శ్మశానాలతో మొదలుపెట్టా...!

కెరియర్‌ని మొదలుపెట్టడమే.. శ్మశానవాటికల సుందరీకరణతో ప్రారంభించింది. భిన్నమైన ఆమె ఆలోచనా తీరు.. తక్కువ సమయంలో ఎన్నో విజయావకాశాలని అందించింది. హైదరాబాద్‌ నగరంలో వందకుపైగా పార్కులని డిజైన్‌ చేసిన సౌజన్యా కొత్తావార్‌ ప్రస్తుతం

Updated : 29 Sep 2022 07:04 IST

కెరియర్‌ని మొదలుపెట్టడమే.. శ్మశానవాటికల సుందరీకరణతో ప్రారంభించింది. భిన్నమైన ఆమె ఆలోచనా తీరు.. తక్కువ సమయంలో ఎన్నో విజయావకాశాలని అందించింది. హైదరాబాద్‌ నగరంలో వందకుపైగా పార్కులని డిజైన్‌ చేసిన సౌజన్యా కొత్తావార్‌ ప్రస్తుతం వందెకరాల బొటానికల్‌ గార్డెన్‌ సుందరీకరణలో తలమునకలై ఉంది...

‘జీవితం ఎలా సాగినా అంతిమ యాత్ర ప్రశాంతంగా, గౌరవంగా ఎందుకు సాగిపోకూడదు? ఆధునిక అవసరాలకు తగ్గట్టు శ్మశాన వాటికలని అందంగా డిజైన్‌ చేస్తే’.. ఆరేళ్ల క్రితం నాకీ ఆలోచన వచ్చినప్పుడు నేను 20 ఏళ్ల ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని. అందరూ వద్దన్నా పట్టుబట్టి ఈ థీసిస్‌ ఎంచుకున్నా. ఇందుకోసం శ్మశానవాటికల చుట్టూ తిరుగుతుంటే విచిత్రంగా చూసేవారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా మహాప్రస్థానాల నమూనాలు అందించా. బేగంపేట్‌, మల్లాపూర్‌, మాదాపూర్‌, ఫతుల్లాగూడాల్లో ఉన్న మహాప్రస్థానాలు వాటి రూపమే. ఫ్రీజర్లు, స్నానాల గదులు, డెత్‌ సర్టిఫికెట్లను అక్కడే ఇవ్వడం వంటివి నా ఆలోచనల్లో కొన్ని. వైవిధ్యంగా ఉండాలని ఆర్కిటెక్చర్‌ వృత్తిని ఎంచుకున్న నేను ఇలా ప్రయోగాత్మకంగా కెరియర్‌ని మొదలుపెట్టా. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న గణేష్‌ వ్యాపారవేత్త. అమ్మ అనురాధ... 30 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నారు. నిక్‌-మార్‌, జేఎన్‌ఏఎఫ్‌యూల నుంచి ల్యాండ్‌స్కేపింగ్‌, అడ్వాన్స్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ల్లో మాస్టర్స్‌ చేశా. చదువుతున్నప్పుడే వివోగ్‌ అనే ఆర్కిటెక్చర్‌ సంస్థని ప్రారంభించినా...తర్వాత దాన్ని  విస్తరించా. కాలేజీలో కొన్న ల్యాప్‌టాప్‌, నా సృజనాత్మకతే నా పెట్టుబడి.

మెగా కిచెన్‌ మలుపుతిప్పింది.. 

నానక్‌రామ్‌గూడలో ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులకు భోజనాలు అందించేందుకు ఓ భారీ వంట గది అవసరమైంది. లక్షమందికి ఒకే సారి వంట చేసేలా ఈ మెగాకిచెన్‌ని రూపొందించాలన్నారు. చిన్న ప్రాజెక్టులు చేసిన నాకు ఇది సవాలే. భారీ వంట పాత్రలు, ట్రాలీలు, వంట వ్యర్థాల పునర్వినియోగం, చెత్తనుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి, వేడిని నియంత్రించడం వంటి సదుపాయాలతో నేనిచ్చిన కిచెన్‌ డిజైన్‌ నిర్వాహకులకు బాగా నచ్చింది. ఇక వెనుతిరిగి చూడలేదు. విల్లాలు, రెస్టరెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, టౌన్‌షిప్‌లు, ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు ఇలా వరసగా చేసుకుంటూ వెళ్లాను. వీటిల్లో నాకు నచ్చిన ప్రాజెక్టులు పార్క్‌ల రూపకల్పన. ప్రభుత్వంతో కలిసి తెలంగాణాలో 100కి పైగా పార్కులు డిజైన్‌ చేశా. పత్రికానగర్‌లో.. స్కూల్‌కి దగ్గరగా ఒకటి డిజైన్‌ చేశా. స్కూల్‌లో పిల్లలు నేర్చుకున్న సైన్స్‌ని ప్రాక్టికల్‌గా తెలుసుకొనేందుకు వీలుగా రూపొందించిన పార్క్‌ ఇది. అలాగే ఏఎస్‌రావ్‌ నగర్‌, సికింద్రాబాద్‌లలో... మల్టీ జెనరేషన్‌ పార్క్‌ని డిజైన్‌ చేశా. పిల్లలు, టీనేజర్లు, పెద్దవాళ్లు... వీళ్లందరినీ వినోదపరిచేలా ఈ పార్క్‌ ఉంటుంది. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని పార్కులు డిజైన్‌ చేస్తున్నా. ఇలాంటివి నగరంలో.. 60కి పైగా థీమ్‌ పార్కులు డిజైన్‌ చేశాను. వేటికవే ప్రత్యేకం. ప్రస్తుతం తెలంగాణా స్టేట్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి నగరంలో వందెకరాల స్థలంలో బొటానికల్‌ గార్డెన్‌ని డిజైన్‌ చేస్తున్నా. జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్‌ తరాలకు కొన్ని మొక్కలని కానుకగా ఇచ్చేందుకు...  ఔషధవనం, ఆధ్యాత్మికవనం, కాస్మెటిక్‌గార్డెన్‌(సుందరవనం), దుంపలవనం ప్రధానంగా ఈ బొటానికల్‌ గార్డెన్‌ని రూపొందిస్తున్నా. ఇదొక అద్భుతమనే చెప్పాలి. మా సంస్థలో పాతికమంది ఉద్యోగులున్నారు. మేం చేస్తున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భువనగిరిలో...60 ఎకరాల స్థలంలో శ్రీచక్రం ఆకృతిలో నిర్మాణం అవుతున్న దేవాలయం. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. నేను చేసిన ప్రాజెక్టుల్లో ఆదాయం కన్నా... సంతృప్తి కోసం చేసినవే ఎక్కువ. మనమీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చనేది నా నమ్మకం. మావారు దయానంద్‌ ఇంజినీర్‌. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నాతో కలిసి పనిచేస్తున్నారు. చెల్లి శ్రావిక విదేశాల్లో స్థిరపడింది. నా కలలని కుటుంబం అర్థం చేసుకోకపోతే నేనిక్కడ ఉండేదాన్ని కాదేమో!

- ఉప్పుటూరు శ్రీనివాస్‌, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని