హలో..మందులు వేసుకున్నారా..?
‘అరెరే.. మందులు వేసుకోవడం మర్చిపోయా’ అన్న సందర్భం మనలో చాలామందికి వస్తుంటుంది. అనారోగ్యంగా ఉన్న అమ్మానాన్న సమయానికి మెడిసిన్ తీసుకుంటున్నారా అన్న బెంగ మరికొందరిది. రోజూ గుర్తుచేయడం అన్నిసార్లూ సాధ్యమవదు.
‘అరెరే.. మందులు వేసుకోవడం మర్చిపోయా’ అన్న సందర్భం మనలో చాలామందికి వస్తుంటుంది. అనారోగ్యంగా ఉన్న అమ్మానాన్న సమయానికి మెడిసిన్ తీసుకుంటున్నారా అన్న బెంగ మరికొందరిది. రోజూ గుర్తుచేయడం అన్నిసార్లూ సాధ్యమవదు. అలాగని వదిలేస్తే సమస్య పెద్దదవదూ? ఇదే ఆలోచించారు స్వాతి పడాలియా. తన స్టార్టప్ ద్వారా దానికో మార్గం కనిపెట్టిన ఆవిడతో వసుంధర మాట్లాడింది.
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం దేశంలో దీర్ఘకాలిక వ్యాధులతో 70 శాతం మంది బాధపడుతోంటే.. 30- 40 శాతం మందే సమయానికి మందులు వేసుకుంటున్నారు. మిగతా అందరూ అశ్రద్ధ చేసేవారే! మనలోనూ ఇలాంటివారు చాలామందే! ఫలితమే జబ్బులు ముదరడం, ప్రాణాపాయ స్థితి ఏర్పడటం వంటివి. దీనికి పరిష్కారం కనిపెట్టాలనే ‘డోస్‌టాప్ స్మార్ట్‌పిల్ బాక్స్’ రూపొందించా. మాది దిల్లీ. నాన్న వేద్ ప్రకాశ్, అమ్మ వీణ. బీఫార్మసీ తరువాత ఎంబీఏ పూర్తిచేసి బెంగళూరులో స్థిరపడ్డా. ప్రముఖ ఫార్మా సంస్థల్లో మేనేజర్‌గా పనిచేశాను. వృత్తిరీత్యా క్షేత్రస్థాయిలో ఎక్కువగా ఉండేదాన్ని. వైద్యులతో సంబంధాలు నెరపడం. రోగుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి అనుగుణంగా పైవాళ్లకి సిఫారసులు చేయడం.. నా పని.
ఆ ఘటనతో...
నా స్నేహితురాలికి మూర్ఛ వ్యాధి. తను సమయానికి మందులు వేసుకోవడం తప్పనిసరి. ఓరోజు అనుకోకుండా మర్చిపోయి రెండుసార్లు వేసుకుంది. వైద్యులు చెప్పినట్లే కాదు.. సూచించిన డోస్‌లో వేసుకోకపోయినా ప్రమాదమే. దీంతో తన పరిస్థితి సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఈ ఘటన నన్ను చాలా ఆలోచింప చేసింది. నా అనుభవంతో క్షేత్రస్థాయిలో సర్వే చేశా. చిన్న కారణాలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లని చూసి ఆశ్చర్యపోయా. ఇంట్లో నాన్న, సహోద్యోగుల నుంచీ ‘మర్చిపోయా’, ‘సమయం లేదు’, ‘బిజీ షెడ్యూల్‌లో ఎక్కడ గుర్తుంటుంది’ అన్న సమాధానాలొచ్చేవి. బెంగళూరు, దిల్లీ.. ఇలా వివిధ నగరాలకు చెందిన చాలామందితో మాట్లాడా. అందరి దగ్గర్నుంచీ ఇలాంటి స్పందనే. దీనికి పరిష్కారాలేమున్నాయా అని వెదికా. కొన్ని మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ అందరూ చదువుకున్న వాళ్లే ఉండరు కదా! సాంకేతికత పరిచయం లేని వారికీ సాయమందాలను కున్నా.
నావల్ల కాదనుకున్నా..
వీటన్నింటికీ ఏడాది పట్టింది. ఇక పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. సాంకేతిక సహాయం కోసం వెతకని చోటులేదు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు స్టార్టప్.. ఒత్తిడి అనిపించేది. డెవలపర్ల కోసం స్నేహితుల సాయం కోరేదాన్ని. కొందరు సానుకూలంగా స్పందించినా.. చాలామంది ‘ఎందుకు నీకివన్నీ? చక్కగా ఉద్యోగం చేసుకోక అర్థంలేని ప్రయత్నాలు’ అంటూ హేళన చేసేవారు. ఏదైతేనేం చివరికి నలుగుర్ని నియమించుకున్నా. నా జీతం, దాచుకున్న డబ్బులు రూ.40 లక్షల దాకా పెట్టుబడి పెట్టా. ఆఫీసు సమయం మినహా మిగతాదంతా దీనికే కేటాయించేదాన్ని. చేతిలో డబ్బులు అయిపోయాయి. ‘ఇక నా వల్ల కాదేమో’ అనిపించిన క్షణాలూ బోలెడు. మళ్లీ.. మధ్యలో ఆపేస్తే ఇప్పటి వరకూ పడిన శ్రమంతా వృథా అన్న సంశయం. వీటన్నిటి మధ్యే... 200 మంది రోగులపై ట్రయల్స్ తర్వాత నాలుగేళ్లకు ‘స్మార్ట్ పిల్ బాక్స్’ తయారైంది.
పేరుకు తగ్గట్టుగానే ఇదో బాక్స్ లాంటిదే! వైద్యుల సూచనల మేరకు దానిలో మందులు నింపాలి. అది ఫోన్ నంబరుతో అటాచ్ అయి ఉంటుంది. మందులు తీసుకోవడం మర్చిపోతే అలారం మోగుతుంది. పట్టించుకోకపోతే సంబంధిత ఫోన్ నెంబరుకు సందేశం పంపడంతో వారికి గుర్తొస్తుంది. కంపెనీలతో, కొన్ని ఆస్పత్రులతో కలిసి పిల్‌బాక్స్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చాం. త్వరలో బహిరంగ మార్కెట్లోకీ అందుబాటులోకి తీసుకురానున్నా. ఇప్పుడు పూర్తి సమయం దీనిపైనే పనిచేస్తున్నా. ఇలానైనా మందులు క్రమం తప్పకుండా వేసుకునే వారి సంఖ్య పెరిగితే నా ఆశయం ఫలించినట్లే.
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.