అప్పుడు కూడా పోలీసే అవుతా!

తప్పుచేస్తే తుపాకీ గురిపెట్టే కరకుదనం.. చూపుతిప్పుకోనివ్వని అందం.. ఈ రెండూ ఒకే ఒరలో ఇమిడిపోవడం అరుదు కదా! కానీ డయానా రామిరెజ్‌ని చూస్తే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది.

Updated : 17 Nov 2022 15:12 IST

తప్పుచేస్తే తుపాకీ గురిపెట్టే కరకుదనం.. చూపుతిప్పుకోనివ్వని అందం.. ఈ రెండూ ఒకే ఒరలో ఇమిడిపోవడం అరుదు కదా! కానీ డయానా రామిరెజ్‌ని చూస్తే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. అందుకే ‘ప్రపంచంలోనే అందమైన పోలీస్‌ ఆఫీసర్‌’ అంటూ ప్రజల ప్రశంసలతోపాటు తాజాగా ఇన్‌స్టాఫెస్ట్‌ అవార్డుకూ నామినేట్‌ అయిందీమె... 

కొలంబియాలోని మెడెల్లిన్‌... ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర నగరాల్లో ఒకటి. అక్కడ పోలీస్‌గా పనిచేయాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి. అవన్నీ నిండుగా ఉన్న డయానా మెడెల్లిన్‌ నగరంలో పోలీస్‌ జీవితం ఎలా ఉంటుందో చెబుతూ సామాజిక మాధ్యమాల్లో డాక్యుమెంట్‌ చేయాలనుకుంది. ఆ క్రమంలోనే వృత్తిపరంగా తన రోజువారీ జీవితానికి సంబంధించిన సాహసాలనూ, పర్యాటక ప్రాంతాల్లో తిరిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచేది. అలా ఆమె ప్రజలకు చేరువ అయ్యింది. ఇన్‌స్టాలో ఆమెకు 4లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. వీరంతా ఆమెను ‘అనుక్షణం మృత్యువుతో పోరాడే ఆ ప్రమాదకరమైన ఉద్యోగం చేసే బదులు మోడలింగ్‌లోకి వస్తే అందాల ప్రపంచానికి రారాణి అయిపోవచ్చు’ అంటూ సలహాలిచ్చారు. వాళ్లకు ఆమె చెప్పిన సమాధానం ఒకటే. ‘మోడలింగ్‌... పోలీస్‌ ఉద్యోగం ఈ రెండింటిలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకొనే అవకాశం మళ్లీ వస్తే పోలీస్‌ ఉద్యోగాన్నే ఎంచుకుంటా. నేరాలని అదుపులో పెట్టే అవకాశాన్ని నేను వదులుకోను’ అంటోంది డయానా. వృత్తిపట్ల అంకితభావం ఉన్న డయానా తాజాగా ‘ఇన్‌స్టాఫెస్ట్‌’ పురస్కారానికి నామినేట్‌ కావడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. తమ తమ వృత్తుల్లో రాణిస్తూనే డిజిటల్‌ కంటెంట్‌తో ఎక్కువ మంది నెటిజన్లని ఆకట్టుకొనే వారికి ఈ అవార్డుని అందిస్తున్నారు.

‘బెస్ట్‌ పోలీస్‌ లేదా మిలిటరీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ విభాగంలో ఈ ఏడాది డయానా నామినేట్‌ అయ్యింది. ‘అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించే వారికి సోషల్‌ మీడియా పెద్దపీట వేయడాన్ని చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది’ అని చెప్పుకొస్తున్న ఈ అందాల పోలీసు అధికారి ఇన్‌స్టాఫెస్ట్‌ అవార్డును అందుకోవాలని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్