ఇసుక సైతం.. అవుతుంది శిల్పం!

ఇసుకతో పిచ్చుక గూళ్లు కట్టి సంబరపడని పిల్లలుండరు. తర్వాత ఆ సరదా పోతుంది. ఈ అమ్మాయి మాత్రం పెద్దయ్యాకా ఇసుకతో బొమ్మలు చెయ్యడం ఆపలేదు. దాంతోనే దేశవిదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. మన దేశంలో సైకత శిల్పులు అతి కొద్దిమందే. అమ్మాయిలు మరీ తక్కువ. మరి గౌరి ఈ అరుదైన రంగంలోకి ఎలా వచ్చిందంటే..

Published : 01 Oct 2022 00:32 IST

ఇసుకతో పిచ్చుక గూళ్లు కట్టి సంబరపడని పిల్లలుండరు. తర్వాత ఆ సరదా పోతుంది. ఈ అమ్మాయి మాత్రం పెద్దయ్యాకా ఇసుకతో బొమ్మలు చెయ్యడం ఆపలేదు. దాంతోనే దేశవిదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. మన దేశంలో సైకత శిల్పులు అతి కొద్దిమందే. అమ్మాయిలు మరీ తక్కువ. మరి గౌరి ఈ అరుదైన రంగంలోకి ఎలా వచ్చిందంటే..

గౌరికి చిన్నప్పట్నుంచీ కళలపై ఎక్కువాసక్తి. స్కూల్‌ రోజుల్లో బొమ్మలు గీస్తూ, వినూత్న ఆకృతుల్ని తయారుచేస్తూ ప్రత్యేకతను చాటుకునేది. వీళ్లది కర్ణాటక. అమ్మ నాగలాంబిక, నాన్న నంజుండస్వామి. చిన్నప్పట్నుంచీ గౌరి కళాకారిణి అవుతాననేేది. వాళ్లేమో ముందు బాగా చదువుకో అనేవారు. అందుకే మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసింది. అదయ్యాక తన ఇష్టాన్ని మళ్లీ అమ్మానాన్నలకు చెబితే తన శ్రద్ధాశక్తుల్ని, పట్టుదలను చూస్తున్న వాళ్లూ వెన్ను తట్టారు. ఇంకేం... ఫైన్‌ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసింది. ఏ కళ నేర్చుకోవాలన్నా.. గురువు కావాలి... గౌరీకి ఆసక్తే గురువయ్యింది. సైకతశిల్పులు నిర్వహించే వర్క్‌షాప్‌లకు వెళ్తూ, ఇంటర్నెట్‌ ద్వారానూ... నైపుణ్యం సంపాదించింది. ఒక్కో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దడానికి రెండు, మూడు రోజులు ఒక్కోసారి అంతకన్నా ఎక్కువే నిరంతరాయంగా పనిచేయాలి. ఎండ, వాన, చలి... కాలాన్ని బట్టి ఇసుకని సిద్ధం చేసుకోవాలి. వీటిని రూపొందించడానికి సృజనతోపాటు శారీరక శ్రమా ఎక్కువే. అయినీ ఈ కళపైన తనకున్న ప్రేమతో వాటిని అధిగమిస్తున్నానంటారు గౌరి.  శిల్పకారిణిగా 2011లో ప్రయాణాన్ని ప్రారంభించిన గౌరి దేశవిదేశాల్లో సైకత శిల్పాలను తీర్చిదిద్దుతూ ప్రశంసలు, గుర్తింపు సాధించింది. మైసూరు దసరా ఉత్సవాల్లో చాముండేశ్వరి, మహిషాసురమర్దిని, బాలి యాత్ర, ఒడిశా సాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో బొమ్మలు, మహాభారతం శిల్పాలతోపాటు స్వచ్ఛభారత్‌నూ ప్రజల్లోకి తీసుకెళుతూ ఆధ్యాత్మికంగా, సామాజికంగా చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దుబాయిలో కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ క్యామెల్‌ ఫెస్టివల్‌, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఈవెంట్‌ వంటి చోట్లా తన కళను ప్రదర్శించి మెప్పు పొందింది. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే అధికారులు గౌరికి తిరుమలలో సైకత శిల్పాన్ని చేసే అవకాశాన్ని ఇచ్చారు. రెండున్నర రోజులు శ్రమించి శ్రీకృష్ణుని విశ్వరూప దర్శన సైకత శిల్పాన్ని భారీగా రూపొందించి అబ్బురపరిచిందామె.

‘సంస్కృతీ సంప్రదాయాలు, కళలను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకు సైకత శిల్పకళను మార్గంగా ఎంచుకున్నా. ఎక్కడ సైకత శిల్పాల్ని చేసినా అవి కొద్దిరోజులే ఉంటాయి. అందుకే మైసూరులో తాత్కాలిక మ్యూజియాన్ని ఏర్పాటు చేశా. అక్కడ వందకుపైగా శిల్పాల్ని తయారు చేశా. శాశ్వత మ్యూజియం నా లక్ష్యం. దాంతో నా కళను, మన సంస్కృతినీ ప్రపంచానికి చాటుతా’ అంటోంది 31 ఏళ్ల గౌరి.

- కొల్లా వెంకటేష్‌, తిరుమల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని