అక్కడ వితంతువులెక్కువ..

సైనిక కుటుంబంలో పుట్టి పెరిగారామె. ఉన్నతవిద్యాభ్యాసం చేసి దేశవిదేశాల్లో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగంలో చేరారు. మారుమూల గ్రామీణ మహిళల పేదరికం చూసిన ఆమె తన కొలువునొదిలేశారు.

Published : 11 May 2023 00:32 IST

సైనిక కుటుంబంలో పుట్టి పెరిగారామె. ఉన్నతవిద్యాభ్యాసం చేసి దేశవిదేశాల్లో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగంలో చేరారు. మారుమూల గ్రామీణ మహిళల పేదరికం చూసిన ఆమె తన కొలువునొదిలేశారు. అలాంటి మహిళలకు ఆర్థికస్వావలంబన, పిల్లలకు విద్య నందించడంలో కృషి చేస్తున్న రావత్‌ స్ఫూర్తి కథనమిది.

మంచు కురిస్తే ఆ ప్రాంతంలో అడుగేయడమే కష్టం. అలాంటిది 22 ఏళ్ల వితంతువు ఇద్దరు చంటిపిల్లలతో అక్కడున్న పునరావాస కేంద్రానికొచ్చింది. సాయం కోసం నిలబడిన ఆమెను చూసినప్పుడు ఆ కేంద్ర నిర్వాహకురాలు రావత్‌ హాహ్నే హృదయం ద్రవించింది. ఉత్తరాఖండ్‌, ఛమోలీ జిల్లాలోని గోపేశ్వర్‌ ప్రాంతమది. పేరుకు పట్టణమైనా.. ఏ అభివృద్ధికీ నోచుకోలేదు. అక్కడ వితంతువుల సంఖ్యే ఎక్కువ. అటువంటివారి కోసం నిర్మించిన పునరావాస కేంద్రాన్ని రావత్‌ పర్యవేక్షించేవారు. సైనికాధికారిగా విధులు నిర్వహించి దివంగతులైన తన తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన కేంద్రమది. దీంతో రావత్‌ ఉద్యోగంతో పాటు పునరావాసకేంద్ర పర్యవేక్షణ బాధ్యతలనూ తీసుకొన్నారు.

రాజీనామాతో..

గోపేశ్వర్‌లో మగవారందరూ దాదాపు మద్యానికి బానిసలై అనారోగ్యాలతో చనిపోతుంటారని చెబుతారు రావత్‌. ‘ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తారు. భర్తలు చనిపోవడంతో చాలామంది చిన్నవయసులోనే వితంతువులుగా మారుతున్నారు. కుటుంబ పోషణకు వీరికి ఉపాధి ఉండదు. సంప్రదాయాలెక్కువ. నేను ఇంటర్నేషనల్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో విధులు నిర్వహించేదాన్ని. విదేశాల్లోనూ పర్యటించాల్సి వచ్చేది. దీంతోపాటు గోపేశ్వర్‌లోని ఈ పునరావాసకేంద్రాన్నీ పర్యవేక్షించేదాన్ని. ఈ మహిళలకు ఉపాధి కల్పించాలంటే వీరితోనే పూర్తిగా సమయం గడపాల్సి ఉంటుంది. అందుకే రాజీనామా చేశా. ఆ తర్వాత కుటుంబాలన్నింటినీ కలిసేదాన్ని. వీరిలో చాలామంది గృహ హింసకు గురవుతున్నట్లు గుర్తించా. ఇదొక పర్యాటకప్రాంతం కావడంతో దీనికి సంబంధించి ఏదైనా ప్రారంభించాలనుకున్నా. నాతో కలిసి పనిచేయడానికి మొదట ఎవరూ అంగీకరించలేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అందరూ చివరకు ఒప్పుకొన్నారని’ వివరిస్తారీమె.

సేవలందిస్తూ..

పర్యాటకులకు బస సౌకర్యాన్ని అందించడానికి రావత్‌ 2016లో ‘పీచెస్‌ అండ్‌ పియర్స్‌’ ప్రారంభించారు. దీంతోపాటు, పర్యావరణ పర్యాటకంగా ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ ‘ఫెర్న్‌వే ఫెయిర్‌ ట్రావెల్‌’ను జత చేశారు. అతిథులకు భోజన, బస సౌకర్యాల్లో సేవలందించడానికి మొదట 45మంది మహిళలను కేర్‌ టేకర్స్‌, కుక్స్‌, గైడ్స్‌గా విభజించి శిక్షణనందించాం. నైపుణ్యాలను పెంచుకోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి నేర్పారు. ఈ పర్యాటకం అభివృద్ధికి సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి పర్వతారోహణ, ఈత, బైకు రైడ్స్‌, జలపాతాల సందర్శన వంటివెన్నో జత చేశారు. స్థానిక గ్రామాల సంప్రదాయ నగలను తయారుచేయించి, అక్కడి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నారీమె. ప్రస్తుతం రావత్‌ చేయూతతో 300 మందికిపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు, సంస్థద్వారా వచ్చే లాభాలను చుట్టుపక్కల 21 గ్రామాల పాఠశాలలకు రావత్‌ వితరణగా అందిస్తున్నారు. బెంచీలు, కుర్చీలు, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలిస్తూ.. అందరికీ విద్య చేరేలా చేయూతనిస్తున్నారీమె. ‘మేం కల్పిస్తున్న హోం స్టే ప్రాజెక్టు దేశంలోనే అత్యుత్తమ సేవలందించేదిగా నిలవడం, ఇటీవల అడ్వంచర్‌ ట్రావెల్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితురాలిని కావడం సంతోషంగా ఉంది. సీజన్‌బట్టి ఇక్కడకు ఏటా వేలమంది వస్తారు. జామ్‌, పచ్చళ్ల తయారీలోనూ మహిళలకు  నైపుణ్యాలందించడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని’ చెబుతున్నారు రావత్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్