కోటిన్నర ఉపకారవేతనం అందుకున్నా!
సిస్ట్‌లు, పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్.. ఏ నలుగురు మహిళలని పలకరించినా వీటిల్లో ఏదో ఒక సమస్య చెప్పుకొని బాధపడేవాళ్లే ఎక్కువ! డాక్టర్ శిల్ప పోతాప్రగడని ఆలోచింప చేసిన విషయం కూడా ఇదే.
సిస్ట్‌లు, పీసీఓడీ, ఎండోమెట్రియోసిస్.. ఏ నలుగురు మహిళలని పలకరించినా వీటిల్లో ఏదో ఒక సమస్య చెప్పుకొని బాధపడేవాళ్లే ఎక్కువ! డాక్టర్ శిల్ప పోతాప్రగడని ఆలోచింప చేసిన విషయం కూడా ఇదే. సుమారుగా కోటిన్నర రూపాయల ష్మిత్ ఫౌండేషన్ ఉపకారవేతనాన్ని మనదేశం నుంచి తొలిసారి అందుకున్నారామె. తన పరిశోధనలు మహిళలకు ఎలా మేలు చేస్తాయో వసుంధరకు వివరించారు..
‘పీసీఓడీ ఉంది. నెలసరి రావడానికి మందులు ఇస్తున్నా. వాడాక చూద్దాం..’ ఇలాంటి సంభాషణ మనలో చాలామంది వినే ఉంటాం. కానీ ఈ సమస్యలు కచ్చితంగా ఎందుకు వస్తున్నాయి? వస్తే సరైన మందు ఏంటి? అనే దానిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగలేదు. అందుకే నేనీ అంశాన్ని ఎంచుకున్నా. సైన్స్‌పై ఇష్టం పెరగడానికి మా కుటుంబమే కారణం. మా తాతగారిది విశాఖపట్నం. ఆయన ఉద్యోగరీత్యా కోల్‌కతాలో స్థిరపడ్డాక.. నేను పీజీకి వచ్చేంతవరకూ అక్కడే ఉండిపోయాం. అమ్మ సుజాత టీచర్. ఆమే నన్ను సైన్స్ వైపు నడిపించింది. నాన్న వెంకటరమణ వ్యాపారవేత్త. నేను జెనెటిక్స్‌లో పరిశోధనలు చేయాలనుకున్నారు. డిగ్రీ వరకూ కోల్‌కతాలో చదివాక.. హైదరాబాద్ వచ్చి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బయో కెమిస్ట్రీలో పీజీ చేశా. ఆ తర్వాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్‌ఆర్)లో పీహెచ్‌డీ చేశా. మన వెలుపలి శరీరంపై ఒత్తిడి ఉన్నట్టుగానే.. శరీరంలో అంతర్గతంగా కూడా ఒత్తిడి ఉంటుంది. అంటే రక్తకణాలు ఒకదానిపై ఒకటి చూపించే బలం లాంటిది. కణాల ఈ అంతర్గత బలాల్నే మెకనో బయాలజీ అంటారు. ఈ ప్రక్రియే మనలో క్యాన్సర్ కణాలు పెరగడానికి కారణం అవుతోందా?.. పీహెచ్‌డీలో ఇదే నా పరిశోధనాంశం. ఈ పరిశోధనలు చేస్తున్నప్పుడే ష్మిత్ ఫౌండేషన్ నుంచి పోస్ట్ డాక్టొరల్ అవకాశం వచ్చింది. కాకపోతే సరికొత్త అంశాన్ని రిసెర్చ్ కోసం ఎంచుకోవాలి. అప్పుడే మహిళల్లో నేను గమనించిన అనారోగ్య సమస్యలపై పరిశోధన చేయాలనుకున్నా. అన్నట్టు మావారు కూడా టాటా ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు చేసి.. తర్వాత మైక్రోసాఫ్ట్‌కి వచ్చేశారు. దాంతో ఆయన ప్రోత్సాహం కూడా దొరికింది నాకు.
ఎలుకలపై వద్దని..
ష్మిత్ ఫౌండేషన్‌కి టాటా ఇన్‌స్టిట్యూట్‌నే నాపేరుని నామినేట్ చేసింది. ఈ ఉపకారవేతనానికి ఎంపిక కావడానికి సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. గత ఏడాది జులైలో దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు అయ్యాయి. నేను ఈఅంశాన్నే ఎందుకు ఎంచుకున్నాను, ఈ పరిశోధనలతో మానవాళికి జరిగే మేలు గురించి చెప్పి ఒప్పించాలి. ఫోన్, ఆన్‌లైన్‌లో జరిగే ఇంటర్వ్యూల్లో అంతర్జాతీయస్థాయిలో పనిచేసే పరిశోధకులు, ప్రొఫెసర్లకు అవి వివరించాల్సి ఉంటుంది. సాధారణంగా కొత్త ఔషధాల తయారీ, జబ్బులను గుర్తించడం, ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి ఎలుకలపై ఔషధ పరీక్షలు జరుగుతుంటాయి. కానీ ఆడవాళ్లలో ఉండే రుతుక్రమం, గర్భధారణం ఎలుకలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అందుకే వాటిపై పనిచేసిన మందులు మనపై సమర్థంగా పనిచేయవు. వందశాతం ఫలితాలుండాలన్న లక్ష్యంతో.. జంతువుల్ని కాకుండా మానవ జీవకణాలనే తీసుకోవాలనుకున్నా. ఈ కణాలను ‘ఆర్గాన్ ఆన్ చిప్’ ద్వారా అభివృద్ధి చేయాలనుకున్నా. అంటే ల్యాబులో..చిప్‌పై మానవ అవయవాల అభివృద్ధిని పరిశీలించడం. ఇప్పటికే ఇలా ఊపిరితిత్తులపై పరిశోధించారు. అదే పద్ధతిలో గర్భసంచి, అండం పెరుగుదల దశల్లో ఉత్పన్నమయ్యే ఇబ్బందులు, పిండదశలోనే కలిగే అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చని వివరించా. అనేక వడపోతల తర్వాత ప్రపంచవ్యాప్తంగా 32 మందిని ఎంపిక చేస్తే మన దేశం నుంచి నేనూ ఉన్నాను. ఏడాదికి రూ.82లక్షల రూపాయల చొప్పున ఉపకారవేతనం ఇస్తారు. అమెరికా, ఐరోపా సహా ఎక్కడైనా సరే ప్రయోగశాలను ఎంచుకుని పరిశోధనలు చేయొచ్చు. జులై నుంచి పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. రెండేళ్లు పూర్తయ్యాక కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉపకారవేతనం అందుకున్న వారితోపాటు, నోబెల్ బహుమతి విజేతలూ, సైంటిస్టులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల నిపుణులతో మాకు సమావేశాలు ఉంటాయి. మా పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా చేయడం, మంచి కెరియర్‌ని ఎంచుకోవడం ఈ ఉపకారవేతనం లక్ష్యం. నా పరిశోధనలు మహిళలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం.
- బోరెల్లి సునీల్‌కుమార్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.