5 లక్షలతో రూ.22 కోట్ల వ్యాపారం!

కొత్త రంగంలోకి అడుగుపెట్టాలన్న ఊహే కష్టం. కానీ చదువుకున్న దానికి పూర్తిగా భిన్నమైన రంగంలోకి అడుగుపెట్టింది పలక్‌. రూ.5 లక్షల పెట్టుబడిగా పెట్టి మూడేళ్లలోనే రూ.22 కోట్ల వ్యాపారంగా మార్చింది.

Updated : 23 Oct 2022 07:40 IST

కొత్త రంగంలోకి అడుగుపెట్టాలన్న ఊహే కష్టం. కానీ చదువుకున్న దానికి పూర్తిగా భిన్నమైన రంగంలోకి అడుగుపెట్టింది పలక్‌. రూ.5 లక్షల పెట్టుబడిగా పెట్టి మూడేళ్లలోనే రూ.22 కోట్ల వ్యాపారంగా మార్చింది. తన వ్యాపారంలో సమాజ హితమూ ఉండటం వల్లే రాణించగలుగుతున్నా అంటోంది. ఈమెవరో, తన వ్యాపారమేంటో.. చదివేయండి.

‘ప్రతి ఒక్కరి జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి- మనం పుట్టినదైతే.. రెండోది ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. అందరు భారతీయ అమ్మాయిల్లాగే బాగా చదివి ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకొని స్థిర పడాలన్న ఆలోచనతోనే ఉండే దాన్ని. కానీ శరణార్థులు నా మార్గాన్ని మార్చార’ంటుంది పలక్‌ మిధా. ఈమెది పంజాబ్‌లోని జలంధర్‌. ఇంజినీరింగవ్వగానే పెళ్లయింది. భర్తతో కలిసి జర్మనీ వెళ్లింది. అక్కడ ఉద్యోగంలో చేరి మేనేజర్‌గా ఎదిగింది. ఓరోజు కొందరు శరణార్థుల్ని చూసింది. సరైన తిండి లేక శుష్కించి పోయిన వాళ్లకోసం ఏదైనా చేయాలనుకుంది. త్వరగా శక్తిని అందించే పోషకాహారం గురించి అధ్యయనం మొదలుపెట్టింది పలక్‌. కొత్త సబ్జెక్టే అయినా సాయపడాలన్న కోరిక కొనసాగించేలా చేసింది. శాస్త్ర నైపుణ్యాలకోసం న్యూట్రిషనిస్ట్‌, ‘సర్టిఫైడ్‌ సప్లిమెంట్‌ అడ్వైజర్‌’  కోర్సుల్ని కూడా చదివింది.

ఇంట్లో వాళ్ల మీదే..
‘నాకు ఆరోగ్య స్పృహ ఎక్కువ. నేను అనుసరించే పద్ధతులను సోషల్‌ మీడియాలో పంచుకునే దాన్ని. న్యూట్రిషన్‌, సప్లిమెంట్ల గురించి అధ్యయనం చేశాక అర్థం అయింది.. నాకు నిజమైన ఆసక్తి దేనిమీద ఉందో. మా నాన్నకి స్పాండిలైటిస్‌, అమ్మకి ఆటోఇమ్యూన్‌ థైరాయిడ్‌. వాళ్లకి డైట్‌, సహజ సప్లిమెంట్లను చేసిచ్చా. త్వరలోనే కోలుకున్నారు. తమ్ముడికి చిన్నప్పట్నుంచీ ఒబెసిటీ.. వాడూ 40 కేజీలు తగ్గాడు. వీళ్లలో మార్పులతో నాకు నమ్మకం వచ్చింది. మరింత పరిశోధన చేసి 2018లో సహజ న్యూట్రిషన్‌ సప్లిమెంట్లను అందించే ‘పలక్‌ నోట్స్‌’ను గుడ్‌గావ్‌లో ప్రారంభించా. తయారీ ప్రారంభం కాగానే సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టా. ఉత్పత్తులు మా చేతికి అందేలోపే ఆర్డర్లు వచ్చా’యని సంతోషంగా చెబుతోందీ 36 ఏళ్లమ్మాయి.

ఒక్కరోజులోనే రూ.35వేలు అమ్మకాలు జరిగాయి. ఆ ఉత్సాహంతో కొత్త ఉత్పత్తుల మీదా దృష్టిపెట్టింది. సొంత వెబ్‌సైట్‌తో పాటు ఈకామర్స్‌ సంస్థల ద్వారానూ అమ్మేది. నమ్మకం చూరగొనడంతో గత ఏడాది (21-22) తన వ్యాపారం రూ.22 కోట్లకు చేరింది. దాదాపు 200 మంది సంస్థలో పనిచేస్తున్నారు. జర్మనీ నుంచే ఇక్కడి కార్యకలాపాలను చూసుకుంటోంది. చేస్తూ ఫ్రీలాన్సింగ్‌, ఆరేళ్ల పాపను చూసుకుంటూనే శరణార్థులకు పోషకాహారంపై సలహాలిస్తోంది. తన యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ఛానెళ్ల (పలక్‌ నోట్స్‌) ద్వారా రోజూ లైవ్‌లో వ్యాయామ పాఠాలనూ బోధిస్తుంది. ఫేస్‌బుక్‌లో 9.3, యూట్యూబ్‌లో 5 లక్షలకుపైగా మంది తనను అనుసరిస్తున్నారు. అందరికీ సహజ ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యమనే పలక్‌.. నచ్చినదాన్ని ఎంచుకుంటే అదెంత కష్టమైనా ఆనందంగా చేయగలమంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్