ఆవు పాలతో కోట్ల వ్యాపారం

రూపాలీకో పాప. పుట్టినప్పుడు బాగానే ఉన్నా అయిదేళ్లు వచ్చేసరికి నిత్యం ఏదోక అనారోగ్యమే తనకి. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా శాశ్వత పరిష్కారం మాత్రం దొరక లేదు. ఎన్నో పరీక్షల తర్వాత పాలలో కల్తీ వల్ల ఆ చిన్నారి అలర్జీలకు గురవుతోందని చెప్పారు. దాంతో బయట పాలు మానేసింది రూపాలి. కానీ పాలు, వాటి ఉత్పత్తుల పోషకాలు పిల్లలకు చాలా అవసరం కదా.

Published : 24 Sep 2022 00:36 IST

తన కూతురి అనారోగ్యానికి కారణం కల్తీ పాలని తెలుసుకుంది. పాపకు స్వచ్ఛమైన పాలను అందించాలనుకుంది. కానీ ఆమెలోని తల్లి మనసు అక్కడితో ఆగలేదు. నా కూతురు సరే మిగిలిన పసి పిల్లలో అనుకుంది. అదే ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. నాలుగేళ్లలో కోట్ల వార్షికాదాయాన్ని అందుకునే స్థాయికి చేర్చింది. పైగా ఎందరో రైతులకు, గ్రామీణులకు ఉపాధినీ కల్పిస్తున్న రూపాలీ కకాడే స్ఫూర్తి ప్రయాణమిది...

రూపాలీకో పాప. పుట్టినప్పుడు బాగానే ఉన్నా అయిదేళ్లు వచ్చేసరికి నిత్యం ఏదోక అనారోగ్యమే తనకి. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా శాశ్వత పరిష్కారం మాత్రం దొరక లేదు. ఎన్నో పరీక్షల తర్వాత పాలలో కల్తీ వల్ల ఆ చిన్నారి అలర్జీలకు గురవుతోందని చెప్పారు. దాంతో బయట పాలు మానేసింది రూపాలి. కానీ పాలు, వాటి ఉత్పత్తుల పోషకాలు పిల్లలకు చాలా అవసరం కదా. మరి పాపకు పోషకాలెలా? అర్థం కాలేదు. తామే ఆవులను కొంటే అని ఆలోచించింది. దాన్నే స్టార్టప్‌గా ప్రారంభించాలని, భర్తను తోడు తీసుకుని సొంతూరు పుణెలో కొందరు రైతులను కలుసుకొంది. వారి నుంచి లాల్‌ కాంధార్‌ జాతి ఆవులు 10 కొంది. ఉన్న కొద్ది పాటి సొంత స్థలంలో చిన్న డైరీఫాం ఏర్పాటు చేసింది. ఆ పాలను పాపకు అలవాటు చేసింది. పసిపిల్లలు ఉన్న స్నేహితులకు, తెలిసిన కుటుంబాలకూ పంపిణీ చేసేది. పాలను తీసిన వెంటనే చిల్లర్స్‌లో 4 డిగ్రీల సెల్సియస్‌లో భద్రపరిచి, మరుసటి రోజుకల్లా పంపిణీ చేయడం, పాల ఉత్పత్తులను వెంటనే విక్రయించడం మొదలుపెట్టారు. అలా 2018లో ‘ట్రూలీ దేశీ’ ప్రారంభమయింది.

100కు పెరిగి..

తర్వాత రూపాలీ హెల్త్‌కేర్‌ అండ్‌ ఆర్గానిక్‌ ప్రాడక్ట్స్‌ తయారీ ప్రారంభించింది. నెయ్యి, వెన్న, పనీర్‌ వంటి తాజా పాల ఉత్పత్తులకు మంచి స్పందన వచ్చేది. దాంతో మావల్‌ తాలూకాలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశాం అంటుంది రూపాలీ. ‘ఏడాదికే ఆర్డర్లు పెరిగాయి. రసాయనరహితంగా స్వచ్ఛమైన, తాజా పాల రుచి వినియోగదారులను పెంచింది. రెండో ఏడాదికల్లా కుల్హాడ్‌ దహీ, పెరుగు, మజ్జిగ, కోవా, పనీర్‌ వంటి ఉత్పత్తులనూ చేర్చాం. పాలను తీసిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందిస్తాం. 10తో మొదలుపెట్టి ఈ నాలుగేళ్లలో 100కు పైగా ఆవులను కొన్నాం. 60 మంది స్థానిక రైతులతోనూ అనుసంధానమయ్యాం. వారి సాయంతో గోమూత్రం, పేడ సేకరించి, సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాం. వీటి లాభాల్లో రైతులనూ భాగస్వాములను చేస్తున్నాం. వారి భూముల్లో సేంద్రియ పంటలను పండించేలా చేయూతనందిస్తున్నాం. బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో రోజూ 15 క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నాం. దీన్ని రైతుల కుటుంబాలు వాడుకుంటున్నాయి’ అని చెప్పుకొస్తున్న రూపాలీ ఇప్పుడు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. తన సంస్థ వార్షికాదాయం రూ.2.71 కోట్లు. త్వరలో పాలతో ఐస్‌క్రీంలు తదితర కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చే పనిలో ఉంది. వీటన్నింటికన్నా మా ఉత్పత్తులు వాడే పిల్లల ఆరోగ్యాలే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తాయి అంటారు తను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్