హాని కలిగించేదే! ప్లాస్టిక్‌ను కాల్చేస్తే హానికర రసాయనాలు వెలువడతాయి. ఇవి వాతావరణంలో మార్పులకే కాదు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకూ కారణమవుతాయి. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు.

ప్రాజెక్టులను..
బాల్యం నుంచీ సాక్షికి చిత్రకళపై ఆసక్తి. మధుబనీ పెయింటింగ్స్‌ నేర్చుకుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వృథాకు ఈ కళను జోడించి ఏదైనా చేయాలనుకున్నాం అంటుందీమె. ‘సర్ఫ్‌రాజ్‌కు ఆక్రిలిక్‌ ఆర్ట్‌ తెలుసు. 2018లో మా ఇద్దరి పేరుతో ‘సర్ఫ్‌రాజ్‌సాక్షి ఇన్నోవేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ ప్రారంభించాం. ప్లాస్టిక్‌ వృథాను కరిగించి దానికి మట్టి, ఇసుక, చెక్క కలిపి శిల్పాలు చేసి.. వాటిని ఆక్రిలిక్‌ పెయింట్‌తో తీర్చిదిద్దేవాళ్లం. మా గురించి తెలిసి, ప్రభుత్వ ప్రాజెక్టులకు పనిచేసే అవకాశాన్నిచ్చారు. అలా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లోగో తయారుచేశాం. 200 కేజీల పాలిథిన్‌ వృథాతో చేసిన 380 కేజీల లోగోను ఘజియాబాద్‌లోని నగర్‌ నిగమ్‌లో ప్రదర్శనకు ఉంచాం. నోయిడాలో ప్రపంచంలోనే అతి పెద్ద చరఖాను తయారు చేసిచ్చాం. దీనికోసం ఘజియాబాద్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్లాస్టిక్‌ వృథాను సేకరించాం. మరెన్నో ప్రభుత్వ ప్రాజెక్ట్‌లూ..చేపట్టాం. ప్రజల్లో ప్లాస్టిక్‌ వృథా వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టంపై అవగాహన కలిగించాలన్న లక్ష్యంతో ప్రదర్శనలతోపాటు ఎన్నో కార్యక్రమాల్నీ చేపట్టాం. యూపీలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పిల్లల కోసం వృథాతో బెంచీలు, బల్లలు తయారుచేశాం. తొట్టెలు, గోడ గడియారాలు, గుర్రం, ఎలుగుబంటి బొమ్మలూ.. డిజైన్‌ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ ఉత్పత్తులకు దాదాపు 150 టన్నుల వృథా ప్లాస్టిక్‌ను వినియోగించాం’ అని చెబుతోంది సాక్షి.

ప్రశంస..
ఘజియాబాద్‌లో డంప్‌యార్డ్‌ల నుంచి ఈ ప్లాస్టిక్‌ వృథా సేకరించి వర్ణం, నాణ్యతబట్టి విడదీస్తారు. ఆ తర్వాత 60-70 డిగ్రీల సెల్సియస్‌లో కరిగించి కంప్రెస్‌ చేసి షీట్‌గా మారుస్తారు. దీన్ని ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. ‘ప్లాస్టిక్‌తోనే కాకుండా ఎకోఫ్రెండ్లీ పద్ధతిలో కొన్నిరకాల ఫర్నిచర్‌ను పిల్లల కోసం రూపొందిస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉండటంతో మరిన్ని ప్రాజెక్ట్‌ల ద్వారా ఈ వృథా పట్ల అవగాహన కలిగించడానికి కృషి చేస్తాం.  ‘యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యుఎన్‌డీపీ)తో కలిసి ఒక ప్రాజెక్ట్‌ చేయడానికి అవకాశాన్ని అందుకున్నాం. ప్రతి ఒక్కరూ డాక్టర్‌, ఇంజినీర్‌, కలెక్టరు అవ్వాలని కోరుకుంటే, పర్యావరణాన్ని కాపాడేదెవరు, నేటి తరం పిల్లలైనా పర్యావరణవేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్నాం’ అని చెబుతోందీ మిత్రద్వయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని