అడ్డంకుల్ని ఫుట్‌బాల్ ఆడేసి...
ఫుట్‌బాల్ అంటే అబ్బాయిల ఆట అనుకుంటాం. ందులో అమ్మాయిలూ రాణించగలరని నిరూపించింది బెల్లంపల్లికి చెందిన మాసవేని వనిత.
తొలి మహిళా కోచ్
ఫుట్‌బాల్ అంటే అబ్బాయిల ఆట అనుకుంటాం. ందులో అమ్మాయిలూ రాణించగలరని నిరూపించింది బెల్లంపల్లికి చెందిన మాసవేని వనిత. అంతేకాదు... తనలాంటి ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలవాలనుకుంది. ఫుట్‌బాల్ కోచ్ కావాలని కలలు కంది. అడ్డంకులెన్ని ఎదురైనా, సూటిపోటి మాటలు ఈటెల్లా గుచ్చుకుంటున్నా... తన గురి తప్పలేదు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ఫుట్‌బాల్ కోచ్‌గా ఎంపికై నవ్విన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంటోంది. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా...
‘తండ్రి లేడు... త్వరగా పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుంది కదా’, ‘నలుగురూ ఆడపిల్లలే... ఆటలంటూ ఊళ్లవెంట తిరిగితే మీ అమ్మాయికి పెళ్లవుతుందా’... అంటూ అమ్మనెన్నెన్ని మాటలన్నారో. అవును మేం అమ్మాయిలమే కానీ... బాధ్యత మరిచిన వాళ్లం కాదు. భవిష్యత్తుపై నమ్మకం, ఆశ ఉన్నవాళ్లం అని గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకూడదని అమ్మ చెప్పిన మాటలు మమ్మల్ని కట్టిపడేసేవి. ఇప్పుడు అందరూ ‘వనిత కోచ్ అయ్యిందంటగా... ఎంత కష్టపడిందో’ అంటుంటే నవ్వొస్తుంది. అమ్మకు భలే గర్వంగానూ ఉంది. మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. నాన్న లింగయ్య, అమ్మ లక్ష్మి. మేం నలుగురు అమ్మాయిలం. అందరిలో చిన్నదాన్ని. మా నాన్న నా చిన్నతనంలోనే గని ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆ ఉద్యోగం అమ్మకు వచ్చింది. ఒంటరిగా కష్టపడుతూ... మమ్మల్ని చూసుకునేది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా... ఎప్పుడూ ఆత్మ విశ్వాసం కోల్పోయింది లేదు. ఆ ధైర్యమే మాకూ వచ్చింది.
ఆవిడే అమ్మని ఒప్పించారు...
మా మూడో అక్క జ్యోతి చిన్నప్పటి నుంచీ ఫుట్‌బాల్ ఆడేది. తనని చూస్తూ నాకూ ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. మొదట రన్నింగ్ చేసేదాన్ని. ప్రతిభ కనబరుస్తుండటంతో.... నన్ను ఫుట్‌బాల్ టీమ్‌లోకి తీసుకోవాలని అనుకున్నారు మా పీఈటీ రోజా వరకుమారి. ఎనిమిదో తరగతి తర్వాత కోచ్ రవికుమార్ ఇప్పటి వరకూ నా సాధనలో తోడున్నారు. నిజానికి ఆటలాడతానంటే అమ్మ మొదట ఒప్పుకోలేదు. ఆ సమయంలో మా పీఈటీనే ఇంటికి వచ్చి మరీ తనని ఒప్పించారు. ఆటల్లో పడి చదువుని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయనని అమ్మకి మాటిచ్చా. అయితే, అమ్మకూడా ఎందరు వ్యతిరేకించినా... తనకు నచ్చింది చేస్తుంది. నా పేరు నిలబెడతాది అనేది. నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. డిగ్రీ అయ్యాక బీపీడీ, ఎంపీడీ చేశా. ఆపై వివిధ పాఠశాలల్లో శిక్షకురాలిగా పనిచేశా. తర్వాత కొన్నాళ్లకి నా ఆలోచన మారింది. నాలా మరెంతో మంది ఆడపిల్లలు ఈ ఆటల్లోకి రావాలంటే నేను ఫుట్‌బాల్ కోచ్‌గా మారాలని నిర్ణయించుకున్నా. 2020లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి శిక్షకురాలిగా గుర్తింపు పొందాను. అదే సంవత్సరంలో కోల్‌కతాలో డిప్లొమా కోచింగ్ ఇన్ ఫుట్‌బాల్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నా.
గుర్తుపట్టి పలకరిస్తున్నారు...
ఇప్పుడు తెలంగాణలో తొలి మహిళా ఫుట్‌బాల్ కోచ్‌ని నేను. ఇక్కడిదాకా నా ప్రయాణం అంత సులువుగా ఏమీ జరగలేదు. కోల్‌కతా సెలక్షన్‌కి వెళ్లిన సమయంలోనే అక్క పెళ్లయ్యింది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా సరే... ఎలాగైనా అందులో ఎంపిక కావాలన్నది నా ఆశయం. అప్పుడు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆర్థికంగా నాకు అండగా నిలబడింది. అక్కడికి వెళ్లాక కూడా వాతావరణం, ఆహారం సరిపడక చాలా ఇక్కట్లు పడ్డా. అయినా సరే... అవకాశం రావడమే గొప్ప... దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని శ్రమించా. ఇప్పుడు కూడా ఈ వార్త ఈనాడు పత్రికలో వచ్చాకే అంతా గుర్తుపట్టారు. అమ్మని ప్రేమగా పలకరిస్తున్నారు. సింగరేణిలో ‘నీ కూతురు సాధించింది’ అంటూ సన్మానించారు. ఇప్పటివరకూ ఎనిమిది నేషనల్స్ ఆడాను. ఇండియా టీమ్‌లకు ఫుట్‌బాల్ కోచ్‌గా మారడమే నా లక్ష్యం. ఇప్పుడు లైసెన్స్ కోర్సులు పూర్తిచేసే పనిలో ఉన్నా. ప్రస్తుతం డి లైసెన్స్ పూర్తి అయ్యింది. జాతీయ స్థాయిలో కోచ్‌గా నిలబడాలంటే... ఇది తప్పనిసరి మరి. ప్రస్తుతం కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ ఏకలవ్య మోడల్ పాఠశాలలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్నా. నేను మాత్రమే గెలిస్తే సరిపోదు. ప్రతి అమ్మాయీ స్ఫూర్తి పొందాలి.
- ముత్తె వెంకటేష్, బెల్లంపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.