వైకల్యమున్నా... ఆత్మవిశ్వాసమే విజేతను చేసింది!

వైకల్యం అడ్డంకుల్ని సృష్టించినా సంకల్పం ఒక్కటే విజయం వైపు నడిపిస్తుందన్నది ఆ అమ్మాయి విశ్వాసం. తన అడుగులు మరికొందరికి దారిచూపాలన్నది తన తపన.

Published : 14 Nov 2022 00:18 IST

వైకల్యం అడ్డంకుల్ని సృష్టించినా సంకల్పం ఒక్కటే విజయం వైపు నడిపిస్తుందన్నది ఆ అమ్మాయి విశ్వాసం. తన అడుగులు మరికొందరికి దారిచూపాలన్నది తన తపన. అందుకే... ఎందరు నిరుత్సాహపరిచినా.. పట్టుదలతో అడుగులు వేసింది. డాన్స్‌తో మొదలై.. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్‌ డెఫ్‌ ఇంటర్నేషనల్‌- 22 పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆమే సరిత ముసుకు.

ఆమెది అందమైన రూపం.. కళ్లతోనే  నవరసాలను ఒలికిస్తుంది. కానీ పుట్టుకతో మూగ, చెవిటి. దాంతో సరిత సంభాషణ అంతా సైగలు, సంజ్ఞలతోనే. వరంగల్‌లోని ఒంటిమామిడిపల్లి స్వగ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో ఆరుగురు సంతానంలో చిన్నది. వీరిలో నలుగురు పుట్టకతోనే మూగ, చెవిటి. వరంగల్‌లోనే బధిరుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. తర్వాత ఇంటర్‌ చేసింది. చదువుకునేటప్పుడే నృత్యంపై ఆసక్తితో దాన్లో పట్టు సాధించింది. ఏదోఒకటి సాధించాలన్న తపనకు దీన్నే తొలిమెట్టుగా చేసుకుంది. తన ప్రతిభను ప్రదర్శించడానికి ఓ టీవీ రియాల్టీ షోలో అవకాశం వచ్చింది. అందులో నాలుగో స్థానంలో నిలబడటం తనలో ధైర్యాన్ని నింపింది.

సొంతంగా సాధన చేసి...

ఆ సమయంలోనే ఆమెకు మోడలింగ్‌ అభిరుచి కలిగింది. ఇంట్లో సొంతంగా సాధన చేస్తూ  క్యాట్‌వ్యాక్‌తో పాటు హావభావాలపైనా పట్టు తెచ్చుకుంది. తన ప్రతిభ చూసి అవకాశాలూ మొదలయ్యాయి. ఎన్నో దుస్తుల బ్రాండ్ల కోసం ర్యాంప్‌ వాక్‌లు చేసింది. అప్పుడే మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఇండియా 2017 పోటీల గురించి తెలుసుకుంది సరిత. అందులో పాల్గొని ‘వ్యూయర్స్‌ ఛాయిస్‌ మిస్‌ ఇండియా తెలంగాణ’ టైటిల్‌ని అందుకోవడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మిస్‌ ఇండియా ట్రెడిషనల్‌ క్వీన్‌, మిస్‌ క్యాట్‌ వాక్‌, తర్వాత  ఇంటర్నేషనల్‌ గ్లామ్‌ ఫ్యాషన్‌ వీక్‌లో డెఫ్‌ మోడల్‌గా పాల్గొంది. ఇవన్నీ ఎన్నో ప్రశంసల్నీ తెచ్చిపెట్టాయి. అలా స్నేహితులు, శ్రేయోభిలాషుల తోడ్పాటుతో ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్టర్‌ అండ్‌ మిస్‌ డెఫ్‌ ఇంటర్నేషనల్‌-2022 పోటీల్లో భారత్‌ తరుఫున పాల్గొంది. స్విమ్‌సూట్‌, డ్యాన్స్‌, ఫొటోషూట్‌... ఇలా పలు విభాగాల్లోనూ మొదటి స్థానం సాధించింది. తుది పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది.

సినిమాల్లోనూ...

‘త్రుటిలో కిరీటం తప్పినా.. నాలాంటి వారూ ఇలాంటి అవకాశాలను అందుకోవచ్చని తెలియజెప్పినందుకు సంతోషంగా ఉందంటారు’ సరిత. డ్యాన్స్‌లో ప్రతిభ, మోడల్‌గా గుర్తింపు.. కళ్లతోనే భావాలు పలికించే నేర్పు ఆమెకు సినిమా అవకాశాల్నీ తెచ్చిపెట్టాయి. బహుబలి తో పాటు కొన్ని చిత్రాల్లో చిన్న పాత్ర పోషిస్తోంది. మోడలింగ్‌లో మరింత రాణించాలని.. హైదరాబాద్‌లో హోర్డింగ్‌ల మీద తన ఫొటోలు చూసుకోవాలని ఉందనే సరిత ఆ లక్ష్యాలనూ సాధిస్తుందనడంలో అనుమానం లేదు.

- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్