ఒక్క తిరస్కరణ... కోట్ల వ్యాపారమైంది

నటి కావాలని కలలుకందామె. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆశించినట్టుగా అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు ఒక వెబ్‌సిరీస్‌ దక్కింది. సంతోషపడేలోపే తిరస్కరణకు గురైంది. 

Updated : 11 May 2023 07:29 IST

నటి కావాలని కలలుకందామె. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆశించినట్టుగా అవకాశాలు రాలేదు. ఎట్టకేలకు ఒక వెబ్‌సిరీస్‌ దక్కింది. సంతోషపడేలోపే తిరస్కరణకు గురైంది. అదే తనను కోట్ల వ్యాపారానికి యజమానిని చేసిందంటున్నారు పారుల్‌ గులాటీ. నటనతోపాటు వ్యాపారంలోనూ రాణిస్తున్న ఆమె ప్రయాణంలో విశేషాలను ఇలా వివరిస్తున్నారు...

‘‘హరియాణలోని రోహ్‌తక్‌ గ్రామం మాది. ఇక్కడ ఆడపిల్లను పుట్టనివ్వరు. విద్య, ఉద్యోగం అందని ద్రాక్ష. ఊరు దాటనివ్వరు. వయసొచ్చాక వారికి నేర్పేది... పెళ్లయ్యాక ఎలా ఉండాలి, ఇల్లు, భర్త, అత్తామామల్ని ఎలా చూసుకోవాలి... అనే. వీటన్నిటి నుంచి బయటపడాలనుకున్నాను. అప్పుడే ఫేస్‌బుక్‌లో నా ఫొటోలను చూసి ఓ వ్యాపార ప్రకటనల సంస్థ వాళ్లు కాల్‌ చేశారు. అమ్మ సహాయంతో ముంబయి వెళ్లాను. 2007లో ఒక వాణిజ్య ప్రకటనలో నటించాను. నటనమీద ఆసక్తితో లండన్‌లోని రాడా (ది రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమటిక్‌ ఆర్ట్‌)లో శిక్షణ తీసుకున్నాను.

అనుకోని మలుపు

తిరిగొచ్చాక 2010లో ‘‘ఏ ప్యార్‌ న హోగా కమ్‌’’ హిందీ సీరియల్‌లో నటించాను. ఇందులో నా పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. పంజాబీ సినిమా అవకాశాన్నీ అందుకున్నా. అది ఫ్లాప్‌. ఏడాది గడిచింది. అవకాశాలు కరవయ్యాయి. నిలదొక్కుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశా. బరువు తగ్గాను, జుట్టు కత్తిరించాను. అనుకోకుండా ఒక కాల్‌. వెబ్‌సిరీస్‌లో నటించాలని. ఎగిరి గంతేశాను. కానీ జుట్టు చిన్నగా ఉందని వద్దన్నారు. హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ కోసం అడిగితే కుదరదన్నారు. ఆ తిరస్కరణే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘‘నిష్‌ హెయిర్‌’’ స్థాపనకు పునాదివేసింది.

ఇదేం పని అన్నారు

గతంలో సవరం, విగ్‌, హెయిర్‌ ఎక్సటెన్షన్స్‌ అంటే చాలా చిన్నచూపు. కానీ ఇప్పుడో... వీటికున్న డిమాండే వేరు. మార్కెట్లో ఉండే సింథటిక్స్‌ కన్నా నిజమైన జుట్టుతో నా ఉత్పత్తులు తయారుచేయాలనుకున్నా. స్నేహితులు, బంధువులు ఇదేం పని అన్నారు. ఎవరిదో జుట్టు తెచ్చి పట్టుకుంటావా, శుభ్రం చేస్తావా, మతిపోయిందా అన్నారు. ఇవి తయారుచేసే పద్ధతి వాళ్లకు నచ్చలేదు. నేను పట్టు విడవలేదు. వ్యాపారాభివృద్ధితో పాటు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించాను. అందరూ హేళన చేస్తే అమ్మ మాత్రం నీకు నచ్చింది చేయి అంది. కేవలం రూ.1300, అమ్మ దుస్తులు కుట్టే మెషిన్‌తో మొదలైంది నా వ్యాపార ప్రయాణం. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లే మా ప్రచార సాధనాలు. సందర్భానుసారంగా కాకుండా రోజువారీ వినియోగం మా ఉత్పత్తుల ప్రత్యేకత. నిర్వహణా సులభం. ఎప్పటికప్పుడు వీటిపై వీడియోలు చేసేదాన్ని. సామాన్యుల నుంచి తారల వరకు అన్ని స్థాయిల వారూ నా ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.70, 80 లక్షల దాకా సంపాదిస్తున్నా. ఇప్పటివరకు పంజాబీ, హిందీ సినిమాల్లో నటించాను. 100కు పైగా ప్రకటనల్లో కనిపించా. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లో చేస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో నన్ను పదిహేను లక్షల మంది అనుసరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని