సేంద్రియ సౌందర్య ఉత్పత్తులు

రసాయన రహిత సౌందర్యోత్పత్తులు ఈ అమ్మాయిలను ఆకర్షించాయి. వీటిని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలనుకొని సంస్థను ప్రారంభించారు. ఇప్పుడది వందల మందికి ఉపాధినివ్వడమే కాదు.. రూ.కోట్ల ఆదాయాన్నీ తెచ్చిపెడుతోంది.

Published : 11 Oct 2022 00:28 IST

రసాయన రహిత సౌందర్యోత్పత్తులు ఈ అమ్మాయిలను ఆకర్షించాయి. వీటిని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలనుకొని సంస్థను ప్రారంభించారు. ఇప్పుడది వందల మందికి ఉపాధినివ్వడమే కాదు.. రూ.కోట్ల ఆదాయాన్నీ తెచ్చిపెడుతోంది. అంతేనా వందకుపైగా దేశాలకు ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ బ్రాండ్‌గానూ నిలిచింది. అక్కాచెల్లెళ్లు అదితి, మాన్సి వ్యాస్‌ స్ఫూర్తి కథనమిది. 

నాన్నది ఫార్మా వ్యాపారం. ఆయనకు లాగే అదితి, మాన్సి వ్యాస్‌ వ్యాపారవేత్తలు అవ్వాలనుకున్నారు. వీళ్లది అహ్మదాబాద్‌. అదితి లండన్‌లో డిగ్రీ, స్విట్జర్లాండ్‌లో మాస్టర్స్‌ చదివింది. మాన్సి ఎంబీఏ చేసింది. విదేశాల్లో సేంద్రియపద్ధతిలో తయారయ్యే కాస్మెటిక్స్‌ వీళ్లను ఆకర్షించాయి. దీంతో దీన్నే వ్యాపారంగా ఎంచుకోవాలనుకొన్నారు. ‘సేంద్రియ ఉత్పత్తులపై పరిశోధన చేసి, మా ఉత్పత్తులకు కావాల్సినవి మేమే పండించాలనుకున్నాం. తయారీ, ప్యాకింగ్‌ వంటివీ మేమే చూసుకోవాలనుకున్నాం. ఉద్యోగాలు చేసి, సంపాదించిన రూ.25 లక్షలే పెట్టుబడి. రైతులకు శిక్షణ ఇచ్చి మా సొంత పొలంలోనే సేంద్రియ ఎరువులతో పండించడం మొదలుపెట్టాం. ఎరువుల కోసం డెయిరీనీ ఏర్పాటు చేసుకున్నాం. ఉత్పత్తుల తయారీపై ఎన్నో ప్రయోగాలు చేశాం. ఇందుకోసం ఆర్‌అండ్‌డీ విభాగాన్ని ఏర్పాటు చేసుకొని 2007లో ‘అజఫ్రాన్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌’ ప్రారంభించాం. మొదట ఆలివ్‌, పొద్దుతిరుగుడు నూనెలతో ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌, ఆపై స్కిన్‌కేర్‌ ఉత్పత్తులూ, చిన్నారులకు క్రీమ్‌లు తయారు చేశాం. ప్రారంభం నుంచే విక్రయాలు బాగుండటంతో ఏటా ఉత్పత్తుల సంఖ్య పెంచుతూ వచ్చాం. స్కిన్‌కేర్‌, హోంకేర్‌, బేబీ కేర్‌, వెల్‌నెస్‌ సహా పరిమళద్రవ్యాలు వంటివెన్నో తయారుచేస్తున్నాం. 40 హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం, గ్రీన్‌హౌజ్‌లు ఏర్పాటు చేసి చామంతి, జెరానియం, ఆల్ఫా, లెమన్‌బామ్‌, రోజ్‌మెరీ, కాలెండ్యులా వంటివి పెంచుతున్నాం. 2010లోనే ఎకోసెర్ట్‌, ఐఎస్‌ఓ అర్హత సాధించాం. 2019నాటికి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 2వేల దుకాణాల్లో మా ఉత్పత్తులు లభ్యమయ్యేలా చేశామ’ని చెబుతోంది అదితి.

ఆ సమయంలోనూ..

‘మా ఉత్పత్తులకు విదేశాల్లోనూ ఆదరణ పెరిగింది. కానీ కొవిడ్‌ మా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. అమ్మకాలు పడిపోయాయి. ఉపాధి కల్పించడం కష్టమైంది. దీన్ని ఓ సవాలుగా తీసుకున్నాం. సొంత వెబ్‌సైట్‌ రూపొందించి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ కామర్స్‌ వెబ్‌సైట్లతో ఒప్పందం చేసుకుని ఏడాది తిరిగేసరికి వినియోగదారులను సంపాదించగలిగాం. లండన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా 115 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నా’మని సంతోషంగా చెబుతోంది మాన్సి. ప్రణాళికబద్ధమైన ఆలోచన, ఓర్పుతో సాగితే ఎక్కడైనా రాణించగలమంటారీ అక్కాచెల్లెళ్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని