నిర్బంధాల దేశంలో...సంప్రదాయాల్ని తిరగరాసి...

ఆ దేశంలో మహిళలు క్రీడల్లోకి ప్రవేశించాలంటే వివక్ష, విమర్శలు, సవాళ్లెన్నింటినో దాటాలి. ఆటల వరకూ ఏదోలా నెగ్గుకొచ్చినా... కోచ్‌గా అంటే ససేమిరా అంటారు. ఒక మహిళ దగ్గర మేం నేర్చుకోవడం ఏంటి అన్నది వాళ్ల భావన. అటువంటి చోట తను బాస్కెట్‌బాల్‌ పురుషుల జట్టుకు తొలి మహిళా అసిస్టెంట్‌ కోచ్‌గా నియమితురాలైంది.

Published : 20 Oct 2022 00:23 IST

ఆ దేశంలో మహిళలు క్రీడల్లోకి ప్రవేశించాలంటే వివక్ష, విమర్శలు, సవాళ్లెన్నింటినో దాటాలి. ఆటల వరకూ ఏదోలా నెగ్గుకొచ్చినా... కోచ్‌గా అంటే ససేమిరా అంటారు. ఒక మహిళ దగ్గర మేం నేర్చుకోవడం ఏంటి అన్నది వాళ్ల భావన. అటువంటి చోట తను బాస్కెట్‌బాల్‌ పురుషుల జట్టుకు తొలి మహిళా అసిస్టెంట్‌ కోచ్‌గా నియమితురాలైంది. తన నైపుణ్యాలు, ప్రతిభతో ఓ ప్రతిష్ఠాత్మక క్లబ్‌ నుంచి ఆహ్వానాన్ని పొంది మరీ ఈ స్థానాన్ని సాధించిన ఫాతిమా రేయాద్‌ స్ఫూర్తి కథనమిది.

స్త్రీ, పురుషులిద్దరూ సమానమనే భావాన్ని ఫాతిమా ఇంటి నుంచే నేర్చుకుంది. దీనికి కారణం వాళ్ల అమ్మ క్రీడాకారిణి కావడమే. గల్ఫ్‌లోని బహ్రెయిన్‌  ఫాతిమా వాళ్లది. అమ్మ మహిళా బాస్కెట్‌ బాల్‌ జట్టుకు సారథ్యం వహించేది. తనతోపాటు రోజూ ఫాతిమా మైదానానికి వెళ్లేది. అలా క్రీడల మీద ఆసక్తిని పెంచుకుంది. టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, పరుగు, సైక్లింగ్‌లో పట్టు సంపాదించింది. తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌ తీసుకొంది. బాస్కెట్‌ బాల్‌లోనూ శిక్షణ తీసుకొన్న ఫాతిమా అందులో బాగా రాణించింది. తర్వాత బోధన మీద ఆసక్తితో ప్రపంచ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌లో లెవెల్‌ 2 హోల్డర్‌, కెనడియన్‌ బాస్కెట్‌బాల్‌లో లెవెల్‌ 3 నేషనల్‌ కోచ్‌ స్థాయికి చేరుకుంది.

అంతర్జాతీయ స్థాయే లక్ష్యం...

మొదట చిన్నపిల్లల జట్టుకు బాస్కెట్‌ బాల్‌లో ఫాతిమా శిక్షణ ఇచ్చేది. ఏఐ - నాజ్మా బాస్కెట్‌బాల్‌ క్లబ్‌ తన నైపుణ్యాలను గుర్తించి, కోచ్‌గా ఆహ్వానించింది. ఫాతిమా దాన్ని స్వీకరించడంతో ముందుగా అండర్‌ 11 మగపిల్లల జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించింది. ఈ స్థానానికి చేరాక కూడా ఆమె ఎంతో వివక్షను ఎదుర్కొంది. సంప్రదాయాలంటూ చాలామంది చేసే విమర్శలకు పనితీరుతోనే సమాధానం చెప్పింది. ఆ దేశంలో మగవారే కోచ్‌గా వ్యవహరించే సంప్రదాయాన్ని ఫాతిమా మార్చింది. అదే తర్వాత ఆమెను గల్ఫ్‌లోని ఓ ఇండోర్‌ స్టేడియంలో పురుషుల బాస్కెట్‌బాల్‌ జట్టుకు శిక్షణనిచ్చే వరకు తీసుకెళ్లింది. ‘బాల్యం నుంచి అమ్మే నాకు స్ఫూర్తి. క్రీడారంగంలో అడుగుపెట్టడానికి ఆమే.. కారణం. తనలాగే నేనూ నా కూతురిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నా. చీఫ్‌ కోచ్‌ స్థాయికి చేరి, దేశానికి అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ వచ్చేలా చేయాలనేదే నా లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో క్రీడల పట్ల తోటి మహిళల్లో స్ఫూర్తి కలిగించడానికి ప్రయత్నిస్తున్నా. ఎన్ని సవాళ్లను దాటి ఈ స్థానానికి వచ్చానో అందరికీ వివరిస్తుంటా. ధైర్యంగా ఎలా అడుగు ముందుకెయ్యాలో చెబుతుంటా. కొన్ని క్రీడలు పురుషుల కోసమేనని  చాలామంది భావిస్తుంటారు. అలాంటి ఆలోచనలను అందరి మనసుల్లో నుంచి దూరం చేయాలంటే ముందుగా మహిళలమైన మనలో మార్పు రావాలి. ఇందుకోసం కృషి, అంకితభావం ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించొచ్చు’ అంటున్న 33 ఏళ్ల ఫాతిమా తన కలలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్