Published : 20/09/2022 00:33 IST

దేవతామూర్తులకు కొత్త రూపు!

నిత్యపూజలందుకునే దేవతల ఫొటోలు, బొమ్మలు కొన్నాళ్లకు పాతబడతాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. కొందరు పడేస్తారు. కానీ చాలా మంది పారెయ్యలేరు. ఇటువంటి వాటిని రీసైకిల్‌ చేసి పేద చిన్నారులకు బొమ్మలు, పక్షులకు ఆవాసాలు, కళాకృతులుగా మారుస్తోంది తృప్తి. దానికోసం ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించి ఎంతోమంది మహిళలకు ఉపాధినీ కల్పిస్తోంది.

2019లో మహారాష్ట్రలోని నాసిక్‌లో వరద బీభత్సం సృష్టించాయి. ఆ తర్వాత నదీతీరంలో పరిస్థితిని చూడటానికి వెళ్లిన తృప్తిని ఓ సంఘటన ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి కొన్ని దేవతామూర్తులను నదిలో కలపబోతున్నాడు. అది చూసి తృప్తి వాటిని అడిగి తీసుకొంది. వృత్తిరీత్యా న్యాయవాదైన ఈమె, ఇలా పాత దేవతామూర్తులతో పర్యావరణ హితంగా ఏదైనా చేయాలనుకుంది. అలా ప్రారంభించిదే ‘సంపూర్ణం సేవా ఫౌండేషన్‌’. తన ఆలోచనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఎవరి దగ్గరైనా దేవతల పాత బొమ్మలు, ఫొటోలుంటే తనకిమ్మని కోరింది. వాటిని రీసైకిల్‌ చేసి ఉపయోగపడేలా చేస్తానంటూ తన ఆలోచనను చెప్పడంతో వందల బొమ్మలు వెతుక్కొంటూ రావడం మొదలు పెట్టాయి.

పలు రకాలుగా..

తన వద్దకు చేరుకొన్న ఫొటోల ఫ్రేములను మెటల్‌, గాజు, చెక్క తదితర రకాలుగా విభజిస్తుంది. ఆ ఫ్రేములతో పక్షుల గూళ్లను తయారు చేయడం ప్రారంభించా అని వివరిస్తుంది తృప్తి. ‘లోహంతో చేసినవైతే కరిగించి అలంకరణ వస్తువులుగా మారుస్తున్నాం. వినాయక విగ్రహాల నిమజ్జనం, ఇతరత్రా సమయాల్లో చిన్న చిన్న విగ్రహాలను తీసుకొంటాం. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మట్టి వంటివి విడదీసి పొడిగా చేస్తాం. దీనికి సిమెంట్‌ కలిపి పిల్లలకు బొమ్మలు తయారు చేస్తున్నాం. వీటిని అనాథాశ్రమాలు, మురికి వాడలకు వెళ్లి అక్కడి చిన్నారులకు అందిస్తున్నాం. ఇంకా వీటితో గృహాలంకరణకు ఉపయోగించే హస్తకళాకృతుల తయారీలో పెద్ద సంఖ్యలో మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. వారితోనే బొమ్మలు తయారు చేయించి ఉపాధినీ కల్పిస్తున్నా. అలా ఇప్పటివరకూ 50 వేల ఫ్రేములు, విగ్రహాలను రీసైకిల్‌ చేశాం. 5 వేల మందికిపైగా పిల్లలకు బొమ్మలను అందించాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దేవతా మూర్తులను పూజించిన తర్వాతే రీసైకిల్‌ చేయడం ప్రారంభిస్తా’ అంటోన్న తృప్తి ఈ సేవ కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్‌నే ప్రారంభించింది. భవిష్యత్తులో మరిన్ని రకాల ఆట, గృహాలంకరణ సామాగ్రిని తయారు చేస్తాం అంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి