రింగురింగుల... విజయం!

అప్పుడు యుబా ఇంటర్‌ చదువుతోంది. కాలేజ్‌లో ఏదో ప్రోగ్రామ్‌! ప్రత్యేకంగా కనిపించాలని చిన్న క్లిప్‌తో వెళ్లింది. అసలే రింగుల జుట్టు.. పైగా తలస్నానం చేసింది.

Published : 27 Apr 2023 00:09 IST

* అప్పుడు యుబా ఇంటర్‌ చదువుతోంది. కాలేజ్‌లో ఏదో ప్రోగ్రామ్‌! ప్రత్యేకంగా కనిపించాలని చిన్న క్లిప్‌తో వెళ్లింది. అసలే రింగుల జుట్టు.. పైగా తలస్నానం చేసింది. అదేమో కుప్పలా కనిపిస్తోంది. తన లెక్చరర్‌ జేబులోంచి చిన్న దువ్వెన తీసి, జుట్టులో పెట్టి ‘తిరిగి తీయడానికి ఒక రోజంతా పట్టేలా ఉందే!’ అన్నారట. దానికి తోటి విద్యార్థులంతా నవ్వేశారు. చాలా అవమానంలా తోచిందామెకు.

* ‘ఆ.. రింగుల జుట్టు’ అని ఆశ్చర్యపోయే వారే కాదు.. జుట్టు దువ్వుకోవడం ఆలస్యమైతే ఇంట్లోవాళ్లు, స్నేహితుల చిరాకు.. ద]ువ్వుతోంటే విరిగే దువ్వెనలు.. జుట్టు పట్టి ఉంచలేక మాటిమాటికీ తెగిపోయే రబ్బర్‌ బ్యాండ్లు.. గాలికి జుట్టంతా ఎగురుతోంటే విసిరే కామెంట్లతో హిన్షారాకీ విసుగొచ్చింది. అలాగని జుట్టుని మార్చలేరు కదా! మనలా ఇంకెంతో మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటూ ఉంటారు కదా అనుకొని దాని పరిష్కారానికి ప్రయత్నించారు. అది కాస్తా విజయవంతమైన వ్యాపారమైంది. ఇంతకీ వీళ్లెవరంటే..

యుబా ఖాన్‌ది ముంబయి. దంత వైద్యురాలు. అకౌంటింగ్‌లో డిగ్రీ చేసి, డెలాయిట్‌లో పనిచేస్తోంది హిన్షారా హబీబ్‌. తనదేమో కొచ్చి. ఇద్దరికీ దాదాపు పదేళ్ల వయసు తేడా. రింగుల జుట్టు సంరక్షణపై చిట్కాలు ఇచ్చే వాట్సప్‌ గ్రూపులో వీళ్లిద్దరూ సభ్యులు. అలా పరిచయమైంది. ఇద్దరి అనుభవాలూ పంచుకునేవారు. కేశ సంరక్షణకు విదేశీ ఉత్పత్తులను తెప్పించుకోవడమేమో ఇబ్బంది, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎలాగూ ఆ గ్రూపు కారణంగా సహజ పదార్థాలపై అవగాహన ఉంది. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడలేని వారి గురించీ ఆలోచించాక సొంతంగా వాళ్లే తయారు చేయాలనుకున్నారు. పరిశోధన, అనేక ప్రయత్నాల తర్వాత 2018లో ‘మ్యానెటైన్‌’ ప్రారంభించారు.

తాము చేసిన ఉత్పత్తులను ముందు తమపైనే ప్రయోగిం చుకున్నారు. వాట్సాప్‌ గ్రూపులోని వారికి పరిచయం చేస్తే సానుకూల స్పందన వచ్చింది. షాంపూ, హెయిర్‌ ప్యాక్‌లు, క్యాపులు, రబ్బర్‌ బ్యాండ్‌లు.. ఇలా వారికి అవసరమైన వాటన్నింటినీ తయారు చేయించి అమ్ముతున్నారు. వాట్సప్‌, సోషల్‌ మీడియాలో అమ్మకాలు పెరిగాక వెబ్‌సైట్‌నీ తాజాగా స్టోర్‌నీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ల వ్యాపారం రూ.కోటిన్నర పైనే! మరింత పట్టు తెచ్చుకోవాలని యుబా దుబాయ్‌లో హెయిర్‌ స్టైలింగ్‌లో మాస్టర్స్‌, అమెరికా యూనివర్సిటీల నుంచి ఆన్‌లైన్‌ కోర్సులూ చేసింది. ముగ్గురు పిల్లలను చూసుకుంటూ యుబా.. ఉద్యోగం చేస్తూ హిన్షారా తమ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తున్నారు. అందుకే వీళ్ల కృషి, ఆలోచన మెచ్చి ‘షార్క్‌ ట్యాంక్‌’ నుంచి రూ.75 లక్షల పెట్టుబడీ దక్కింది. ఈ వ్యాపారాన్ని వాళ్లు మొదలు పెట్టింది మాత్రం రూ.30 వేలతోనే! ఇబ్బందినే వ్యాపారంగా మలచుకున్న వీళ్ల తీరు బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని