స్వప్నిద్దాం.. శ్రమిద్దాం.. సాధిద్దాం!

కలలు ఎవరైనా కనొచ్చు. వాటిని నిజం చేసుకుంటే ఇదిగో వీళ్లలా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అయితే ఆ దారిలో కన్నీళ్లు, కష్టాలూ ఉంటాయి.. వీళ్లూ వాటన్నింటినీ దిగమింగుకొని శ్రమించారు, సాధించారు. అలాగని ఆగిపోయారా? లేదు. ‘ప్రపంచ కలల దినోత్సవం’ సందర్భంగా వాళ్ల కలల ప్రయాణం ఎలా సాగుతోందో చదివేయండి.

Updated : 25 Sep 2022 07:34 IST

కలలు ఎవరైనా కనొచ్చు. వాటిని నిజం చేసుకుంటే ఇదిగో వీళ్లలా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అయితే ఆ దారిలో కన్నీళ్లు, కష్టాలూ ఉంటాయి.. వీళ్లూ వాటన్నింటినీ దిగమింగుకొని శ్రమించారు, సాధించారు. అలాగని ఆగిపోయారా? లేదు. ‘ప్రపంచ కలల దినోత్సవం’ సందర్భంగా వాళ్ల కలల ప్రయాణం ఎలా సాగుతోందో చదివేయండి.


లింగ సమానత్వం చూడాలి..

సుమతి, డీఐజీ, విమెన్‌ సేఫ్టీ వింగ్‌, తెలంగాణ

దృఢసంకల్పం, కష్టపడేతత్వంతో సాగాలన్నదే నా కల. యువతలో ఉండే ఉత్సాహం, ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆసక్తి చూసినప్పుడు నాకూ భవిష్యత్తుపై కొత్త ఆశలు కలుగుతుంటాయి. ఈతరం పిల్లల ప్రవర్తన చూస్తోంటే త్వరలోనే ఈ సమాజంలో లింగ సమానత్వం సాధిస్తామనిపిస్తోంది. నా ఉద్దేశం ప్రకారం.. లింగ సమానత్వం అంటే సమాన అవకాశాలు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు భిన్నం, వాళ్లతో పోటీపడలేరు.. అన్న భావనల్ని పక్కన పెట్టినప్పుడే ప్రశాంతమైన, పురోగతిలో సాగే సమాజాన్ని చూడగలం. అలాంటి వాతావరణాన్ని చూడాలన్నది నా కల.


ఆ సినిమాలు చేయాలనుంది:  రష్మిక మందన్నా

అనుకోకుండా సినిమాల్లోకొచ్చా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్నా. నటన, నా ఆహార్యం, ప్రవర్తన అన్నింటి మీదా విమర్శలే. తప్పు చేస్తున్నానా? ఈ రంగమే నాకు సరిపడదా అనుకున్న రోజులూ ఉన్నాయి. వాళ్లకి నా పనితోనే సమాధానమివ్వాలనుకున్నా. నటిగా కాదు.. పాన్‌ ఇండియా నటిని అనిపించుకోవాలని కలలు కన్నా. ‘పుష్ప’తో అది నెరవేరింది. నేనూ సాధారణ అమ్మాయినే. సినిమా తారలు అమితాబ్‌బచ్చన్‌, విజయ్‌ అంటే ఇష్టం. వాళ్లనోసారి కలిసినా చాలనుకునేదాన్ని. వాళ్లతో కలిసి నటిస్తోంటే నా కల నిజమైందన్న భావన. ఆత్మకథ, హిస్టారికల్‌ సినిమాలు చేయాలనుంది. అందుకు నన్ను నేను ఇంకా మెరుగు పరచుకోవాలి. ఇప్పుడా పనిలోనే ఉన్నా. అనుకోవాలే కానీ అమ్మాయిలు ఏదైనా చేయగలరు. పెద్ద కలలు కనండి. వాటి కోసం కష్టపడండి. ఎవరో నవ్వారనో, కిందకి లాగేయాలని చూస్తున్నారనో ఆగిపోవద్దు. కర్ణాటకలోని కొడగు అనే చిన్న ప్రాంతం మాది. దేశమంతా గుర్తించే స్థాయికి ఎదిగా. నేను చేయగలిగానంటే మీరూ చేయగలరు. ప్రయత్నించండి చాలు.


ఒలింపిక్‌ పతకం కొట్టాలనీ! : నిఖత్‌ జరీన్‌

నన్ను బాక్సింగ్‌లో చేర్చినపుడు చాలామంది నాన్నతో ‘అది అబ్బాయిల ఆట. అమ్మాయినెందుకు చేర్చావు? తనకిక పెళ్లవుతుందా?’ అనేవారు. ఆయన మాత్రం ‘నువ్వివేం పట్టించుకోకు. నీ ఆట మీదే దృష్టిపెట్టు. నువ్వు సాధించిననాడు వీళ్లే నీతో ఫొటో కోసం పోటీ పడతారు’ అని ప్రోత్సహించారు. అప్పటినుంచీ అంతటి స్థాయిలో నిలవాలని కలలు కంటూ, దాన్ని నిజం చేసుకోవడానికి కష్టపడుతూ వచ్చా. ఇస్తాంబుల్‌లో ఛాంపియన్‌షిప్‌ గెలిచి దాన్ని నిజం చేసుకున్నా. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతుంటారు కదా! అలా నా పేరూ ట్రెండ్‌ అవ్వాలన్నది నా కల. అదీ నెరవేరింది. నాకు సల్మాన్‌ఖాన్‌ అంటే ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూస్తా. మొదటి సారి వరల్డ్‌ ఛాంపియన్‌ అయినప్పుడు ప్రధాని మోదీతో సహా అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్‌ఖాన్‌ నుంచీ ప్రశంస ఆశిస్తున్నప్పుడు ఆయన నన్ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. అది చూసినప్పుడు ఎంత సంబరపడ్డానో చెప్పలేను! ఆనంద భాష్పాలొచ్చేశాయి. ఒలింపిక్స్‌లో పతకం గెలిచి ప్రతి ఒక్క భారతీయుడికీ అంకితమివ్వాలన్నది నా కల. అది నెరవేరిన రోజు ముంబయి వెళ్లి సల్మాన్‌ఖాన్‌ను నేరుగా కలుస్తా. దానికోసం పంజాబ్‌లో కఠోర సాధన చేస్తున్నా.


వాళ్లని కదిలించేలా..  సుధా కొంగర ప్రసాద్‌, చిత్ర దర్శకురాలు

చిన్నప్పట్నుంచీ నా కల సినిమానే. దర్శకురాలిగా మంచి చిత్రాలను తెరకెక్కించాలనే కలను నిజం చేసుకుంటున్నా. మొదలుపెట్టినప్పటి నుంచి విడుదల వరకూ రోజూ ఏవో సవాళ్లు ఎదురవుతుంటే ఎందుకీ సినిమా తీయడానికి సిద్ధపడ్డానా అని అనుకోని రోజుండదు. అయినా సమస్యకు ఎదురెళ్లే తత్వం నాది. ప్రారంభిస్తే చివరివరకు ఆగను. నా చిత్రం విజయం సాధించాలి. జనానికి నచ్చాలి. నా కథను తెరపై చూసేటప్పుడు ప్రతి ప్రేక్షకుడూ దాన్ని వారి కథే అనుకోవాలి. అంతగా వారిని కదిలించాలి. అలా ఎక్కడా రాజీ పడకుండా తీస్తాను. నేను దర్శకత్వం వహించిన చిత్రాలు జాతీయ అవార్డులు అందుకున్నా... విజయవంతమైన దర్శకురాలిగా నిలిచినా... నాకు మరిన్ని కలలున్నాయి. మహిళలు ముఖ్య పాత్రలుగా ఉండే సినిమాలు తీయాలనేది నా కల. అటువంటి కథల కోసం చూస్తున్నా. వాటిని వెతికి పట్టుకోవడానికి పట్టుదలగా కృషి చేస్తున్నా. త్వరలో అటువంటి చిత్రాలను ఎంపిక చేసుకొని నేనే సొంతంగా నిర్మిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్