ఆ రొంపిలోకి దింపుతామని బెదిరించారు

ఆపదలో ఉన్న ఆడపిల్ల గొంతు వినిపిస్తే చాలు. ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తుంది పల్లవీ ఘోష్‌. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు. అయినా తన మార్గం నుంచి వెనుకడుగు వేయలేదు. అమ్మాయిల అక్రమ రవాణాకువ్యతిరేకంగా పనిచేస్తూ 10వేలమందిని

Updated : 22 Sep 2022 07:38 IST

ఆపదలో ఉన్న ఆడపిల్ల గొంతు వినిపిస్తే చాలు. ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తుంది పల్లవీ ఘోష్‌. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు. అయినా తన మార్గం నుంచి వెనుకడుగు వేయలేదు. అమ్మాయిల అక్రమ రవాణాకు
వ్యతిరేకంగా పనిచేస్తూ 10వేలమందిని కాపాడి, సొంతగూటికి చేర్చిన సామాజిక కార్యకర్త పల్లవీ ఘోష్‌ స్ఫూర్తి కథనమిది.. 

‘డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకతను తన కూతురిని వెతికివ్వమని నన్ను అడిగాడు. మాది అసోంలోని లమ్‌డింగ్‌. చదువు కోసం పశ్చిమ్‌బంగాలో ఉండేదాన్ని. తప్పిపోయిన తన కూతురి ఆచూకి కోసం పోలీస్‌స్టేషన్‌లో అతనిచ్చిన ఫిర్యాదుని తీసుకోలేదు. నావల్లా కాలేదు. కొన్ని రోజులు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగిన ఆ తండ్రి కూడా తర్వాత కనిపించలేదు. ఆ అమ్మాయి సమాచారం ఇప్పటికీ తెలియదు. ఆ తండ్రి గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెల్లో కలుక్కుమంటుంది. అప్పుడే ఇలా మాయమయ్యే అమ్మాయిలను తిరిగి వాళ్ల కుటుంబాల దగ్గరకు చేర్చాలనుకున్నా’ అంటూ పల్లవి ఈ పని మొదలుపెట్టడానికిగల నేపథ్యాన్ని వివరించింది. 

బాత్రూంలో... గాయాలతో నగ్నంగా..

ఎక్కడైనా అమ్మాయిలు మాయమవ్వడాన్ని సాధారణ విషయంగా తీసుకుంటారా? హరియాణాలాంటి ప్రాంతాల్లో మాత్రం ఆ పరిస్థితి ఉండేదని, అందుకే అలాంటి అమ్మాయిలకు అండగా ఉండాలనుకుంటున్నానని అంటోంది పల్లవి. ‘దిల్లీ యూనివర్శిటీలో బీఏ, చెన్నైలో మాస్టర్స్‌ పూర్తి చేశాక ‘శక్తివాహిని’ అనే ఎన్జీవోతో కలిసి పనిచేయాలనుకున్నా. కారణం హరియాణా గ్రామాల్లో అమ్మాయిల అపహరణ ఎక్కువ. పోలీసులు సహా ఎవరూ పట్టించుకోరు. నవజాత శిశువులు, నెలల లేదా యుక్తవయసు పిల్లలను అపహరించే సంఘటనలెన్నో చూశా. శక్తివాహిని కార్యకర్తలుగా నెంబర్లను అవగాహనా కార్యక్రమాల్లో అందరికీ ఇచ్చేవాళ్లం. అలా ఒకమ్మాయి నుంచి తాను ఆపదలో ఉన్నట్లు నాకు ఫోన్‌ వచ్చింది. మొదట ఫేక్‌ కాల్‌ అనుకున్నా. తర్వాత నిజమని అర్థమైంది. పోలీసు స్టేషన్‌లో సమాచారమందించి, ఎన్జీవో నుంచి ఒకరిని తీసుకొని పోలీసు సాయంతో ఆ అమ్మాయి చెప్పిన చిరునామాకు వెళ్లా. అక్కడ మమ్మల్ని అడ్డుకున్నారు. న్యాయవాది వచ్చిన తర్వాతే మేం లోపలికి వెళ్లగలిగాం. ఆ అమ్మాయిని చూశాను. నగ్నంగా ఉంది. ఒళ్లంతా గాయాలు. ముఖమంతా కత్తిగాట్లు. చిత్రహింసలకు గురిచేయడంతో శుష్కించిపోయి ఉంది. అక్కడి నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించాం. ఇటువంటి సంఘటనలెన్నో’ అంటుంది పల్లవి.

బెదిరింపులెన్నో..

పల్లవి ఇంటికెళ్లేటప్పుడు ఒక్కదారిలో ఎప్పుడూ వెళ్లలేదు. కారణం... తాను చేస్తున్న పని వల్ల ఎన్నో బెదిరింపులొచ్చేవి. ఈ పని మానకపోతే నిన్ను కూడా ఎత్తుకెళ్తాతామని బెదిరించేవారు. అయినా ఆమె తన మార్గాన్ని వీడలేదు. అక్రమ రవాణాకు గురైనవారిని రక్షించినంత మాత్రాన వారికి సాయం అందినట్లు కాదు, సరైన ఉపాధి కల్పించగలగాలి అనేది పల్లవి అభిప్రాయం. అందుకే 2020లో తనే స్వయంగా ‘ఇంపాక్ట్‌ అండ్‌ డైలాగ్‌ ఫౌండేషన్‌’ స్థాపించింది. ‘కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులే అమ్మాయిలను అమ్మేవారు. అటువంటప్పుడు వారిని తిరిగి అదే కుటుంబానికి చేరిస్తే రక్షణ ఏముంటుంది? అందుకే సాంఘిక సంక్షేమశాఖ విభాగాలు, పంచాయతీ పెద్దలను కలిసి అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరాన్ని చెప్పేదాన్ని. అసోంలోని మారుమూల ప్రాంతాలన్నీ పర్యటించా. విద్యార్థులు, టీ తోట కార్మికులు, గిరిజనులు, పోలీసు అధికారులు, రవాణాసంస్థల నిర్వాహకులూ.. ఇలా దాదాపు 75 వేలమందిని కలిసి అవగాహన కలిగించా. దీంతోపాటు నెలసరి పరిశుభ్రత, స్కూల్‌ డ్రాపవుట్స్‌, వరకట్నం, గృహహింస, బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపులు వంటివాటిపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా. నాకెదురైన సంఘటనలను కథలుగా చెప్పడంతో అందరూ ‘కహానీవాలీ దీదీ’ అని పిలుస్తారు. 10 వేలమంది పిల్లలను ఈ రొంపిలోంచి రక్షించగలిగా. జీవిక కోసం కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా’ అంటోంది పల్లవి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్