క్రీడామణుల కోసమే.. ఆమె బ్రాండ్‌!

క్రీడలపై మక్కువ చూపే అమ్మాయిలెందరో! కానీ ఆటలంటే ఎంతో ఖర్చు. కష్టాలకోర్చి సత్తా చూపితేగానీ స్పాన్సర్లు దొరకరు. అక్కడిదాకా అయినా చేరాలి కదా? అందుకే చాలా మంది ప్రతిభ ఉండి కూడా వదిలేస్తారు.

Updated : 13 Oct 2022 03:23 IST

క్రీడలపై మక్కువ చూపే అమ్మాయిలెందరో! కానీ ఆటలంటే ఎంతో ఖర్చు. కష్టాలకోర్చి సత్తా చూపితేగానీ స్పాన్సర్లు దొరకరు. అక్కడిదాకా అయినా చేరాలి కదా? అందుకే చాలా మంది ప్రతిభ ఉండి కూడా వదిలేస్తారు. అలాంటి వారికి సాయం చేయాలనుకుంది మేఘ. తన సంస్థ ద్వారా క్రీడామణులను తీర్చిదిద్దడమే కాదు.. వారికోసం సాధనకు అనుకూల దుస్తులనీ రూపొందిస్తోంది.

‘దేశంలో చాలామంది క్రీడాకారిణులు గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి వచ్చిన వాళ్లే. వాళ్ల ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రమే! ఇల్లు గడవడమే కష్టమైన వారెందరో. ఇక పోషకాహారం, సరైన శిక్షణ అంటే తలకు మించిన భారం. పీవీ సింధు, సానియా మిర్జా, సైనా నెహ్వాల్‌ వంటి వారివల్ల దేశంలో మహిళా క్రీడాకారులకీ ఆదరణ పెరుగుతోంది. ఏ సాయమూ అందనివారికి దన్నుగా నిలిస్తే ఇలాంటి ఎంతోమందిని తయారు చేయొచ్చు’ అన్న ఆలోచన తట్టింది మేఘా దేశాయ్‌కి. ఈమెది ముంబయి. ఎంబీఏ పూర్తిచేసింది. పలు కార్పొరేట్‌, మీడియా సంస్థలకు మార్కెటింగ్‌ హెడ్‌గా పనిచేసింది. మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌, బ్రాండ్‌ ఇమేజింగ్‌ల్లో 20 ఏళ్ల అనుభవముంది. తనకు క్రీడలంటే చాలా ఇష్టం. స్వతహాగా డ్యాన్సర్‌. ఇంటర్నేషనల్‌ సర్టిఫైడ్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కూడా. క్రీడాకారిణులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2021లో ఇన్‌జిన్‌ (ఈఎన్‌జీఎన్‌) స్థాపించింది. ఇది ఆటలపై ఆసక్తి ఉన్న అమ్మాయిలకు అండగా నిలుస్తుంది.

‘ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేసి సాధన వస్త్రాల నుంచీ శిక్షకుల ఏర్పాటు, పోషకాహారం, మానసిక ఆరోగ్య నిపుణులను అందుబాటులో ఉంచడం వరకూ అన్నీ చూసుకుంటాం. వీరికి నెలవారీ జీతాల్ని ఇచ్చి మరీ వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాల్ని కల్పిస్తున్నాం’ అంటుంది మేఘ. తన చేయూతతో రాణిస్తున్న వారిలో ఒలింపిక్‌ స్విమ్మర్‌ మానాపటేల్‌, లాంగ్‌ జంపర్‌ శివాని సోమ్‌, తైక్వాండో అథ్లెట్‌ అనిషా అశ్వాల్‌ సహా మరెందరో ఉన్నారు. మరికొందరిని ఎంచుకునే ప్రయత్నంలో ఉంది. ‘కొవిడ్‌ తర్వాత అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఎక్సర్‌సైజ్‌కీ, క్రీడలకు అనుకూలమైన వస్త్రాలను రూపొందించి ఇన్‌జిన్‌ మొదటి స్టోర్‌ని ముంబయిలో ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్‌ సేవల్నీ అందిస్తున్నాం. తక్కువ ధరకి నాణ్యమైన, ఫ్యాషన్‌తో కూడినవి అందిస్తున్నా’మనే మేఘ.. దేశంలో క్రీడలంటే క్రికెట్‌కే ఆదరణ. ఇతర ఆటల గొప్పదనాన్ని పరిచయం చేస్తూనే సత్తా ఉన్న అమ్మాయిలను వెలుగులోకి తేవడమే ధ్యేయమంటోంది. తన సాయంతో ఎందరో సింధులు, సానియాలు తయారవ్వాలని కోరుకుందాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్