సన్నం కాదు.. ఆరోగ్యం ప్రధానం!

సన్నగా ఉండటమే అందం.. ఈ అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీంతో బలవంతంగా నోరుకట్టుకోవడం, లేనిపోని జబ్బులు తెచ్చుకోవడం చేస్తారు. రాధికా నిహలానీ అంతే! అయితే తను

Published : 21 Sep 2022 00:21 IST

సన్నగా ఉండటమే అందం.. ఈ అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీంతో బలవంతంగా నోరుకట్టుకోవడం, లేనిపోని జబ్బులు తెచ్చుకోవడం చేస్తారు. రాధికా నిహలానీ అంతే! అయితే తను త్వరగానే కళ్లు తెరిచింది. సన్నబడటం కాదు.. ఆరోగ్యంగా ఉండటం ప్రధానమని తెలుసుకొని తన జీవితాన్నే ఉదాహరణగా చూపిస్తూ ఎంతోమందిలో మార్పుతెస్తోంది. ఆమె కథేంటో చదివేయండి.

‘చిన్నప్పుడు అందరూ బొద్దుగా భలేగున్నావ్‌ అంటోంటే చాలా సరదాగా ఉండేది. కానీ యవ్వనంలోకి అడుగుపెట్టాక అందరూ వింతగా చూసేవారు. కాలేజీలోనూ, డ్యాన్స్‌ క్లాసుల్లోనూ నాతో మాట్లాడటానికీ ఎవరూ ఇష్టపడే వారు కాదు. ఇక జతగా డ్యాన్స్‌ చేయడానికెలా ముందుకొస్తారు? అయినా అప్పటివరకూ నాకు నేను లావున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఓసారిలాగే ఓ మాల్‌లో నా కజిన్‌తోపాటు సరదాగా బరువు చెక్‌ చేసుకున్నా. 55 పైగా ఉంటాననుకుంటే 80 కేజీలున్నా. అపుడే నేను బొద్దు కాదు లావని అర్థమైంది’ అని చెబుతుంది రాధిక.

పొట్టమాడ్చుకుంది
ఇది తనలో ఆత్మన్యూనతకు దారితీసింది. దీంతో సన్నబడాలని తిండి మానేసింది. పరగడుపున 20 కి.మీ. పరుగు తీసేది. రోజు మొత్తంలో ఒక్క పండుతో సరిపెట్టుకున్న సందర్భాలెన్నో! కొద్ది నెలల్లోనే 48 కేజీలకు చేరుకుంది. ‘ఆ అంకె చూసిన ఆనందం ఎంతోకాలంలేదు. ఎప్పుడూ లేని అనారోగ్యం, నెలసరి సమస్యలు.. అయినా సరే.. అదే పద్ధతి కొనసాగిస్తూ వచ్చా. ఎంత రుచికరమైన ఆహారమైనా అనుకున్నంతే తినేదాన్ని. కొద్దిరోజులకు ఏదో మార్పు.. ఒక్కోసారి తట్టుకోలేక విపరీతంగా తినేసేదాన్ని. మళ్లీ గిల్టీ ఫీలింగ్‌తో అస్సలు తినకుండా ఉండేదాన్ని. అప్పట్లో ఇంటర్నెట్‌పై పెద్ద అవగాహన లేదు. కానీ నా విపరీత ధోరణిని నా స్నేహితురాలు కనిపెట్టి కొన్ని పుస్తకాలను చేతిలో పెట్టింది. అప్పుడే నాకు అనోరెక్సియా అని అర్థమైంది’.

దృక్కోణం మారింది
వైద్యులను సంప్రదిస్తే ప్రారంభదశలోనే ఉందనడంతో ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టిపెట్టింది రాధిక. ఆరోగ్యకరమైన ఆహారం, నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామాలను ప్రారంభించింది. ఈమెది ముంబయి. మేనేజ్‌మెంట్‌ విద్యను పూర్తి చేసి, రెండు వ్యాపార సంస్థలనూ నిర్వహిస్తోంది. మొదటి ప్రెగ్నెన్సీలో లావు గురించి ఆలోచించకూడదనుకొని నచ్చినవన్నీ తినేసింది. దీంతో మళ్లీ బరువు పెరిగింది. 2018లో పాప పుట్టాక ఒత్తిడి, ఆందోళన.. దీనికితోడు నానాటికీ పెరుగుతున్న బరువు మళ్లీ అదే భయం. ఈసారి 100 రోజుల ఛాలెంజ్‌ పెట్టుకొని తగ్గింది. తన ఈ ప్రయాణాన్ని ఇన్‌స్టాలో పెట్టగా చాలామంది సలహాలడిగేవారు. ‘రెండోసారి గర్భం దాల్చినపుడు ఒత్తిడి దరిచేరనివ్వలేదు. లావు, సన్నం కాదు.. ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. వ్యాపారం, కుటుంబం రెండు బాధ్యతల్నీ సక్రమంగా నిర్వహించాలంటే ముందు నేను ఆరోగ్యంగా ఉండాలన్నది అర్థం చేసుకున్నా. అంత లావు ఎలా తగ్గావని చాలామంది అడుగుతుంటారు. వారికీ ఇదే చెబుతుంటా. రోజూ అరగంట వ్యాయామం, ఏరోజైనా కుదరకపోతే కనీసం నడవండి. తక్కువ సమయంలో ఫలితాలు వచ్చేయాలని శరీరాన్ని కష్టపెట్టకండి. ఆరోగ్యకరమైనవి తింటూనే నెమ్మదిగా ప్రయత్నించండి. ఇదో దీర్ఘకాల ప్రక్రియ. ఓపికతో ఉండండి’ అని సలహానిస్తోంది 39 ఏళ్ల రాధిక. తన అనుభవం మనకూ పాఠమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్