శిక్షణ లేకుండానే.. దూసుకెళుతోంది!

2020 జాతీయస్థాయి కార్‌ రేసింగ్‌ పోటీ. దానిలో పాల్గొన్న ఓ కొత్తమ్మాయిని చూసి భవిష్యత్తులో అద్భుతాలు సాధిస్తుందని భావించారంతా! అప్పటికి ఆ అమ్మాయి సాధన మొదలుపెట్టి ఏడాదే అయ్యిందని వాళ్లకి తెలియదు.

Published : 21 Oct 2022 00:18 IST

2020 జాతీయస్థాయి కార్‌ రేసింగ్‌ పోటీ. దానిలో పాల్గొన్న ఓ కొత్తమ్మాయిని చూసి భవిష్యత్తులో అద్భుతాలు సాధిస్తుందని భావించారంతా! అప్పటికి ఆ అమ్మాయి సాధన మొదలుపెట్టి ఏడాదే అయ్యిందని వాళ్లకి తెలియదు. కానీ వాళ్లు ఊహించినట్టుగానే తనిప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడబోతోంది. తన విజయాల వెనుక ఓ విషాదం ఉంది. రేసర్‌ ప్రగతి గౌడ కథ ఇది!

అన్నయ్య ప్రజ్వల్‌కి వాహనాలంటే పిచ్చి. అతన్ని చూసి ప్రగతి కూడా వాటిపట్ల ఆకర్షితురాలైంది. వీళ్లది బెంగళూరు. నాన్న ప్రభుత్వోద్యోగి, అమ్మ గృహిణి. పిల్లల్ని సమానంగా పెంచారు. ప్రగతి బైకు, కార్లు నడపడం, అన్నలాగే రేసుల్లో పాల్గొనడం చూసి బంధువులు వారించినా వాళ్లు పట్టించుకో లేదు. ‘2019... అన్నయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మాకది పెద్ద షాక్‌. అమ్మా నాన్న నన్ను వాహనాల్నీ తాకనివ్వలేదు. ఇక రేసులంటే ససేమిరా అనేశారు. అన్నయ్యకి రేసులంటే ప్రాణం. చిన్నప్పట్నుంచీ నా వెన్నుతట్టిన  అన్నయ్య కల నెరవేర్చి తనకో నివాళి ఇవ్వాలనుకున్నా. ఇంట్లో చెప్పకుండా నేషనల్‌ జింఖానా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని గెలిచా. అప్పట్నుంచి ఏ రేసులో పాల్గొన్నా జనరల్‌ క్లాస్‌ (అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ పోటీపడతారు) టాప్‌ 12లో స్థానం తప్పనిసరి. తర్వాత నా పట్టుదల చూసి అమ్మా నాన్నా కాదనలేక పోయారు’ అని చెబుతోంది ప్రగతి. 2020 నేషనల్‌ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌ 10కి చేరింది. దేశ విదేశాల్లో పోటీపడి 50కిపైగా బహుమతులు సాధించింది. తాజాగా చెన్నైలో ఆసియా పసిఫిక్‌ ఎఫ్‌ఐఏ ర్యాలీలో అమ్మాయిల విభాగంలో ‘ర్యాలీ స్టార్‌’గా నిలిచింది ప్రగతి. ఇది మూడు దశల సంక్లిష్ట పోటీ. దీంతో 2023 పెరూలో నిర్వహించే ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ విమెన్స్‌ వరల్డ్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించింది. ‘ర్యాలీ స్టార్‌గా నిలవడానికి చాలా కష్టపడ్డా. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గర్వంగా ఉంది. అక్కడా గెలిచి దేశానికి పేరు తేవడమే లక్ష్య’మంటున్న ప్రగతి అన్నయ్య దగ్గర నేర్చుకుందే తప్ప రేసుల్లో ప్రొఫెషనల్‌ శిక్షణేమీ తీసుకోలేదు. ఫైనాన్స్‌లో పీజీ చేసిన తను ఉద్యోగం కూడా చేస్తోంది.

‘ఎవరైనా మీవల్ల కాదు అన్నా, మరేరకంగా భయపెట్టినా నచ్చింది చేయడానికి వెనకాడొద్దు. ఈ తత్వమే అమ్మాయిల్ని ముందుకు నడుపుతుంది’ అనే 25 ఏళ్ల ప్రగతి టెడెక్స్‌ స్పీకర్‌ కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్