కళను బతికించి.. ఎందరికో ఉపాధినిచ్చి!
వందల ఏళ్ల చరిత్ర ఉన్న తమ సంప్రదాయ కళ మరుగున పడటాన్ని చూసి ఆమె దుఃఖపడింది. రాత్రింబవళ్లూ శ్రమించింది... అందులో పట్టు సంపాదించింది.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న తమ సంప్రదాయ కళ మరుగున పడటాన్ని చూసి ఆమె దుఃఖపడింది. రాత్రింబవళ్లూ శ్రమించింది... అందులో పట్టు సంపాదించింది. ఇప్పుడు వేలమందికి శిక్షణనిచ్చి ఈ కళను దేశ వ్యాప్తంగా పరిచయం చేస్తోంది... ఎదరికో ఉపాధీ కల్పిస్తోంది... ఇదంతా చేస్తోంది పట్టుమని పాతికేళ్ల కూడా నిండని మీనాక్షి...
ఎర్రటి కాన్వాస్ మీద బియ్యప్పిండితో పూలు, దేవుడి పాదాలు ఇతరత్రా బొమ్మలను అందంగా గీసే చిత్రకళ ‘అయిపన్’. ఇదో సంప్రదాయంగా ఒక తరం నుంచి మరొక తరం నేర్చుకునే వారు. కొన్నేళ్లుగా ఈ కళ తెలిసిన వారు తగ్గిపోయారు. ఈ మార్పును గుర్తించింది ఉత్తరాఖాండ్, నైనిటాల్‌కు చెందిన 24 ఏళ్ల మీనాక్షి.
ప్రత్యేకం... ఒకప్పుడు దీన్ని ‘అర్పన్’ అనే వారు. అంటే రాయడం అని అర్థం. అది కాస్తా ‘అయిపన్’గా మారింది. చేతిలో చివరి మూడు వేళ్లను మాత్రమే ఉపయోగించడం దీని మరో ప్రత్యేకత. ‘ఈ చిత్రాలు మా ఉత్తరాఖండ్ సంప్రదాయానికి ప్రతీక. శుభకార్యాలు, పండుగలకు ఇంటి ప్రాంగణాలు, ఆలయాల గోడలపై అయిపన్ కళను చిత్రీకరించే వారు. ఈ బొమ్మలకు దైవశక్తి ఉంటుందని, దుష్ట శక్తులను తరిమి కొడతాయని విశ్వసించే వారు. మా పూర్వీకులూ వీటిలో నిష్ణాతులు. కానీ మాకేమీ తెలియదు. ఈ కళ అరుదై పోతోందని తెలిసి దుఃఖపడ్డా. దీన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయడం కోసం ఓ ప్రణాళిక రూపొందించుకున్నా. నా డిగ్రీ అవ్వగానే 2018లో ‘మీనాకృతి’ని ప్రారంభించా’ అని వివరించింది మీనాక్షి.
సవాళ్లు.. ఈ కళను తను నేర్చుకోవడానికి అహోరాత్రులూ కృషి చేసింది మీనాక్షి. ‘చుట్టు పక్కల ప్రతి ఊరికీ వెళ్లి వృద్ధులతో మాట్లాడా. లైబ్రరీలకూ తిరిగా. కొందరు వారికి తెలిసింది నాకు నేర్పారు. ఓ ఏడాది అయ్యాక... అవగాహన వచ్చిందనిపించింది. ఇది అందరికీ నేర్పాలి. ‘కళ కోసం’ అంటే ఎవరొస్తారు? అందుకే ఉపాధిని జోడించా. కొందరు పేద యువతులకు నా ఆలోచనలను చెప్పాను. మొదట్లో ఒకరిద్దరే ముందుకొచ్చారు. వారికి నేర్పి నేమ్‌ప్లేట్లు, వాల్‌హ్యాంగింగ్స్ మీద అయిపన్ బొమ్మలు గీయించి సోషల్ మీడియాలో పెట్టా. అవి చూసి చాలామంది స్పందించారు. మెల్లగా మరి కొందరు మహిళలు నాతో కలిశారు. ఇపుడు రకరకాల కళాకృతులను విక్రయిస్తున్నాం. మా కేంద్రంలో 30 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరూ రూ.10, 15 వేలు ఆర్జిస్తున్నారు. బయట స్వయం ఉపాధి పొందుతున్న వారూ వందల మంది ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అయిపన్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. 20 వేల మందికి పైగా విద్యార్థులకు నేర్పా. ప్రదర్శనలలోనూ పాల్గొంటున్నా. అలంకరణ వస్తువులు, కెటిల్స్, పూజాథాలీ, రాఖీలు సహా పండుగలకు తగినట్లు వస్తువులకు ఈ డిజైన్లను జోడిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ఈ కళ చిరస్థాయిగా ఉంటుంది’ అని సంబరపడుతోన్న మీనాక్షిని అయిపన్ గర్ల్ అంటున్నారందరూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.