కూరగాయలమ్మే కుటుంబం నుంచి..

కైజర్‌ జహాన్‌, హఫీజ్‌ ఖాన్‌ దంపతులకు ఆరుగురు ఆడపిల్లలు.. అబ్బాయితోనే పేరు, గుర్తింపు అని భావించిన వాళ్లకి ఏడో సంతానంగా బాబు పుట్టాడు.

Published : 12 Oct 2022 00:33 IST

కైజర్‌ జహాన్‌, హఫీజ్‌ ఖాన్‌ దంపతులకు ఆరుగురు ఆడపిల్లలు.. అబ్బాయితోనే పేరు, గుర్తింపు అని భావించిన వాళ్లకి ఏడో సంతానంగా బాబు పుట్టాడు. కానీ వాళ్లు కోరుకున్న పేరు, గుర్తింపు రెండో అమ్మాయి ముంతాజ్‌ తెస్తోంది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆమెకు ‘మహిళల వర్ధమాన క్రీడాకారిణి’ పురస్కారం ప్రకటించింది.

ఖ్‌నవూకి చెందిన పేద కుటుంబంలో పుట్టిన 19 ఏళ్ల ముంతాజ్‌ భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి. దక్షిణాఫ్రికాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో ఎనిమిది గోల్స్‌ చేసి తన ప్రతిభను చాటింది. ఆ టోర్నీలో భారత్‌ నాలుగో స్థానంలో నిలవడంలో ముంతాజ్‌ది కీలక పాత్ర. ఈమె తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముతారు. రోజుకు రూ.300 సంపాదిస్తూ, చిన్న రేకుల షెడ్డులో ఉంటారు. ఆటల్లోకి వెళ్తానంటే తల్లిదండ్రులు వద్దంటారని ఇంట్లో చెప్పకుండానే స్కూల్లో హాకీ ప్రాక్టీసు చేసేది. లఖ్‌నవూలోని కేడీ సింగ్‌బాబు స్టేడియం హాస్టల్లో సీటు కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలుసుకుని.. తండ్రి నడిపే కూరగాయల రిక్షాని తొక్కుకుంటూ  8కి.మీ. దూరంలోని స్టేడియానికి వెళ్లింది. అది చూసిన కోచ్‌ నీలమ్‌ ఆమె చేత దరఖాస్తు చేయించింది. కోచ్‌లు ఆమెలోని పట్టుదలతోపాటు ప్రతిభనీ గుర్తించి సీటిచ్చారు. ఆ సమయంలో ముంతాజ్‌ను అక్కడ చేర్చేలా సాయపడింది అక్క ఫరా. ‘బాగా ఆడితే కొనసాగిద్దాం లేకుంటే మానిపించేద్దాం’ అంటూ తల్లిని ఒప్పించింది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండేది ముంతాజ్‌. ‘చురుకైన కదలిక, సహజమైన వేగం, త్వరగా అలసిపోకపోవడం.. లాంటి లక్షణాలు ముంతాజ్‌ సొంతం. ఏం చెప్పినా త్వరగా నేర్చుకుంటుంది. వాటికి తనవైన మెరుగులు దిద్దుకుంటుంది’ అంటూ ముంతాజ్‌ గురించి చెబుతారు ఆమె కోచ్‌లు నీలమ్‌ సిద్దిఖీ, రషీద్‌. ‘ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నా లక్ష్యం. కూరగాయలు అమ్మేవాళ్ల కూతురిగా కాకుండా, ఒలింపియన్‌గా నన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తా’ అంటుంది ముంతాజ్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్