కష్టాలపై.. కత్తిదూసి..!

‘అయ్యో ఈ సారీ ఆడపిల్లేనా’ అనుకోలేదా అమ్మానాన్నలు! ఆ పిల్లలు కోరిన బంగారు భవిష్యత్తునే కానుకగా ఇవ్వాలనుకున్నారు.. ఒకరు పాడిరైతు.. మరొకరు బస్‌ డ్రైవర్‌.. ఇద్దరూ సగటు జీవులే.

Updated : 21 Sep 2022 07:36 IST

‘అయ్యో ఈ సారీ ఆడపిల్లేనా’ అనుకోలేదా అమ్మానాన్నలు! ఆ పిల్లలు కోరిన బంగారు భవిష్యత్తునే కానుకగా ఇవ్వాలనుకున్నారు.. ఒకరు పాడిరైతు.. మరొకరు బస్‌ డ్రైవర్‌.. ఇద్దరూ సగటు జీవులే. అయినా ఆడపిల్లల్ని కత్తిసాము (ఫెన్సింగ్‌)లో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే తెలుగమ్మాయిలు బేబిరెడ్డి, నజియాలు ఫెన్సింగ్‌ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచేలా చేసింది...

అవన్నీ పట్టించుకోవద్దు అన్నాడు..

ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉంటేనే ఎన్నో జాగ్రత్తలు చెబుతారు ఇరుగుపొరుగు. అలాంటిది ఆ ఇంట్లో ఇద్దరాడపిల్లలు. అందులోనూ ఒకమ్మాయి ఆటలంటూ దేశమంతా తిరుగుతుంటే ఇక బంధువుల హెచ్చరికల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అవన్నీ వింటూ ఆడపిల్లలని ఇంటికే పరిమితం చేయలేదా తల్లిదండ్రులు. నచ్చిన రంగంలో ఎదిగేందుకు ప్రోత్సాహం అందించారు. అదే తెలుగమ్మాయి బేబీరెడ్డిని లండన్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో విజేతని చేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె.. మురికినాటి బేబీరెడ్డి స్వస్థలం. ‘మా నాన్న రామకృష్ణారెడ్డి.. అమ్మ లక్ష్మీదేవి. నాన్న గేదెలు మేపుతూ.. పాలను సేకరించి కేంద్రానికి పోసేవారు. ఆ ఆదాయంతోనే అక్కనూ, నన్నూ చదివిస్తూ.. నన్ను నాకిష్టమైన ఆటల్లో ప్రోత్సహించారు. కావాల్సిన వాళ్లే హేళనగా మాట్లాడినా.. ‘అవేమీ పట్టించుకోవద్దు’ అంటూ ధైర్యం చెప్పి నా వెన్నుతట్టారు. నాలుగో తరగతి వరకు మా ఊళ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నా. ఆటల్లోనూ చురుగ్గా ఉండటంతో మా పీఈటీ రామచంద్ర కూడా నన్ను ప్రోత్సహించారు. అలా హైదరాబాద్‌లోని హకీంపేట క్రీడా పాఠశాలకు ఎంపికయ్యా. కత్తితిప్పడంలో నా నైపుణ్యాలని గుర్తించి నేనో ఫెన్సర్‌గా మారడానికి కారణం ఆ పాఠశాలే. ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకున్నా. చిన్నతనంలో ఓసారి తలకి హెల్మెట్‌ పెట్టకుండా మరో అమ్మాయితో కలిసి కత్తితో సాధన చేస్తున్నా. కంటికి గాయమై ఎర్రగా అయిపోయింది. ఫెన్సింగ్‌ అంటే రోజూ అలాంటి సవాళ్లే ఉంటాయి. అయినా ఆట మీదున్న ప్రేమ నన్ను వెనక్కి తగ్గనీయలేదు. స్పెయిన్‌లో నిర్వహించిన ప్రపంచకప్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా అప్పుడు కొవిడ్‌ ఎక్కువగా ఉంది. విదేశాలకు రాకపోకలు నిలిపివేయడంతో వెళ్లలేకపోయా. ఎంతో నిరాశపడ్డాను. కానీ ఈ ఏడాది ఆగస్టులో లండన్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ జూనియర్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ క్రీడల్లో కాంస్యం సాధించడంతో కాస్త ఊరట దొరికింది’ అంటోన్న బేబీరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ గవర్నమెంట్‌ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కామన్‌వెల్త్‌ పతకంతోపాటు.. ఈ ఏడాది దిల్లీలో ‘ఖేలో ఇండియా’ మహిళల జూనియర్‌, సీనియర్‌ ఫెన్సింగ్‌ క్రీడల్లోనూ ప్రథమ స్థానం సాధించింది.

- బోగెం శ్రీనివాసులు, కడప డెస్కు


అక్కను చూసే నేర్చుకున్నా

లండన్‌లోని కామన్‌వెల్త్‌ క్రీడా పోటీల వేదిక అది. విజేతగా త్రివర్ణ పతాకాన్ని ముద్దాడుతున్న తెలుగమ్మాయి షేక్‌నజియా జీవితంలో అత్యంత ఉద్విగ్నభరిత క్షణాలవి. ఆ క్షణాల కోసం ఆమె కుటుంబం పడిన తపన చిన్నదేమీ కాదు. నజియాకి స్ఫూర్తి తన అక్కయ్య ఫౌజియానే. నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారి గడ్డ ఆమె సొంతూరు. తండ్రి షేక్‌ హుస్సేన్‌ ఆర్టీసీ  డ్రైవర్‌. ‘మూడో తరగతి వరకు చండూరులో చదువుకున్నా. అప్పటికే అక్క ఫెన్సింగ్‌ క్రీడపై ఇష్టంతో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో చదువుతోంది. తను ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరం ఈ ఆటే ఆడేవాళ్లం. అలా చిన్నప్పటి నుంచి నాకూ దీని మీద ఇష్టం ఏర్పడింది. నేనూ హకీంపేట స్పోర్ట్స్‌ స్కూలుకు దరఖాస్తు చేసుకుంటే సీటొచ్చింది. పదోతరగతి వరకు అక్కడే చదివా. హైదరాబాద్‌  మహబూబియా కళాశాలలో  ఇంటర్‌ చదివా. ఇది ఖరీదైన క్రీడ కావడంతో మొదట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డా. నాన్న మాత్రం ఈ ఆటపై మా ఇష్టం చూసి ఎక్కడా వెనక్కి తగ్గకుండా అప్పులు చేసి మరీ మమ్మల్ని పోటీలకు పంపారు. నాన్న నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రతి టోర్నీలోనూ పతకం గెలిచేవాళ్లం. మా ప్రాంతంలో చాలా మందికి ఈ ఆట గురించి తెలియదు. అందుకే వేరే ఆటని ఎంచుకుంటే స్పాన్సర్లు వస్తారుగా! అనేవారు. అక్క డిగ్రీ పూర్తిచేసి.. ఉద్యోగవేటలో పడింది. నేను మాత్రం దీనిపైనే దృష్టి పెట్టా. రెండేళ్ల నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)లో శిక్షణ తీసుకుంటున్నా. గత నెలలో లండన్‌లో జరిగిన కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బృంద, వ్యక్తిగత విభాగాల్లో కాంస్యాలు సాధించిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనివి’ అనే నజియా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ రజతం గెల్చుకుంది. వచ్చే నెలలో కువైట్‌లో జరిగే ఆసియా యూత్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్ష్యంగా సాధన చేస్తోంది నజియా.

- జీడిపల్లి దత్తురెడ్డి, నల్గొండ


‘అంతర్జాతీయ పోటీల్లో రాణించాలంటే ఆ స్థాయి శిక్షణ కూడా అవసరం. అది దొరికితే ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించి మా ఊరికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యం’ అంటున్నారీ అమ్మాయిలు


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని