స్టార్టప్‌ల లాయరమ్మ!

ఇప్పుడంతా స్టార్టప్‌ల హవా! పెద్ద సంస్థలు, పరిశ్రమలన్నింటికీ ప్రత్యేక సేవలందించే న్యాయసంస్థలున్నాయి. తమ ఆలోచనకు వ్యాపార హోదా తేవడానికి కష్టపడుతున్న యువ వ్యాపారవేత్తలకు ఈ సంస్థలను భరించే శక్తి ఉండదు. అలాగని ఒక గొప్ప ఆలోచన మరుగున పడటమేనా? ఇలాంటి ప్రశ్నలెన్నో వేధించాయి శివాంజలిని.

Published : 11 Nov 2022 00:26 IST

ఇప్పుడంతా స్టార్టప్‌ల హవా! పెద్ద సంస్థలు, పరిశ్రమలన్నింటికీ ప్రత్యేక సేవలందించే న్యాయసంస్థలున్నాయి. తమ ఆలోచనకు వ్యాపార హోదా తేవడానికి కష్టపడుతున్న యువ వ్యాపారవేత్తలకు ఈ సంస్థలను భరించే శక్తి ఉండదు. అలాగని ఒక గొప్ప ఆలోచన మరుగున పడటమేనా? ఇలాంటి ప్రశ్నలెన్నో వేధించాయి శివాంజలిని. దానికి ఆమె పరిష్కారం ‘దస్తావేజ్‌’ వివిధ దేశాల్లోని వందల స్టార్టప్‌లకు మార్గదర్శి అవుతోంది.

‘లా చదువుతున్నప్పుడే పెద్ద సంస్థలు, లాయర్ల వద్ద ఇంటర్న్‌ అవకాశం! అదృష్టవంతురాలిననుకున్నా. అయితే వీళ్ల సేవలన్నీ పెద్ద సంస్థలకే! మరి చిన్న సంస్థల సంగతేంటి? నెలలోనే పెద్ద సంఖ్యలో స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. వాళ్లెలా నెగ్గుకొస్తున్నారన్న ఆలోచన వచ్చింది. కొందరిని కలిసి ఇదే విషయమడిగా. ఎన్ని అద్భుతమైన ఆలోచనలో! సంస్థ నమోదు, ఫౌండర్లుగా ఉన్న హక్కులు, వాటిని కాపాడుకోవడం వంటి విషయాలపైనా వారికి కనీస అవగాహన లేదు. అందుబాటులో ఉన్న ఎవరో ఒకరి సాయం తీసుకుంటున్నారు. వాళ్లకేమో స్టార్టప్‌లకు సంబంధించిన పరిజ్ఞానం ఉండదు. డబ్బుతోపాటు శ్రమా వృథా. వీళ్లకు నా సాయం అవసరమనిపించింది’ అంటుంది శివాంజలి మాలిక్‌. ఈమెది దిల్లీ. గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ నుంచి పట్టా అందుకుంది.

బృందాన్ని ఏర్పరచుకొని..

‘ఆలోచన రాగానే దూకేయాలనుకోలేదు. దీని గురించి అవగాహన పెంచుకోవాలనుకున్నా. సీనియర్లు, గతంలో పని చేసిన వారితో ఆలోచనను పంచుకున్నా. వివిధ అంశాలపై పని చేసే వారితో నెట్‌వర్క్‌ ఏర్పరచుకుని సేవలు ప్రారంభించా. సంస్థ చిన్నదైనా, పెద్దదైనా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమని నాకు తెలుసు. కాబట్టి, వ్యక్తిగత సమస్యలున్న వారే నన్ను ఆశ్రయిస్తారనుకున్నా. ఆశ్చర్యంగా స్టార్టప్‌లే సంప్రదించడం మొదలుపెట్టాయి. వీళ్లకు న్యాయపరమైన వాటితోపాటు ఆర్థిక సలహాదారులూ అవసరమని అర్థమైంది. దీంతో ప్రొఫెషనల్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలనూ ఏర్పాటు చేసేదాన్ని. నా మీద నాకు నమ్మకం వచ్చాక 2021 ఫిబ్రవరిలో ‘దస్తావేజ్‌’ సంస్థని ప్రారంభించా. స్టార్టప్‌ నమోదు దగ్గర్నుంచి, న్యాయవాదులు, సీఏలు, కంపెనీ సెక్రటరీలు... ఇలా అందరి సేవలూ అందిస్తున్నాం’ అని చెబుతోందీమె.

విదేశీ సేవలు..

‘సంస్థ ప్రారంభించి రెండేళ్లలోపే. ఇప్పటి వరకూ 200కుపైగా స్టార్టప్‌లకు సేవలందించాం. సంస్థ అన్నాక విదేశీ లావాదేవీలూ ఉంటాయిగా! అయితే అక్కడి చట్టాలు మనకు భిన్నం. దీనికీ ముందుగానే సిద్ధమయ్యా. అక్కడి లాయర్లతో ఒప్పందాలు చేసుకున్నా. స్థానిక వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే వాళ్లకు కావాల్సిన అదనపు సాయం మేమందిస్తాం. అలా ఏడు దేశాల్లోని సంస్థలకు సేవలందించా.  నా సంస్థ ఉద్యోగుల్లో అమ్మాయిలే ఎక్కువ. ఇంటర్న్‌లుగా చేస్తున్న వారూ ఉన్నారు. నేనొక సంస్థ నిర్వహిస్తున్న దాన్నే! ప్రారంభంలో ప్రతి రూపాయీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకే.. మొదటిసారి సలహా, సంప్రదింపులకు డబ్బులు తీసుకోను. వాళ్ల అవసరాలు తెలుసుకొని కస్టమైజ్‌డ్‌ ప్లాన్‌ రూపొందిస్తాం. ఎలా ముందుకెళ్లొచ్చో వివరంగా చెబుతా. ఆపై నమ్మకం ఉంటేనే సంప్రదించమని చెబుతా. చాలామంది మొదటిసారే నన్ను నమ్మి నాతో నడిచినవారే’ అని ఆనందంగా వివరిస్తోన్న శివాంజలి తన సంస్థ అభివృద్ధిపైనా దృష్టి పెడుతోంది. న్యాయసేవలకు టెక్నాలజీని జోడించే పనిలో ఉంది. అందరికీ ఉపయోగపడే న్యాయ అంశాల సమాచారాన్ని తన లింక్‌డిన్‌ ఖాతాలో రాస్తూ ఉంటుంది. 5 వేలమంది అనుసరించడమే కాదు.. ఆ సమాచారం తమకెంతో సాయపడుతోందని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉంటారు. ‘కష్టం తెలిసినవారికే సాయం విలువ అర్థమవుతుంది. నాకది తెలుసు. అందుకే ఈ సాయ’మంటున్న ఈమె ఎందరికో స్ఫూర్తి కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్