వాటికోసం ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగం వదిలేశా!

ఆమె చేతిలో కార్క్‌ ఆభరణమైంది. పర్సులు, ల్యాప్‌టాప్‌బ్యాగులు, హ్యాండ్‌బ్యాగులుగా అరటిబెరడు మెరిసింది. ఇలా వృథాకు తన సృజనాత్మకత జోడిస్తూ, పెటా నుంచి అవార్డును అందుకున్న సుప్రియ షిర్సత్‌ స్ఫూర్తి కథనమిది.

Updated : 26 Apr 2023 00:55 IST

ఆమె చేతిలో కార్క్‌ ఆభరణమైంది. పర్సులు, ల్యాప్‌టాప్‌బ్యాగులు, హ్యాండ్‌బ్యాగులుగా అరటిబెరడు మెరిసింది. ఇలా వృథాకు తన సృజనాత్మకత జోడిస్తూ, పెటా నుంచి అవార్డును అందుకున్న సుప్రియ షిర్సత్‌ స్ఫూర్తి కథనమిది.

చిన్నప్పటి నుంచి ఆర్ట్‌, క్రాఫ్ట్స్‌ అంటే సుప్రియకు ఆసక్తి. ప్రకృతి దృశ్యాలను కాన్వాస్‌పై గీయడం ఆమె అభిరుచి. వృథా వస్త్రాలతో తయారు చేసిన ఉత్పత్తులంటే మనసు పారేసుకొనేవారీమె. ముంబయికి చెందిన సుప్రియ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగంలో చేరారు. అక్కడ మొబైల్‌ కామర్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగానికి హెడ్‌గా ఎదిగారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించడంలోనే కాదు, సవాళ్లను పరిష్కరించడంలోనూ ముందుండేవారు.

అక్కడే పేరు...

పర్యావరణహితంగా, ప్రకృతి సిద్ధమైన వాటితో ఫ్యాషన్‌ ఉత్పత్తులను తయారు చేయాలనే ఆలోచన తనను వెంటాడేది. అలానే ఎయిర్‌లైన్స్‌లో ఓ పదేళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నా వల్ల కాలేదంటారు సుప్రియ. ‘చిన్నప్పటి నుంచి కనిపించే ప్రతి ప్రకృతి దృశ్యాన్ని గీసి రంగులు నింపడం అలవాటు. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయడం కోసం అడవులకెళ్లే దాన్ని. అలా ప్రకృతితో విడదీయరాని బంధం ఏర్పడింది. ఓసారి మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ నేషనల్‌ పార్కుకెళ్లినప్పుడు అక్కడ చెట్ల బెరళ్ల గురించి తెలుసుకున్నా. ఆ అవగాహనే వృథా నుంచి ఫ్యాషన్‌ ఉత్పత్తులను తయారు చేయాలనే ఆలోచనను బలపరిచింది. ఆ వాతావరణంలో పొందిన అనుభూతి నా బ్రాండ్‌కు పేరు పెట్టేలా చేసింది. అదే ‘ఫరెట్‌’. ఫారెస్ట్‌లో ఎస్‌ తీసేసి ఈ పేరు పెట్టా. మొదలైతే పెట్టాను కానీ ఒక బ్రాండ్‌ను నిర్మించడం అనుకున్నంత తేలికకాదని ఆ తర్వాత అర్థమైంది. దాన్ని గురించి ఆలోచించడానికి, చర్చించడానికి రెండేళ్లు పట్టింది. చాలా ప్రయోగాల తర్వాత 2019లో ‘ఫరెట్‌’ ప్రారంభించి కార్క్‌ (ఓక్‌ చెట్టు బెరడు), అరటి నారతో ఆభరణాలు, హ్యాండ్‌బ్యాగులు, పౌచ్‌ల తయారీ మొదలుపెట్టా. ఇందులో మహారాష్ట్ర రైతులతో కలిసి పని చేస్తున్నా. అరటి దొప్పల నుంచి పీచు తీసి, పలు దశల్లో శుద్ధి చేస్తున్నాం. వాటితో రకరకాల ఉత్పత్తులు చేయడంలో స్థానిక హస్త కళాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నా. ప్రస్తుతం 250 మంది కళాకారులకు ఉపాధిని ఇవ్వగలుగుతున్నాం. మా ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి ఈకామర్స్‌లో నా పూర్వానుభవం ఉపయోగపడింది. మొదటిసారిగా ఒక శాకాహార బృందం భారీగా నిర్వహించిన కార్యక్రమంలో మా ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్ని అందుకొన్నా. అప్పుడు స్పందనెలా ఉంటుందో అని చాలా ఒత్తిడికి గురయ్యా. అయితే ఉత్పత్తులన్నీ అమ్ముడుపోవడమే కాకుండా ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా రావడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని వివరించారు సుప్రియ.

40 రకాలకుపైగా..

ఫరెట్‌ పేరుతో వాలెట్స్‌, ల్యాప్‌టాప్‌ బ్యాగులు, హ్యాండ్‌ బ్యాగులు, చిన్నారుల కంఠాభరణాలు, మహిళలకు లోలాకులు, బ్రాస్‌లెట్స్‌ వంటివి 40రకాలకుపైగా  ఉత్పత్తులున్నాయి. ‘సహజసిద్ధంగా తయారవుతున్న వీటిపై నేటి తరానికి ఆసక్తి పెరిగింది. రోజూ వందల్లో ఆర్డర్లు అందుకుంటున్నామం’టారు సుప్రియ. త్వరలో అవుట్‌లెట్స్‌ ఏర్పాటుకు సిద్ధపడుతున్నారీవిడ. తన ఉత్పత్తులు పర్యావరణ ప్రేమికుల ప్రశంసలూ పొందుతున్నాయి. పెటా నుంచి ఫరెట్‌ ‘వెగాన్‌ సర్టిఫికేషన్‌’ అందుకుంది. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ‘ఇండస్ట్రీ డిజైన్‌ లీడర్‌షిప్‌’, పెటా ‘వెగాన్‌ ఫ్యాషన్‌’ పురస్కారాలనూ దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్