ధోనీ సమస్యే నాకూ ఎదురైంది!

క్రికెట్‌ నేర్చుకుని సెహ్వాగ్‌ అవుతావా? అబ్బాయిల హేళన.. కష్టపడి అమ్మాయిని క్రికెటర్‌ చేసినా ఏం లాభం? చుట్టుపక్కల వాళ్ల చులకన మాటలు.. ఇండియాకి ఆడితే మాత్రం ఆమేమైనా హర్భజన్‌ సింగా? పోలీస్‌ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉన్నతాధికారుల సమాధానం... ఇలాంటి అనుభవాలు, అవమానాలూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఎన్నో ఎదురయ్యాయి.

Updated : 17 Oct 2022 07:21 IST

క్రికెట్‌ నేర్చుకుని సెహ్వాగ్‌ అవుతావా? అబ్బాయిల హేళన.. కష్టపడి అమ్మాయిని క్రికెటర్‌ చేసినా ఏం లాభం? చుట్టుపక్కల వాళ్ల చులకన మాటలు.. ఇండియాకి ఆడితే మాత్రం ఆమేమైనా హర్భజన్‌ సింగా? పోలీస్‌ శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉన్నతాధికారుల సమాధానం... ఇలాంటి అనుభవాలు, అవమానాలూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఎన్నో ఎదురయ్యాయి. తను మాత్రం క్రికెట్‌ గురించి తప్ప మరే విషయాన్నీ సీరియస్‌గా ఆలోచించేది కాదు. 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు(137) ఆడిన మహిళగా రికార్డు సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా ఆసియా కప్‌నీ అందించిన హర్మన్‌ ప్రస్థానమిది...

పంజాబ్‌లోని మోగా హర్మన్‌ సొంతూరు. తండ్రి హర్మందర్‌. రాష్ట్రస్థాయి వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. ఆపైన జిల్లా కోర్టులో క్లర్క్‌గా స్థిరపడ్డారు. పిల్లల్నైనా క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనుకుని హర్మన్‌, ఆమె తమ్ముడు గుర్జీందర్‌లను ప్రోత్సహించారు. వాలీబాల్‌, హాకీ, ఫుట్‌బాల్‌.. అన్నీ ఆడించేవారు. హర్మన్‌ మాత్రం క్రికెట్‌ ఎంచుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌ను అనుకరించేది. అమ్మాయిలు లేకపోవడంతో గ్రౌండ్‌లో అబ్బాయిలతో కలిసి ఆడేది. అక్కడే హర్మన్‌ ఆటని చూశారు కమల్‌దీష్‌ సోధీ. మోగాలో ప్రఖ్యాత జ్ఞాన్‌ జ్యోతి స్కూల్‌ యజమాని ఆయన. అతని కొడుకు యద్వీందర్‌ క్రికెట్‌ కోచ్‌. తమ స్కూల్లో హర్మన్‌ని చేర్పించి ఆమె కోసం అమ్మాయిల క్రికెట్‌ జట్టుని తయారుచేశారు సోధీ. షూస్‌ నుంచి క్రికెట్‌ కిట్‌ వరకూ అన్నీ కొనిచ్చారు. యద్వీందర్‌ శిక్షణలో రాటుదేలిన హర్మన్‌ 2009లో భారత జట్టుకి ఎంపికైంది. 20 ఏళ్లకే జాతీయ జట్టులో స్థానం అంటే జీవితం మారిపోయినట్టేగా. కానీ హర్మన్‌ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే తను ఎంపికైంది మహిళల జట్టుకి!

ఇంట్లోవాళ్లకి భారమవడం ఇష్టం లేక ఉద్యోగం సంపాదించాలనుకుంది హర్మన్‌. తన కోచ్‌ సాయంతో పంజాబ్‌ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే ‘మహిళా క్రికెటర్లకీ ఉద్యోగం అంటే ఎలా’ అన్న బదులొచ్చింది. లాభం లేదని ఇష్టంలేకపోయినా ముంబయికి మకాం మార్చింది. మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ సాయంతో సచిన్‌ తెందుల్కర్‌ సిఫార్సుతో పశ్చిమ రైల్వేలో ‘చీఫ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌’గా 2014లో ఉద్యోగం సంపాదించింది. ఉండటానికి క్వార్టర్స్‌ దొరికినా ఒక పూట ఆఫీసుకి వెళ్లడం తప్పనిసరి. ఉదయాన్నే ఓ గంట క్రికెట్‌ ప్రాక్టీసు ముగించుకుని లోకల్‌ రైల్లో ఆఫీసుకి చేరుకునేది. ఒంటిగంట వరకూ ఉద్యోగ బాధ్యతలు.. సాయంత్రం ప్రాక్టీసు. గ్రౌండ్‌లో అమ్మాయిలకు పరిమితంగా సమయం ఇచ్చేవారు.  ‘ధోనీకి ఎదురైన సమస్యే నాకూ వచ్చింది. సంపాదన కోసం చూస్తే అసలు క్రికెట్‌కే దూర మవుతున్నట్లనిపించేది. ఉద్యోగం.. క్రికెట్‌ ఏదో ఒకటి తేల్చుకోవాలనుకున్నా. సరిగ్గా అప్పుడే జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌ జట్టు గెలిచినా, రన్నరప్‌గా నిలిచినా ఆఫీసుకి వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చే నిబంధన వచ్చింది. ఆ సమయంలో వరసగా రెండేళ్లపాటు ఆ అవకాశం నాకు వచ్చింది’ అంటుంది హర్మన్‌. మహిళా క్రికెటర్లకు బౌండరీ లైన్‌ దగ్గరగా ఉంటుంది. హర్మన్‌ కొట్టే సిక్సర్లు మాత్రం స్టాండ్స్‌లో పడేవి. దాంతో ఆమె అసాధారణ బ్యాటర్‌ అని త్వరగానే గుర్తించింది ప్రపంచం. 2016లో బిగ్‌ బాష్‌ లీగ్‌లో స్థానం సంపాదించి.. విదేశీ లీగ్‌ ఆడిన మొదటి భారతీయ క్రికెటర్‌గా నిలిచింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో 171 పరుగులు చేసి జట్టుని ఫైనల్‌కి తీసుకువెళ్లిన ఇన్నింగ్స్‌తో హర్మన్‌ కథే కాదు, ఏకంగా భారతీయ మహిళా క్రికెటర్ల కథే మారిపోయింది. రన్నరప్‌గా నిలిచినా బీసీసీఐ ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నగదు బహుమతి అందించింది. ఆపైన వాణిజ్య ప్రకటనలూ వచ్చాయి. అప్పుడే పంజాబ్‌ ప్రభుత్వం పిలిచి మరీ హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం భారత టీ20, వన్డే జట్లకీ నాయకత్వం వహిస్తోన్న హర్మన్‌ తాజాగా టీ20లో ఆసియా కప్‌ని అందించింది. ప్రపంచ కప్‌ లక్ష్యంగా దూసుకెళ్తోంది.


క్రికెట్‌ తప్ప నాకు బయట ప్రపంచం తెలీదు. కెరియర్‌ ముగిశాక నా అనుభవాన్ని అమ్మాయిలు క్రీడల్లో అడుగుపెట్టడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి వినియోగిస్తా. మేం పడిన కష్టాలు కొత్తగా ఇటువైపు వచ్చేవాళ్లకి ఎదురవ్వకుండా చూడటమే నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని